వరంగల్లో రాహుల్ గాంధీ బహిరంగసభ; కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పై సర్వత్రా ఉత్కంఠ!!
పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల ప్రయోగశాల ఓరుగల్లులో రాహుల్ గాంధీ పర్యటన రాజకీయంగా కాక రేపుతుంది. ఓరుగల్లు వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందన్న టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న రాహుల్ గాంధీ ఈరోజు సాయంత్రం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్నారు. ఈ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమం కోసం ఏం చేస్తారో చెప్పడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.
రైతు సంఘర్షణ సభకు ఏఐసిసి అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ హాజరు కానున్న నేపథ్యంలో, సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి చేశారు. హన్మకొండలో సభ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ మళ్లింపు చేశారు. ఈరోజు హనుమకొండ లో నిర్వహిస్తున్న సభకు 5 లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ప్రయత్నం చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నారు అనేది ఈ బహిరంగ సభలోనే ప్రకటించనున్నట్లుగా సమాచారం. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం రైతులకు మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ ఉత్పత్తులు తదితర అంశాలపై రాహుల్ గాంధీ కీలక ప్రకటనలు చేయడంతో పాటుగా, పలు హామీలను ఇవ్వనున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పడంతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసేందుకు ఏం చేయబోతున్నారో చెప్పనున్నట్లు సమాచారం.భవిష్యత్తు రాజకీయాలకు మార్గనిర్దేశం చేయడానికి వరంగల్ లో నిర్వహిస్తున్న రైతు సంఘర్షణ సభ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
రాహుల్ గాంధీ సభ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా ఏఐసిసి, టీ పిసిసి నాయకులు హనుమకొండలో మకాం వేసి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభా ప్రాంగణంలో మూడు భారీ వేదికలను ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగించే ప్రధాన వేదికతో పాటు రైతులు, కళాకారుల కోసం రెండు వేదికలను సిద్ధం చేశారు. ప్రత్యేక వేదికపై రైతులతో మాట్లాడిన తరువాత రాత్రి 7:00 సమయంలో రాహుల్ గాంధీ ప్రసంగం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్ సూచనల మేరకు పకడ్బందీ భద్రతా చర్యలను చేపట్టారు.