కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్ లకు సమస్య , రసమయిని సీఎం చెయ్ : రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్, కేటీఆర్ ని సీఎంగా చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తున్నారని వార్తలు జోరందుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఎప్పటికీ కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయరని, కేటీఆర్ సీఎం పదవి కోసం ఎదురు చూడాల్సిందే నంటూ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే సమయంలో దళితున్ని సిఎం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్ కు దమ్ముంటే రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలంటూ డిమాండ్ చేశారు.

కేటీఆర్ సీఎం కావాలని కోరుకుంటుంది వాళ్ళే : రేవంత్ రెడ్డి
టిఆర్ఎస్ పార్టీ నాయకులు షాకయ్యే కామెంట్స్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి. ఒక పక్క రాష్ట్రంలో కేటీఆర్ కాబోయే సీఎం అని ప్రచారం జరుగుతుంటే ఆ ప్రచారం పై స్పందించిన రేవంత్ రెడ్డి సీఎం ఎవరనేది ఆ కుటుంబ సమస్య అంటూ పేర్కొన్నారు. కేటీఆర్ సీఎం అయితే కవిత, హరీష్ రావు, సంతోష్ లకు పెద్ద సమస్యని అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారు, మంత్రి పదవులు పోతాయని భయపడుతున్న వారు మాత్రమే కేటీఆర్ సీఎం కావాలని ప్రకటనలు చేస్తున్నారన్నారు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

కేటీఆర్ సీఎం అయ్యే చాన్సే లేదు .. ఆయన సమర్ధత ఏంటో కేసీఆర్ కు తెలుసు
రాష్ట్రానికి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదని, ఆయన సమర్ధత ఏంటో కేసీఆర్ కు తెలుసని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తోందని కేసీఆర్ అనుకుంటే రసమయి బాలకిషన్ సీఎం చేయాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్నటికి నిన్న రసమయి బాలకిషన్ తన అధికార పార్టీ ఎమ్మెల్యే గా తన సహజత్వాన్ని కోల్పోయానని, లిమిటెడ్ కంపెనీ లో పని చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అసమ్మతి గళం వినిపించిన రసమయి బాలకిషన్ కు సీఎంగా అవకాశం ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి మెలిక పెట్టారు.

కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మ పై ప్రమాణం చేసి కొడంగల్ పై మాట్లాడాలని సవాల్
ఇదే సమయంలో కేటీఆర్ పై విరుచుకుపడిన రేవంత్ రెడ్డి కెసిఆర్ కంటే కేటీఆర్ ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని, తన హయాంలో జరిగిన అభివృద్ధి కి రంగులు మార్చి తామే అభివృద్ధి చేశామని ప్రచారం చేసుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే పోలేపల్లి ఎల్లమ్మ పై ప్రమాణం చేసి తాము చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని రేవంత్ సవాల్ చేశారు .

టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా
టిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటున్నట్టు కొడంగల్ అభివృద్ధి వారి హయాంలో జరిగినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పై , సీఎం కేసీఆర్ పై విరుచుకుపడే రేవంత్ రెడ్డి మొత్తానికి కెసిఆర్ కేటీఆర్ ను సీఎం చేయడని, దమ్ముంటే రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.