తెలంగాణాలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చార్జీలబాదుడు ఫిబ్రవరి1నుండే: ఆస్తుల విలువ పెంపుపై ప్రతిపాదనలు అందుకే!!
తెలంగాణా ప్రభుత్వం భూములు, ఆస్తుల కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. భూముల ధరల మార్కెట్ విలువ పెంపు గుడ్ న్యూస్ అని భావించినా అందుకు తగ్గట్టు పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు కొనుగోలుదారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మళ్లీ పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా రంగంలోకి దిగుతుంది.
ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రానున్నట్టు సమాచారం. గతేడాది భూముల మార్కెట్ విలువను పెంచిన సర్కార్ ఏడాది గడవకముందే మరోసారి మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రిజిస్ట్రేషన్ శాఖ కీలక సమావేశం .. ఆస్తుల విలువ పెంపుపై ప్రతిపాదనలు
మార్కెట్ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువ పెంపుపై రిజిస్ట్రేషన్ శాఖ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. మార్కెట్ విలువలను ఏ మేరకు సవరించాలనే అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ శేషాద్రి, జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించారు. ఆస్తుల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ శాఖ ఒకట్రెండు రోజుల్లో ప్రతిపాదనలు ఖరారు చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు మార్కెట్ విలువను సవరించి అమలు చేయనున్నట్లు సమాచారం. ఆస్తుల విలువ పెంపుపై ప్రతిపాదనలు రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు కోసమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

స్థలాలు, పొలాలు, అపార్ట్ మెంట్ ల మార్కెట్ విలువ పెంపుపై నిర్ణయం
ప్రాథమిక సమాచారం ప్రకారం వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50 శాతం పెంచాలని భావిస్తున్నారు. ఖాళీ స్థలాల విలువను 35 శాతం, అపార్ట్మెంట్ల విలువ 25 శాతం పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అదనంగా, బహిరంగ మార్కెట్లో విలువ ఎక్కువగా ఉన్న చోట అవసరమైనంత సర్దుబాటు చేయడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. నాలుగైదు రోజుల్లో కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేయాలని ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు నిర్ణయించినట్లు సమాచారం.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త మార్కెట్ విలువలు
కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి ఫిబ్రవరి 1 నుంచి రానున్నట్టు సమాచారం. కొత్త మార్కెట్ విలువలు అమలులోకి వచ్చేలా వారం రోజుల్లో పెంపును వేగవంతం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించిందని తెలుస్తుంది. ఇప్పటికే గతే సంవత్సరం భారీగా రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీని పెంచారు .
ఏడేళ్ల తర్వాత ప్రభుత్వం గతేడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంపు డ్యూటీని పెంచింది. వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్ విలువను సుమారు 20 శాతం సవరించింది. తాజాగా మళ్లీ మరోమారు సవరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీంతో మరోమారు రిజిస్ట్రేషన్ చార్జీల వాత పెట్టనుంది .

గతేడాది సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు
గత ఏడాది సవరించిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు గతేడాది జూలై 22 నుంచి అమల్లోకి వచ్చాయి. వ్యవసాయ భూమి కనీస ధర ఎకరాకు రూ.75వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఖాళీ స్థలం కనీస ధర రూ. 200గా నిర్ణయించారు. వాటి విలువను కూడా 50 శాతం, 40 శాతం, 30 శాతం మేర పెంచింది. అపార్ట్మెంట్ల ధరల్లో చదరపు అడుగు కనీస ధర రూ.వెయ్యిగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు కనిష్టంగా 20 నుంచి గరిష్టంగా 30 శాతానికి పెంచారు. దీంతోపాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల విలువను ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు మళ్ళీ మరోమారు మార్కెట్ విలువ పెంపు పేరుతో బాదుడుకు రంగం సిద్ధం చేసింది.