వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రిగారూ! దిగుబడి సరే.. నివేదిక మాటేమిటి? పసుపుబోర్డుపై కేంద్రం మొండిచేయి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: దేశవ్యాప్తంగా మిర్చి దిగుబడి పెరగడం వల్లే ధర తగ్గిందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీని ప్రభావం ఎగుమతులపైనా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయంగా నాణ్యతా పరంగా ఏ మిర్చికి ఏ దేశంలో డిమాండ్ ఉన్నదో అధ్యయనం జరిపిన తర్వాతే ఎగుమతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇటీవల ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాల్ మిర్చికి రూ.7000 కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరితే మొక్కుబడిగా రూ.5000 మద్దతు ధర ప్రకటించి చేతులు దులిపేసుకున్న ఘనత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ది.

దీన్ని బట్టి కేంద్రంలోని వివిధ శాఖల మంత్రుల మధ్య సమన్వయం ఉన్నదా? లేదా? ఉన్నా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. క్వింటాల్ మిర్చి ధరలు కర్ణాటకలో సగటున రూ.9000, కేరళలో రూ.7000, మణిపూర్ రాష్ట్రంలో రూ.13 వేలు, తమిళనాట రూ.10 వేలు పలుకుతున్నాయి. కానీ తెలంగాణలో సగటున రూ.3000 మాత్రమే లభిస్తున్నది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొంచెం అటూ ఇటూగా ధర ఫలుకుతున్నది. ఇదిలా ఉంటే ఇటీవలే తెలంగాణలో పర్యటించిన కేంద్ర సుగంధ ద్రవ్యాల మండలి అధికారులు.. మిర్చి ధర నాలుగు నెలల్లో సగానికి సగం తగ్గించడమే సమస్యకు మూలమని నిగ్గు తేల్చారు. ఈ విషయాన్ని కేంద్ర మార్కెటింగ్ శాఖ కూడా ధ్రువీకరించింది.

వాస్తవాలు బయట పెట్టిన సుగంధ ద్రవ్యాల మండలి

వాస్తవాలు బయట పెట్టిన సుగంధ ద్రవ్యాల మండలి

త్వరలో రైతులు, మిర్చి ఎగుమతి దారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తామని పేర్కొన్నది. కేంద్రమే మిర్చి కొనుగోళ్లు జరుపాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీర్ హరీశ్ రావు రాసిన లేఖలపై స్పందించిన కేంద్రం.. దీన్ని అధ్యయనం చేయాలని కేంద్ర మార్కెటింగ్‌ శాఖ ‘జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి'(ఎస్‌బీ)ని ఆదేశించింది. దేశంలో, తెలంగాణలో మిర్చి పంట సాగు, దిగుబడులు, ధరలపై అధ్యయనం చేసి ఎస్‌బీ నివేదిక ఇచ్చింది. దీనిని కేంద్ర మార్కెటింగ్‌ శాఖ.. కేంద్ర వాణిజ్యశాఖకు పంపింది. మిరప సాగు, కొనుగోళ్లపై ఈ నెలలోనే వరంగల్‌లో రైతులు, ఎగుమతిదారులతో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేస్తామని ఎస్‌బీ తెలిపింది.

2012 నాటి ధర కూడా రావడం లేదని కేంద్రానికి నివేదిక

2012 నాటి ధర కూడా రావడం లేదని కేంద్రానికి నివేదిక

ఈ నివేదిక ప్రకారం కేవలం నాలుగు నెలల్లోనే మిరప ధర సగానికి సగం తగ్గినట్లు తెలిపింది. గత డిసెంబర్‌లో క్వింటాల్ మిర్చి ధర రూ.11095 ఉండగా ఏప్రిల్‌కల్లా రూ.6 వేలకు చేరింది. ఈ నెలలో రూ.5 వేలలోపే రైతుల నుంచి కొంటున్నారు. 2012 - 13లో క్వింటాల్ మిర్చి సగటున రూ.6409కు వ్యాపారులు కొనగా ఇప్పుడు ఆ ధర కూడా రైతులకు రావడం లేదని కేంద్రం తెలిపింది.

