మరుపురాని ప్రయాణం మళ్లొచ్చె -హైదరాబాద్‌లో 25 డబుల్ డెక్కర్ బస్సులు -రూట్లివే -ముహుర్తం ఎప్పుడంటే
హైదరాబాద్ మహానగరానికి చార్మినార్ ఎంత ఫేమసో.. ఒకప్పుడు డబుల్ డెక్కర్ అన్నా అంతే క్రేజ్ ఉండేది. ఆ బస్సు ఎక్కేందుకు నగరవాసులు, జిల్లాల నుంచి వచ్చే వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవారు. రెండంతస్తుల బస్సులో పైనున్న డెక్కులో కూర్చొని ప్రయాణించడం నగరవాసులకు మరపురాని అనుభూతి. హిస్టరీ రిపీట్స్ అన్నట్లుగా ఆ ఎంజాయ్మెంట్ మరోసారి మన చెంతకొచ్చేయనుంది. హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సుల్ని తిరిగి ప్రవేశపెట్టే దిశగా టీఎస్ఆర్టీసీ చేస్తోన్న ప్రయత్నాలు కీలక దశకు చేరాయి. ఈ నెలాఖరులోనే బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికానుంది. అంతా అనుకున్నట్లే జరిగితే రెండు నెలల్లోపే సిటీ వాసులకు డబుల్ రైడ్ అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు..
రిహానా ట్వీట్ కంటే మోదీ తీరే డేంజర్ -నిరసనే ప్రజాస్వామ్యానికి జీవనాడి -రాజ్యసభలో సంచలన స్పీచ్

తొలి విడతలో 25 బస్సులు..
గతంలో నగరానికి ప్రత్యేకాకర్షణగా ఉండి, అంతుచిక్కని కారణాలతో కనుమరుగైన డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగరవాసులకు కనువిందు చేయబోతున్నాయి. మరో రెండు నెలల్లో బస్సులు సిటీ రోడ్లపై దూసుకుపోనున్నాయి. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని నిర్ణయించిన గ్రేటర్ ఆర్టీసీ.. ఆమేరకు టెండర్ల ప్రక్రియను చేపట్టింది. పూర్తిగా నిర్మించిన 25 డబుల్ డెక్కర్(నాన్ ఏసీ) బస్సుల కోసం తయారీ దారుల నుంచి టెండ్లను ఆహ్వానించింది. గురువారం (ఫిబ్రవరి 4న) నుంచే బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభంకాగా, ఈనెల 18న ప్రీ బిడ్ సమావేశాన్ని నిర్వహించి, బస్సులు ఎలా ఉండాలన్న విషయంలో తయారీదారులకు స్పష్టంగా వివరించనున్నారు. ఈనెల 25న టెండర్లు ఓపెన్ చేయడం ద్వారా ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బస్సులు రోడ్లపైకి రానున్నాయి..

అత్యాధునిక హంగులతో...
1972లో తొలిసారి భాగ్యనగరాన్ని పలుకరించిన డబుల్ డెక్కర్ బస్సులు.. 34 ఏళ్లపాటు సిటీ వాసులకు సేవలందించాయి. అప్పట్లో నగరానికి ప్రత్యేక శోభలా నిలిచిన డబుల్ డెక్కర్లను.. సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూడ్డమే గాక, ఒక్కసారైనా అందులో ప్రయాణించాలనే ఆసక్తి కనబరిచేవారు. 2006 నాటికి అవి పూర్తిగా కనుమరుగయ్యాయి. నేటి తరానికి నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల ప్రయాణ సదుపాయం కల్పించేందుకు సిద్ధమైన ఆర్టీసీ.. ఈసారి అత్యాధునిక హంగులతో కూడిన సర్వీసుల్ని సిద్ధం చేయనుంది. తొలి విడతగా ప్రవేశపెట్టనున్న 25 సర్వీసులు నాన్ ఏసీవే అయినప్పటికీ, బీఎస్-6 ప్రమాణాలు, సీఎంవీఆర్, టీఎస్ఎంవీ నిబంధనలకు అనుగుణంగా తయారైన బస్సుల్ని మాత్రమే నడుపనున్నారు. కొత్తగా రాబోయే డబుల్ డెక్కర్ బస్సులు 4.7 మీటర్ల ఎత్తుతో, 8.7మీటర్ల పొడవుతో సకల హంగులు ఉంటాయని టీఎస్ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ రఘునాథ్ రావు తెలిపారు. ఫిబ్రవరి 25న టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత రోజుల వ్యవధిలోనే సర్వీసులు మొదలయ్యే అవకాశాలున్నాయన ఆయన పేర్కొన్నారు. కాగా

