దేశ దిమ్మరి అనాలా?: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు, ‘పందికొక్కు ఒక్కటే బయటకు రావాలి’
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్‌కు రాజకీయ భిక్ష, గుర్తింపును ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాజకీయ ప్రస్థానం ఓటమితోనే ప్రారంభమైందన్నారు.

కేసీఆర్ కుటుంబంతో గాంధీ కుటుంబం పోలిక: రేవంత్
ప్రజాగ్రహ భయంతోనే కేసీఆర్ వేర్వేరు చోట్ల ఎంపీగా పోటీ చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. సిద్దిపేట నుంచి కరీంనగర్, అక్కడ్నుంచి పాలమూరుకు కేసీఆర్ పారిపోయారని విమర్శించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్ కుటుంబం పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడింది గాంధీ కుటుంబమని... దేశ అభ్యున్నతి కోసం ఇందిర, రాజీవ్ గాంధీ ప్రాణాలర్పించారని వ్యాఖ్యానించారు. అవకాశమున్నా కూడా ప్రధాని పదవిని సోనియా, రాహుల్ చేపట్టలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి మేధావులను కాంగ్రెస్ పార్టీ ప్రధానులను చేసిందన్నారు. ఇటీవల పంజాబ్‌లో దళితుడిని తమ పార్టీ ముఖ్యమంత్రిని చేసిందని, లోక్ సభాపక్ష, రాజ్యసభాపక్ష నేతగా ఖర్గేకు కాంగ్రెస్ అవకాశమిచ్చిందని రేవంత్ గుర్తు చేశారు.

కేసీఆర్‌ను దేశ దిమ్మరి అనాలా అంటూ రేవంత్ రెడ్డి ఫైర్
రాహుల్‌గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాహుల్‌గాంధీ ఏ హోదాలో రాష్ట్రానికి వచ్చారని అంటున్నారు. ఎక్కడెక్కడో చదువుకున్న కేటీఆర్‌కు.. తెలంగాణలో ఏం అర్హత ఉంది. వరంగల్ డిక్లరేషన్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. శరద్‌పవార్, స్టాలిన్, మమతా బెనర్జీ వద్దకు కేసీఆర్ వెళ్లిరావచ్చు. తెలంగాణ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి హోదాలో వచ్చిన రాహుల్‌ను ప్రశ్నిస్తారా? రాహుల్ పొలిటికల్ టూరిస్ట్ అయితే.. మరి కేసీఆర్‌ను ఏమనాలి? దేశ దిమ్మరి అనాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

పందికొక్కు ఒక్కటే బయటికి రావాల్సి ఉందన్న రేవంత్ రెడ్డి
బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ ఒకే భావజాలంతో పనిచేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్ భాషను కేటీఆర్.. వీరిద్దరి మాటలనే ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్తున్నారని అన్నారు. ఆ ముగ్గురూ ఒకే రకమైన భావజాలం, ఒకే రకమైన భాషతో కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి చేస్తున్నారని మండిపడ్డారు. పొగపెట్టగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చాయన్నారు. పందికొక్కు ఒక్కటే బయటకు రావాల్సి ఉందని ఎద్దేవా చేశారు. అది కూడా రేపో మాపో వస్తుందన్నారు.