గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ను రానీయమని చెప్పి: టీఆర్ఎస్‌ను లాగిన పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లు గెలుస్తానో కానీ

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నిప్పులు చెరిగారు. ఆయన గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పెదరావూరుపేట బహిరంగ సభలో, అలాగే, ఓ టీవీ ఛానల్‌తోను మాట్లాడారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

విభజన సమయంలో మాట్లాడేవారే లేకుండా పోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయాలు అసహ్యంగా, నీచంగా తయారయ్యాయన్నారు. ముప్పై ఏళ్లు పాలించాలని జగన్, మళ్లీ అధికారంలోకి రావాలని చంద్రబాబు కలలు కంటున్నారని విమర్శించారు. వారికి అధికార దాహం తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన లేదన్నారు. సమాజంలో మార్పు మన నుంచే ప్రారంభం అవుతుందన్నారు. త్వరలో రైతు సమస్యలపై విధాన ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.

జగన్‌ను అడుగుపెట్టనీయనన్న తెలంగాణ నేతలే సపోర్ట్ చేస్తున్నారు

తెలంగాణలో జగన్‌ను అడుగుపెట్టనీయమని చెప్పిన వ్యక్తులే ఇప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారని తెరాసను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జగన్‌ను తెలంగాణ నేతలు బహిరంగంగా సపోర్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తులు వ్యవస్థలను చూసి వాడుకోవడం చూసి భయమేస్తోందని చెప్పారు. సమాజంలో మార్పు కోసం నా ప్రాణం ఇవ్వడానికి అయినా సిద్ధమని చెప్పారు. యువతను నిర్వీర్యం చేసి ఈ ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయన్నారు. యువత సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం కాదని, అవినీతి జరిగితే బయటకు వచ్చి ప్రశ్నించాలని సూచించారు. అవినీతి రాజకీయాలతో విసిగిపోయి పార్టీ పెట్టానని చెప్పారు. అవినీతి పార్టీలను ప్రజలు దూరం పెట్టాలని, టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి అన్నారు.

అవినీతి అంటూ చంద్రబాబు, జగన్‌లపై నిప్పులు

అవినీతి పునాదులపై పార్టీలు పెట్టి ప్రజలను పీడిస్తున్నారని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. అందుకు నాలాంటి కానిస్టేబుల్ కొడుకు పార్టీ పెట్టవలసి వచ్చిందని చెప్పారు. రాజకీయ పార్టీ అంటే ప్రజాసేవ చేయాలని, కానీ ప్రజల నుంచి లక్షల కోట్లు దోచుకోవడం కాదని జగన్‌ను, చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అయిదేళ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదని చెప్పారు. కుల, మతాల కోసం పోరాటం చేయడం కాదని, అవినీతిపై యువత పోరాటం చేయాలన్నారు.

వైయస్‌ను దూషించారు, ఇప్పుడు వారే ఒక్కటవుతున్నారు

మార్పుకోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. త్వరలో రైతుల సమస్యలపై విధాన ప్రకటన చేస్తానని, దీనిపై ఫిబ్రవరి రెండో వారంలో స్పష్టత ఇస్తానన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ, వైసీపీ రెండు విఫలమయ్యాయన్నారు. తెరాస నేతలు గతంలో వైయస్ రాజశేఖర రెడ్డిని దూషించారని, ఇప్పడు వారే ఒకటవుతున్నారని జగన్, తెరాసను ఉద్దేశించి అన్నారు. అవసరమైతే 2014లోనే పదవి తీసుకునేవాడినని చెప్పారు. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. మార్పు కోసం వచ్చానని చెప్పారు.

వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చా

వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేసినందుకు రాజకీయాల్లోకి వచ్చానని, వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అన్నారు. 25 కిలోల బియ్యం కాదని, యువకులు 25 ఏళ్ల భవిష్యత్తు కోరుతున్నారన్నారు. ఒకప్పుడు ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండేవని, ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారన్నారు. పోరాటమే తనకు తెలిసిన విద్య అని, పోరాటం చేస్తామని, పోటీ చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీ ఆశయాలు ప్రచారం కోసం ఏర్పాటు చేసిన జాగోరే జాగో విభాగాన్ని ప్రారంభించారు.

2019లో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు కానీ

రాజకీయాల్లో డబ్బు కోసం మాట్లాడనివాడు, ప్రజల ఆకాంక్షల కోసం మాట్లాడేవాడు, బలంగా నిలదీసేవాడు ఒకడు కావాలని నేను మీ తరపున పోరాడేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. 2019లో మనం అందరం కలిసి పనిచేస్తే తప్పకుండా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని, జనసేన ప్రభుత్వం వస్తే అందరి ఇళ్లలో కాంతిని తీసుకు వస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలియదని, కానీ తన పోరాటం మాత్రం ఆగదని చెప్పారు. తాను ఎంత నిజాయితీగా ఉంటానో మీకు నడిచి చూపించానని, మీరు అందరూ కలిసి అండగా నిలబడితే మీకు అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని చెప్పారు.

English summary
Janasena chief Pawan Kalyan on Sunday dragged Telangana Rastra Samithi (TRS) party into Andhra Pradesh politics. He lashed out at Telugudesam and YSR Congress Party over corruption allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X