ఏడాదిలో 50 శాతం పెరిగిన సాగు

ఏడాదిలో 50 శాతం పెరిగిన సాగు

తెలంగాణలో 2015-16లో 82 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తే 2.28 లక్షల టన్నుల పంట పండింది. 2016-17లో లక్షా 20 వేల హెక్టార్లలో పంట సాగుచేస్తే దిగుబడి 3.37 లక్షల టన్నులకు పెరిగింది. దేశంలో మిర్చి దిగుబడితోపాటు విదేశాలకు ఎగుమతులు సైతం పెరుగుతున్నాయి. 2016 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ మధ్య 2.60 లక్షల టన్నుల మిర్చి ఎగుమతైంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 2.53 లక్షల టన్నులే వెళ్లాయి.

సుగంధ ద్రవ్యాల మండలి సిఫారసులివి

సుగంధ ద్రవ్యాల మండలి సిఫారసులివి

జాతీయ స్థాయిలో వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రోత్సాహం కల్పించాలి
తెలంగాణలో మిర్చి పంట సాగు, దిగుబడులు పెరుగుతున్నందున శీతల గిడ్డంగుల నిర్మాణాలు పెరగాలి. దిగుబడి అధికంగా వచ్చి ధర లేనప్పుడు రైతులు పంట నిల్వ చేసుకునే వసతులు కల్పించాలని సుగంధ ద్రవ్యాల మండలి సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్నా దేశం నలుమూలల నుంచి కొనుగోలుదారులు, ఎగుమతిదారులు నేరుగా రైతుల నుంచి కొనేందుకు ఈ రాష్ట్రాలకు మార్కెట్లకు రావడం లేదు. వీరు అధిక సంఖ్యలో వస్తే పోటీ పెరిగి రైతులకిచ్చే ధర పెంచుతారు.

సిండికేట్ వ్యాపారంతో రైతులకు నష్టం

సిండికేట్ వ్యాపారంతో రైతులకు నష్టం

ప్రస్తుతం స్థానిక వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లే రైతుల నుంచి కొంటున్నారు. స్థానికంగా వీరి మధ్య ఉండే సఖ్యత కారణంగా ముందే మాట్లాడుకుని ధర తగ్గించేస్తున్నారని ‘జాతీయ సుగంధ ద్రవ్యాల మండలి'(ఎస్‌బీ) అధికారి ఒకరు వివరించారు. దేశవ్యాప్తంగా కొనుగోలుదారులు, ఎగుమతిదారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులను వరంగల్‌కు పిలిపించి నేరుగా రైతులతో అవగాహనా సమావేశం ఏర్పాటుచేస్తే కనీసం వచ్చే ఏడాదైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదన్న కేంద్రం

పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదన్న కేంద్రం

తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం తన సవతి తల్లి ప్రేమను మరోసారి బయటపెట్టింది. జాతీయ స్థాయిలో తెలంగాణలోని నిజామాబాద్‌లోనే పసుపు దిగుబడి ఎక్కువగా సాగుతున్నా.. దాని పేరిట రాష్ట్రంలో పసుపు జాతీయ బోర్డు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రం చేతులెత్తేసింది. 51 సుగంధ ద్రవ్యాల్లో పసుపు ఒకటి అని, ప్రతి సుగంధ ద్రవ్యానికి ఒక బోర్డు ఏర్పాటు చేయలేమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కావాలంటే టర్మెరిక్ డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయడానికి సిద్ధమని చెప్పారు. కేంద్రం వివక్ష ప్రదర్శించినా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంత మమేకమైనా నిధుల కేటాయింపులోనూ, వివిధ సంస్థల ఏర్పాటులోనూ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పలు వసతులు, సంస్థలు కల్పించడంలో ఆగమేఘాల మీద దూసుకెళ్లే కేంద్రం.. తెలంగాణ అంటేనే నిరాసక్తత వ్యక్తం చేస్తుండటం గమనార్హం. పైగా తెలంగాణలో విస్తరణ లక్ష్యంతో అధికార బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు.

English summary
Rates falls down because high production, Nirmala Sita Raman on Mirchi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X