
సార్.. మా పిల్లి బావిలో పడిందని సీపీకి ఫోన్.. అర్దరాత్రి పిల్లికోసం పోలీసుల రెస్క్యూఆపరేషన్
పోలీసులు శాంతిభద్రతలను పరిరక్షించడం మాత్రమే కాకుండా, ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడడానికి 24 గంటలు పని చేస్తూ ఉంటారు. ఒక్క ప్రజల కోసమే కాదు వారు పెంచుకొనే పెంపుడు జంతువుల కోసం కూడా పోలీసులు కష్టపడుతున్న పరిస్థితి ఒక్కోసారి ప్రజలలో పెద్ద చర్చకు కారణమవుతుంది. తాజాగా అటువంటి ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళితే

మా పిల్లి బావిలో పడింది.. కాపాడాలని అర్దరాత్రి సీపీకి కాల్
అర్ధరాత్రి 12 గంటలప్పుడు అందరూ నిద్ర పోతున్న సమయములో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎంతో ఇంపార్టెంట్ అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు కాల్ చేసిన వారు మా ఇంట్లో ఉన్న బావిలో మా పెంపుడు పిల్లి పడిపోయింది. దానిని కాపాడడానికి సహాయం చేయండి అంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఫోన్ చేసిన వ్యక్తి సమస్యను విని, తప్పకుండా ఆ సమస్యకు పరిష్కారం సూచిస్తాము అని చెప్పారు. పోలీసు సిబ్బందిని అక్కడికి పంపిస్తామని పిల్లిని రెస్క్యూ ఆపరేషన్ చేస్తామని కాల్ చేసిన వ్యక్తికి చెప్పారు.
పిల్లిని కాపాడాలని సీపీ ఏసీపీకి ఆదేశాలు.. రెస్క్యూ ఆపరేషన్ కు టీం రెడీ
ఆపై టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు కు ఫోన్ చేసి, తనకు కాల్ చేసిన వ్యక్తితో వెంటనే మాట్లాడాలని, బావిలో పిల్లి పడిన ప్రదేశానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయాలని సీపీ సత్యన్నారాయణ ఆదేశించారు. ఇక వాట్సాప్ లో వారి లొకేషన్ ను మరియు వారి కాంటాక్ట్ నెంబర్ ను కరీంనగర్ టౌన్ ఏ సి పి కి పంపించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన టౌన్ ఏసిపి పిల్లి బావిలో పడిన ప్రాంతంలో ఆ ఏరియా హెడ్ కానిస్టేబుల్ అంజి రెడ్డి మరియు సిబ్బందిని రెస్క్యూ టీం గా రెడీ చేశారు.

బావిలోకి బుట్ట వేసి.. దానిలోకి పిల్లి వచ్చాక .. పిల్లిని కాపాడిన పోలీసులు
సంఘటన స్థలానికి వెళ్లి పిల్లి ని కాపాడే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. టౌన్ ఏసీపీ ఆదేశాల మేరకు అక్కడకు చేరుకున్న రెస్క్యూ టీం బావిలో పడిన పిల్లిని కాపాడే ప్రయత్నం చేశారు. ఒక బుట్టను తాడు సహాయంతో బావి లోకి పంపించి ఆ బుట్టలో పిల్లి కూర్చునే విధంగా ప్రయత్నించి, పిల్లి బుట్టలో కూర్చున్న తర్వాత దానిని సురక్షితంగా పైకి లాగి రక్షించారు. అర్ధ రాత్రి పన్నెండున్నర నుండి 12.45 నిమిషాల వరకు రెస్క్యూ ఆపరేషన్ ను నిర్వహించారు.

పిల్లి యజమానికి అప్పగింత.. పోలీసులకు యజమాని కృతజ్ఞతలు.. సీపీ ఏమన్నారంటే
మొత్తానికి పిల్లిని కాపాడిన పోలీసులు ఆ పిల్లిని యజమానికి అప్పగించగా, సంతోషంతో పిల్లి యజమాని పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక పిల్లి విషయం లోనే కాదు, ప్రజల విషయంలో కూడా పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని కరీంనగర్ సి పి సత్యనారాయణ వెల్లడించారు. ఆపదలో ఉన్న సమయంలో ఎవరైనా, అర్ధరాత్రి రెండు గంటల కైనా డయల్ 100 నెంబర్ కి కాల్ చేస్తే పోలీసులు వెంటనే స్పందించి ఆపద నుండి కాపాడతారని, పోలీసులు ఎల్లవేళలా ప్రజల సంరక్షణ కోసం పని చేస్తారని సి పి సత్యనారాయణ వెల్లడించారు.

పిల్లి రెస్క్యూ ఆపరేషన్ .. ఆసక్తికర చర్చ
ఇక ఈ ఘటనలో బావిలో పడిన పిల్లి కోసం అర్ధరాత్రి ఓ వ్యక్తి సిపి కి కాల్ చేయడం ఆసక్తికర విషయమైతే, ఆ కాల్ కు స్పందించిన సిపి అర్ధరాత్రి సమయంలో పిల్లి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేయించడం మరింత ఆసక్తిని రేకెత్తించిన విషయం. ప్రస్తుతం ఈ పిల్లి రెస్క్యూ ఆపరేషన్ పై కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది.