రేవంత్ జాడ తెలియక పోలీసుల తిప్పలు: భట్టితో సహా పలువురు హౌస్ అరెస్ట్: సీఎం నివాసం దగ్గర భారీగా బలగాలు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోసం హైదరాబాద్ నగర పోలీసులు వెదుకుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా..ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి నివాసం ఉండే ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా పోలీసులు మందుస్తు చర్యలు తీసుకుంటున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక సరళిని గమనిస్తూనే.. కాంగ్రెస్ నేతలు ఎలాగైన ప్రగతి భవన్ వద్దకు చేరుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో..కాంగ్రెస్ నేతల కదలికల మీద ఆదివారం నుండే పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కొందరిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కోసం మాత్రం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఆయన కోసం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆందోళనను అడ్డుకోవటం కోసం ప్రగతి భవన్ సమీపంలోని బేగంపేట మెట్రో స్టేషన్ కు అధికారులు తాళం వేసారు.
రేవంత్ కోసం పోలీసుల వేట
ఎంపీ రేవంత్‌రెడ్డి కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో..కాంగ్రెస్ నేతలను అడ్డుకొనే క్రమంలో భాగంగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో కీలకం వ్యవహరించే కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ఆచూకీ మాత్రం పోలీసులకు చిక్కలేదు. ఆయన్ను హౌస్ అరెస్ట్ చేసారని ప్రచారం సాగినా..ఆయన రాత్రి నుండే అందుబాటులో లేరని తెలుస్తోంది.

ఎలాగైనా ప్రగతి భవన్ కు చేరుకొనే వ్యూహంతో రేవంత్ రెడ్డి వ్యవహరించే అవకాశం ఉండటంతో ..ఆయన కోసం పోటీసుల వేట కొనసాగుతోంది. ప్రగతి భవన్ చుట్టూ ఉన్న హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రేవంత్ అనుచరుల ఇళ్లనూ పోలీసులు చెక్ చేస్తున్నారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ఆచూకీ దొరకట్లేదు. దీంతో ఆయన ప్రధాన అనుచరుల కదలికల మీద పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. అయితే పార్టీ నేతలు మాత్రం రేవంత్ ప్రగతి భవన్ కు ఎలాగైనా చేరుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భట్టితో సహా పలువురు నేతల అరెస్ట్..
ఛలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చిన సందర్బంలో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పలువురు మాజీ ఎంపీలు..ఎమ్మెల్యేలను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రగతి భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. వరంగల్‌లో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి గృహ నిర్బంధం చేశారు. వర్ధన్నపేటలోనూ కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.

కొత్తగూడెంలోనూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మహబూబాబాద్, ఎల్బీనగర్లో కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రగతి భవన్ ముట్టడికి హాజరవుతున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండటంతో.. కాంగ్రెస్ పార్టీ ఈ నిరసనకు పిలుపునిచ్చింది. దీంతో ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల బలగాలను పెద్ద ఎత్తున మొహరించారు.