telangana khammam Nalgonda warangal hyderabad rangareddy mlc Elections తెలంగాణ ఎమ్మెల్సీ వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... నేటి నుంచే నామినేషన్లు...
తెలంగాణలో ఖమ్మం-వరంగల్-నల్గొండ, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి(ఫిబ్రవరి 16) నుంచే నామినేషన్లను స్వీకరించనున్నారు.
ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నాం 3గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 23వరకూ నామినేషన్ల తుది గడువు ఉంది. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17(బుధవారం) ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతోముగియనుండటంతో ఈ ఎన్నికలు జరగనున్నాయి.ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల స్థానాన్ని ఈసారి కూడా తానే కైవసం చేసుకంటానన్న ధీమాతో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్,తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం,తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్,ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న కూడా పోటీలో ఉన్నారు.
అటు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మరోసారి తానే కైవసం చేసుకుంటానన్న ధీమాతో ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. గతంలో ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉద్యోగ సంఘాల నేత దేవీ ప్రసాద్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.రాష్ట్రంలో ఎన్నో విజయాలు నమోదు చేసుకున్న టీఆర్ఎస్ మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం ఇంతవరకూ గెలుచుకోలేకపోయింది. ఆశ్చర్యంగా ఈసారి ఈ స్థానానికి టీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించలేదు.కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్నారెడ్డి బరిలో ఉండగా... గతంలో ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ కూడా ఉన్నారు. 2007, 2009ల్లో గెలిచిన ఆయన.. 2014 వరకు ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ప్రజా సంఘాలు,విద్యార్థి లోకం తన వెంటే ఉందని నాగేశ్వర్ ధీమాతో ఉన్నారు.