కేసీఆర్ కిట్ లో ఎలుకలు చేరి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి: రేవంత్ రెడ్డి సెటైర్లు
తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనపై నిత్యం విరుచుకు పడే టిపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోమారు టిఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అటు కేంద్రంలోని బీజేపీని, ఇటు రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీని ఏక కాలంలో టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎంజీఎంలో ఎలుకల ఎఫెక్ట్.. సూపరింటెండెంట్, వైద్యులపై వేటు, చర్యలకు ఆదేశం
నిరుపేదలకు వైద్యం అందటం లేదని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీలకు మధ్య రగడ కొనసాగుతున్న వేళ ధాన్యం కొనుగోలు పై ఆందోళన బాట పట్టిన కాంగ్రెస్ పార్టీ, తాజాగా పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పై నిరసన తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసి నిరుపేదలకు వైద్యం అందించడం కోసం అన్ని రకాల వసతులు కల్పిస్తుందని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ తీరును మరోమారు టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి.

ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై రేవంత్ ఫైర్
నిన్న వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతున్న భీమారం కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో తాజా పరిస్థితిని చూపించి మంత్రి హరీష్ రావు కు హితవు పలికారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగిపై ఎలుకలు దండయాత్ర చేసి గాయపరిచిన ఘటనకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ షేర్ చేశారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ కిట్ సెల్ఫ్ డబ్బా ఆపి ఆస్పత్రుల్లో వసతులను కల్పించండి
ఆరోగ్య మంత్రి హరీష్ గారూ..."కేసీఆర్ కిట్"లో మీతో పాటు కుక్కలు, పిల్లులు,ఎలుకలు,బొద్దింకలు,నల్లులు, దోమలు చేరి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి అంటూ సెటైర్లు వేశారు. "కేసీఆర్ కిట్"అని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఆపి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు కల్పించండి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ కిట్ వల్ల ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని ఇటీవల హరీష్ రావు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

పేదల పట్ల మానవత్వం ప్రదర్శించండి అంటూ రేవంత్ రెడ్డి హితవు
పేదలపట్ల మానవత్వం ప్రదర్శించండి అంటూ రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఆసుపత్రులలో మౌలిక వసతులు మెరుగుపరచకుండా మంత్రులు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాల కల్పన బాగుంటే వరంగల్ ఎంజీఎం లో ఇటువంటి పరిస్థితి వచ్చేదా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించింది. ఘటనకు బాధ్యులైన వైద్యులను సస్పెండ్ చేసింది. అంతే కాదు ఎంజీఎం సూపరిండెంటెంట్ శ్రీనివాస్ పై బదిలీ వేటు వేసింది.