విప్లవ రచయిత వరవరరావుకు కరోనా పాజిటివ్...
ప్రముఖ కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమ కారుడు వరవరరావు(81) కరోనా వైరస్ బారినపడ్డారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను సోమవారం(జూలై 14) ముంబైలోని జేజే ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన శాంపిల్స్‌ను సేకరించి టెస్టులు చేయగా బుధవారం(జూలై 16) పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని వరవరరావు తరుపు న్యాయవాది సుదీప్ పస్బోలా వెల్లడించారు.
మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరెగావ్ అల్లర్లలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారన్న ఆరోపణలతో వరవరరావును గతేడాది ఎన్ఐఏ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన్ను ముంబైలోని తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉంచారు. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించినట్లు జైలు అధికారుల నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో,ఇటు మీడియా ద్వారా చాలామంది వరవరరావు విడుదలకు డిమాండ్ చేశారు.

వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఎట్టకేలకు సోమవారం రాత్రి ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. అనారోగ్య సమస్యలు,వృద్దాప్యం రీత్యా ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వామపక్షాలు,ప్రజా సంఘాలు,మేదావులు ఆయన విడుదలకు డిమాండ్ చేస్తున్నారు. వరవరరావుపై కేంద్రం తప్పుడు కేసులు మోపి ఆయన్ను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపిస్తున్నారు.