కత్తి కార్తీక రియాక్షన్: నేనేవరినీ మోసం చేయలే, రాజకీయ కక్షతోనే కేసులు..
భూ వివాదంపై దుబ్బాక ఇండిపెండెంట్ అభ్యర్థిని కత్తి కార్తీక స్పందించారు. అమిన్ పూర్ భూ వివాదం విషయంపై తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. కొందరు కావాలనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే ఇదంతా చేస్తున్నారని.. అందులో తన పాత్ర ఏమీ లేదని కార్తీక స్పష్టంచేశారు. 52 ఎకరాల భూమిని రూ.35 కోట్లకు ఇప్పిస్తానని రూ.కోటి అడ్వాన్స్‌గా తీసుకొని కత్తి కార్తీక మోసం చేశారని నిన్నటి నుంచి వార్త కథనాలు వస్తున్నాయి. దీంత కత్తి కార్తీక స్పందించారు.

ఎవర్నీ మోసం చేయలే..
అమిన్ పూర్ ల్యాండ్ ఇష్యూలో ఎవర్నీ మోసం చేయలేదని కత్తి కార్తీక స్పష్టంచేశారు. దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే సదరు వ్యక్తికి లీగల్ నోటీసు ఇచ్చానని తెలిపారు. కానీ ఇప్పుడు.. సివిల్ కేసులో చీటింగ్ కేసు నమోదు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల తనను చంపుతామని బెదిరిస్తే రామాయంపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. మహిళగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి రాజకీయాల్లోకి వస్తే అడ్డంకులు సృష్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. తనకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రాజకీయాలను మాత్రం వీడనని స్పష్టంచేశారు. బల్దియా ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు.

52 ఎకరాల ల్యాండ్..
మెదక్ జిల్లా అమీన్‌పూర్‌లో సర్వేనెంబర్లు 322, 323, 324, 329లలో 52 ఎకరాల స్థలం ఉంది. అందులో కొంత స్థలం తమదేనని, మిగతా స్థలం పత్రాలు, జీపీఏ హక్కులు తమ వద్దనే ఉన్నాయని కత్తి కార్తీక బృందం చెబుతోంది. 52 ఎకరాలను రూ.35 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుని దొరస్వామి నుంచి రూ.కోటి అడ్వాన్స్‌గా ఆమె తీసుకున్నారు.

జీపీఏ ఎవరికీ ఇవ్వలేదు
ఆ స్థలం సిప్లా రమేష్ అనే వ్యక్తిదని తెలుసుకున్న దొరస్వామి.. స్థలంపై కత్తి కార్తీక బృందంతో జరిగిన ఒప్పందం గురించి వివరించాడు. దీంతో తాను ఎవ్వరికీ జీపీఏ హక్కులు ఇవ్వలేదని రమేష్ చెప్పుకొచ్చాడు. మోసపోయానని గ్రహించిన దొరస్వామి.. కత్తి కార్తీక, శ్రీధర్ గోపిశెట్టి, నువ్వాల శివరాంప్రసాద్, మురళీకృష్ణ, తెన్నేరి భీమ్‌సేన్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కేసుల కలకలం
దుబ్బాక ఉప ఎన్నిక వేళ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు కలకలం రేపుతోంది. రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేశారని కార్తీక అండ్ కో అంటోంది. కానీ కొందరు కార్తీక.. అధికార పార్టీ మద్దతుతోనే బరిలోకి దిగారని అంటున్నారు. దీంతో దుబ్బాక బై పోల్ రాజకీయం మరింత హీటెక్కింది. కేసులతో కార్తీకకే మేలు జరుగుతోందని విశ్లేషకులు అంటున్నారు.