• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Hyderabadలో రంజాన్ షాపింగ్: కరోనా నిబంధనలు గాలికి -కోవిడ్ కమ్మేసే ఛాన్స్..బాబోయ్..!

|

హైదరాబాదు: దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. పెద్ద రాష్ట్రాలనే వణికిస్తోంది. రోజుకు కొన్ని వేలమంది ప్రాణాలను బలిగొంటోంది ఈ మహమ్మారి. కనిపించని ఈ మాయదారి రోగం నుంచి సురక్షితంగా ఉండాలంటే మనము అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం సెకండ్ వేవ్ నడుస్తున్నందున మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే డబుల్ మాస్కు ధరించడం, ఆరడుగుల భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేసుకోవడం వంటివి. ఇక రంజాన్ వేళ హైదరాబాదు నగరం కిటకిటలాడింది.

శుక్రవారం రంజాన్ ఉండటంతో చార్మినార్ తదితర పరిసరాలు షాపింగ్ చేసేవారితో కిటకిటలాడాయి. లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉండాలన్న నిబంధనలు ఉండటంతో ప్రజలు చార్మినార్‌కు షాపింగ్ కోసం ఎగబడ్డారు. అయితే హైదరాబాదుకు ఇది ముప్పుగా వాటిల్లింది. కరోనా పాజిటివ్ కేసులు పెరిగే ప్రమాదం ఉందనే అభిప్రాయంను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఛార్మినార్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు

రంజాన్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే రంజాన్ అన్నంతగా భాగ్యనగరంకు గుర్తింపు ఉంది. అయితే ఇది కరోనా పగ బట్టకముందు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ గుర్తింపులన్నీ పనికిరానికిందకే లెక్క. ఎందుకంటే ప్రాణాలకు మించింది మరొకటి ఏదీ ముఖ్యం కాదు. కరోనా ఉధృతం అవుతున్న వేళ హైదరాబాద్ ముఖ్యంగా పాతబస్తీ వాసులు నిబంధనలు మరిచారు.

శుక్రవారం రంజాన్ పండుగ ఉన్న నేపథ్యంలో అందుకు తగ్గ షాపింగ్ చేయాలని ఉదయం ఆరు గంటలకే చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక అప్పటికే షాపులు కూడా తెరిచి ఉండటంతో ప్రజలు గుంపులుగుంపులుగా నిలబడ్డారు. ఈ సమయంలో భౌతిక దూరం పాటించడం ఎంతో అవసరమని ప్రభుత్వాలు చెబుతున్నా..నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రజలకు చెవికి ఎక్కినట్లు లేదు. షరా మామూలే అన్నట్లుగా పెద్ద సంఖ్యలో గుమికూడారు. అక్కడ కంట్రోల్ చేసేందుకు అధికారులు కూడా లేరు. తాజా ఘటనలో హైదరాబాద్ పరిస్థితిపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంపులుగా ఉండే చోట నుంచే కరోనా

గుంపులుగా ఉండే చోట నుంచే కరోనా

కరోనాను తరిమి కొట్టాలంటే ముందు మనం నియంత్రణలో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇవేవీ పట్టనట్లుగా ప్రజలు వ్యవహరిస్తుండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఈ మధ్యే ముగిసిన కుంభమేళలో కొన్ని లక్షల మంది ప్రజలు దేశనలుమూలల నుంచి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడే కరోనా దాడి చేసిందని అందుకే భారత్‌లో ఈ బీభత్సం జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఒక ప్రకటన చేసింది. అలాంటి సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకూడదని కూడా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.

ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరిగిపోతున్నాయి. చాలామంది ఈ మాయదారి మహమ్మారితో మరణిస్తున్నారు. మరి అలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పక్కర్లేదు. మరి ప్రజలు ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తే రేపు జరగబోయే విపత్తుకు ప్రభుత్వాలను నిందించడం సరికాదని పలువురు నిపుణులు చెబుతున్నారు.

బతికుంటే ఎన్నో పండగలు

బతికుంటే ఎన్నో పండగలు

రంజాన్ అంటే కచ్చితంగా జరుపుకోవాల్సిన పండుగే. కానీ ప్రాణాలను పణంగా పెట్టి పండుగలు జరుపుకోవాల్సిన పనిలేదని... ఈ క్షణం ఏమవుతుందో చెప్పలేకున్నామని నిపుణులు చెబుతున్నారు. అప్పటి వరకు కళ్ల ముందే తిరిగే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శ్వాస అందక గిలగిల కొట్టుకుంటున్నారని ఇందుకు కారణం కరోనా మహమ్మారని అంటున్నారు.

అయితే ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని పదేపదే చెబుతున్నా... పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం నియంత్రణలో ఉంటే భవిష్యత్తులో ఇలాంటి పండగలు చాలా జరుపుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడున్న సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారుతోందని ఇంట్లో ఒక్కరికి వచ్చినా.. మిగతా వారికి సోకుతోందని వెల్లడించారు. కచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటిస్తేనే అంతా క్షేమంగా ఉంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
People in Hyderbad violated the covid rules near Charminar for Ramdan Shopping.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X