హైకోర్టుకు ససేమీరా: డ్యాన్స్‌తో నిరసన (పిక్చర్స్)
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించబోమని జూనియర్ డాక్టర్లు హైకోర్టుకు స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం సమ్మె విరమణకు వారికి 30 నిమిషాల గడువు ఇచ్చింది. అయినా, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణకు ససేమిరా అన్నారు. దీంతో వారితీరుపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
చికిత్స కోసం ఆసుపత్రులకు వచ్చే రోగుల ప్రాణాలు పోతున్నాయని, ఈ పరిస్థితుల్లో సమ్మె సమర్థనీయం కాదని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణజ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. సమ్మె విరమిస్తేనే వారి సమస్యలపై విచారణ చేపడతామని, లేని పక్షంలో చట్టం తనపని తాను చేసుకు పోతుందని హెచ్చరించింది.

జుడా
జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడాన్ని ప్రశ్నిస్తూ హైదరాబాద్‌కు చెందిన రవికిరణ్స్వామి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.

జుడా
దీనిపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం జూనియర్ డాక్టర్లు తక్షణం సమ్మె విరమించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

జుడా
బుధవారం కేసు విచారణ చేపట్టిన ధర్మాసనం జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణపై ఆరా తీసింది. వారు సమ్మె విరమించలేదని వారి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

జుడా
గత ప్రభుత్వాలు జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

జుడా
వీరి సమస్యలపై చర్చించి తగిన పరిష్కారం చూపేందుకు దశాబ్దం కిత్రమే ఒక కమిటీని నియమించారని, ఈ కమిటీ ముందు జూనియర్ డాక్టర్లు లేవనెత్తిన సమస్యలు ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని కోర్టుకు వివరించారు.

జుడా
జూనియర్ డాక్టర్లు వైద్య విద్యార్థులేనని, వైద్యులకు సహాయకులుగానే ఉంటారని, వీరి సమ్మె వల్ల వైద్యం అందక రోగులు మరణిస్తున్నారనడం సరికాదని తెలిపారు.

జుడా
మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించమని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు.

జుడా
జూనియర్ డాక్టర్ల తరఫు న్యాయవాది వాదనలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జూనియర్ డాక్టర్లకు కోర్టులపై నమ్మకం లేదా? అని ప్రశ్నించింది.

జుడా
జూనియర్ డాక్టర్ల వాదన ప్రకారం వారు ఇంకా విద్యార్థులే.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఇక్కడ యజమాని ఉద్యోగి సంబంధం లేదు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి.. క్రమశిక్షణ మీరితే చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. ఎటు నుంచి చూసినా వారి సమ్మె సమర్థనీయం కాదని కోర్టు స్పష్టం చేసింది.

జుడా
తగిన సదుపాయాలు లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించలేమని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారని, రేపు చదువు పూర్తయిన తర్వాత వారిలో ఎక్కువమంది చేరేది కార్పొరేట్, స్టార్ హాస్పిటల్స్‌లో అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

జుడా
తగిన వైద్యం అందక అవస్థలు పడుతున్న పేదరోగులపై ఎందుకు దయ చూపడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో వాదనలు కొనసాగించేందుకు గురువారానికి విచారణను వాయిదా వేసింది.

జుడా
కాగా, హైదరాబాదులోని ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద జూనియర్ డాక్టర్లు (జుడా) తమ నిరసనను బుధవారం కూడా కొనసాగించారు.

జుడా
హైదరాబాదులోని ధర్నా చౌక్ (ఇందిరా పార్క్) వద్ద జూనియర్ డాక్టర్లు (జుడా) తమ నిరసనను బుధవారం కొనసాగించారు. వారు డ్యాన్సులు చేస్తూ కూడా నిరసన తెలిపారు.
జూనియర్ డాక్టర్లు పరిణితి చెందాల్సి ఉందని పేర్కొంది. సమ్మె విరమించుకునే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఇచ్చిన 30 నిమిషాల గడువు ముగిసిన తర్వాత, న్యాయబద్ధమైన కోర్కెలు తీర్చే వరకు సమ్మె కొనసాగించడానికే జూనియర్ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ డివిజన్ బెంచ్‌కు వివరించారు. మరోవైపు, జుడా సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి.
దీక్షా శిబిరంలో వంద మందికి పైగా జూనియర్ వైద్యులు రక్తదానం చేశారు. ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ధర్నా చౌక్ రోడ్డుపైనే నృత్యాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జూడాల నిరాహార దీక్షలకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ శాసన సభాపక్షనేత డాక్టర్ కే లక్ష్మణ్ దీక్షావేదిక వద్ద మాట్లాడుతూ.. న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న జూనియర్ వైద్యులతో చర్చలు జరపకుండా వారిని డిబార్ చేస్తామంటూ బెదిరించడం ప్రభుత్వానికి తగదన్నారు.