
తెలంగాణలో కాంగ్రెస్ స్టేటస్ ఇదీ - పార్టీ నేతలతో రాహుల్ : సోనియాతో వీహెచ్ భేటీ...!!
అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ అధినాయకత్వం ఒక్క రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తెలంగాణ పార్టీ పైన రాహుల్ గాంధీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన 36 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణలో పని చేస్తున్న సునీల్ కనుగోలు క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి పైన నివేదికలు సిద్దం చేసారు. ఆ రిపోర్టులను రాహుల్ గాంధీకి అందించారు. తాజా సమావేశంలో ఆ నివేదికలను పార్టీ నేతలకు సునీల్ వివరించనున్నట్లు తెలుస్తోంది.

పార్టీ పరిస్థితిపై నివేదికలు సిద్దం
పార్టీలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తరువాత ఆయనకు వ్యతిరేకంగా కొందరు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఈ సమావేశంలోనూ అవకాశం వస్తే రేవంత్ తనకు తానే అన్నట్లుగా తీసుకుంటున్న నిర్ణయాల పైన రాహుల్ కు ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నేతలు సిద్దమయ్యారు.
అదే సమయంలో రాహుల్ గాంధీ సైతం తన పైన ఆగ్రహంతో పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారంటూ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే, రాహుల్ వీరికి ఏమని నిర్దేశం చేస్తారు..అసమ్మతి పైన ఏం చేయబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

అసమ్మతి నేతలకు క్లారిటీ
అయితే, తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్..బీజేపీ దూకుడుగా కనిపిస్తున్న వేళ..కాంగ్రెస్ మాత్రం అంతర్గత సమస్యలతోనే కాలం వెళ్లదీస్తుందనే అభిప్రాయం పార్టీ నేతలు అధినాయకత్వం వద్ద వ్యక్తం చేసేందుకు సిద్దమయ్యారు. ఇటు రాహుల్ గాంధీ... తెలంగాణ పార్టీ నేతలతో సమావేశం కాగా.. మరో వైపు పార్టీ సీనియర్ నేత వీహెచ్ పార్టీ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు.
కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సైతం సోనియాతో సమావేశం కోసం టెన్ జన్ పథ్ చేరుకున్నారు. టీపీసీసీ చీఫ్ తో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ పైన వీహెచ్ జరుగుతున్న వ్యవహారాలను సోనియాకు వివరిస్తామని వీహెచ్ చెప్పుకొచ్చారు.

ఎన్నికలకు రాహుల్ దిశా నిర్దేశం
ఇక, తెలంగాణలో టీఆర్ఎస్ కోసం ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు అందిస్తున్నారు. అటు బీజేపీ అధినాయకత్వం నేరుగా తెలంగాన పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టింది. ఈ సమయంలో సునీల్ కనుగోలు తెలంగాణలో పార్టీకి వ్యూహకర్తగా ఆయన చేసే సూచనల మేరకు నడుచుకోవాలని పార్టీ అధినాయకత్వం సూచించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఈ సమావేశం పార్టీ నేతలను సంసిద్దులను చేసేందుకు ఏర్పాటు చేసిందిగా ముఖ్య నేతలు చెబుతున్నారు. దీంతో..ఈ సమావేశంలో రాహుల్ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.