బస్సు నంబర్ 7 Z.. అప్పుడో యాది..
సింగిల్ డెక్కర్ బస్సులో 43 మంది కూర్చుని ప్రయాణిస్తే.. డబుల్ డెక్కర్ బస్సులో కింది అంతస్తులో 34 మంది, పైఅంతస్తులో 32 మంది కూర్చొని వెళ్లేవారు. సిటీ బస్సుల్లో ఫుట్‌బోర్డు ప్రయాణాలు అప్పటి నుంచే ఉండేవి. డబుల్ డెక్కర్‌లో ఫుట్‌బోర్డుపై పదుల సంఖ్యలో ప్రయాణికులు నిల్చొని ప్రయాణించారు. అప్పటి యూత్ అదొక థ్రిల్‌గా ఫీల్ అయ్యేవారు. సికింద్రాబాద్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్ మీదుగా జూపార్కుకు వెళ్లే 7 Z నంబర్ బస్సుకు అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. సెలవు రోజులు, వీకెండ్స్‌లో ఆ బస్సులు పర్యాటకులతో కిక్కిరిసేవి. ఇక, సికింద్రాబాద్ - చార్మినార్ వరకు 8C నంబర్, మెహిదీపట్నం - సికింద్రాబాద్ వరకు 5C, సనత్‌నగర్ - చార్మినార్ 9నంబర్, కోఠి నుంచి పటాన్‌చెరుకు 225, సనత్‌నగర్ - సికింద్రాబాద్ వరకు 10నంబర్ తదితర రూట్లలో బస్సులు నడిచేవి. పనుల మీద వెళ్లేవారితోపాటు సరదాగా డబుల్ డెక్కర్ ఎక్కేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే..

మళ్లీ డబుల్ డెక్కర్లు తిరిగే రూట్లివే..
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సిటీలో చాలా చోట్ల ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చిన దరిమిలా డబుల్ డెక్కర్ బస్సుల ఫీజబులిటీపై ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ నేతృత్వంలో కసరత్తు చేసి రూట్లను కూడా దాదాపు ఖరారు చేశారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా నడపనున్న 25 బస్సులను.. రూట్ నెం.229 (సికింద్రాబాద్ - మేడ్చల్ వయా సుచిత్ర), రూట్ నెం.219 (సికింద్రాబాద్-పటాన్‌చెరు వయా బాలానగర్ క్రాస్ రోడ్డు), రూట్ నెం. 218 (కోఠి-పటాన్‌చెరు వయా అమీర్‌పేట), రూట్ నెం.9ఎక్స్ (సీబీఎస్-జీడిమెట్ల వయా అమీర్‌పేట), రూట్ నెం.118 (అఫ్జల్‌గంజ్-మెహిదీపట్నం)లను ఎంపిక చేశారు. దుర్గం చెరువుపై కొత్తగా కేబుల్ బ్రిడ్జి మీదుగా ఓ బస్సు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు.

నెటిజన్ నోస్టాల్జియాతో కదిలిన కేటీఆర్..
కొద్ది రోజుల క్రితం.. ఓ నెటిజన్ డబుల్ డెక్కర్ జర్నీని గుర్తుచేసుకుంటూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేసిన సందర్భంలో డబుల్ డెక్కర్ల పునరాగమనానికి నాంది పడింది. ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ స్పందించి.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో నగరమంతటా ఆసక్తిని రేపింది. డబుల్ డెక్కర్ బస్సుల్ని ఎందుకు రద్దు చేశారో తనకు కూడా తెలీదన్న కేటీఆర్.. ఫీజబులిటీని బట్టి మళ్లీ తెచ్చుకుందామని నెటిజన్లకు మాటిచ్చారు. ఆ వెంటనే కేటీఆర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. నగరంలో డబుల్ డెక్కర్లు నడపడం మీద సాధ్యాసాధ్యాలను ఆర్టీసీ ఎండీతో మాట్లాడటం, పరిశీలనల తర్వాత ప్రయోగాత్మకంగా 25 బస్సులు తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించడం చకచకా జరిగిపోయాయి. ఈ నెలలో బిడ్డింగ్ ప్రక్రియ పూర్తయితేగనుక మరో రెండు నెలల్లోపే డబుల్ డెక్కర్ బస్సులు సిటీ రోడ్లపై రయ్ మంటాయి..
నల్లగా ఉన్నానని హేళన చేశారు -రంగు పూసి అందంగా -జయలలితే స్ఫూర్తి: వైసీపీ ఎమ్మెల్యే రోజా