అమృతే రాసినా, పనిలేనోడు రాసినా నా ఫైనల్ మెసేజ్ మాత్రం ఇదే : అమృత కామెంట్స్ పై ఆర్జీవీ
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అమృత ప్రణయ్ ల ప్రేమ కథ, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై మర్డర్ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక నిన్న ఫాదర్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మ పోస్టర్ పై అమృత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మపై తాను కేసు పెట్టబోను అంటూ, రెస్ట్ ఇన్ పీస్ అని వర్మ అంటూ కామెంట్ చేశారు.ఇక అంతే కాదు సినిమా ఫస్ట్ లుక్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు అమృత.
ఆర్జీవీని టార్గెట్ చేసిన అమృత ... ఇంత నీచానికి దిగజారావా.. రెస్ట్ ఇన్ పీస్ వర్మా అంటూ కామెంట్స్

ఆత్మహత్య చేసుకోవాలని భావించారట అమృత అన్న ఆర్జీవీ
ఇక అమృత వ్యాఖ్యలకు సమాధానంగా రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. అమృత చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వ్యాఖ్యలపై తాను సమాధానం చెప్పాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రి కథ మర్డర్ పేరిట నేను సినిమా తీస్తున్నా అని తెలుసుకొని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట అంటూ మొదలుపెట్టిన రాంగోపాల్ వర్మ అమృతే రాసింది అనుకున్నా, ఓ పని లేనివాడు రాశాడు అనుకున్నా నేను మర్డర్ లో ఏం చూపించబోతున్నా అన్న విషయంలో అనవసరపు ఆందోళనలతో ఉన్నవారి పట్ల స్పందించడం నా విధి అని భావిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

మర్డర్ సినిమాపై ఫిల్మ్ మేకర్ గా నా ఆలోచన నాది
ఇక అంతే కాదు మరొక ట్వీట్ లో ఎవరి ఆలోచనలు మేరకు వారు ఏ విషయం అయినా చూస్తారని పేర్కొన్నారు. ఓ జర్నలిస్టు వార్త రాసినా, ఓ విచారణాధికారి విచారించినా,ఇక ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా అది వారి వారి ఆలోచనల మేరకే ఉంటుంది అంటూ పేర్కొన్నారు. మర్డర్ సినిమా విషయంలో ఒక ఫిల్మ్ మేకర్ గా నా ఆలోచన నాది అంటూ పేర్కొన్నారు ఆర్జివీ . నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది అంటూ ఆయన పేర్కొన్నారు.

నా ఫైనల్ మెసేజ్ మాత్రం ఇదే అన్న వర్మ
ఇక తాజా కామెంట్లు అమృత చేసిన కామెంట్లే అయినా, లేదా మరెవరైనా రాసినా నా ఫైనల్ మెసేజ్ మాత్రం ఇదే అంటూ వర్మ పేర్కొన్నారు. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల తనకు ఎంతో గౌరవం, సానుభూతి ఉన్నాయని వర్మ అన్నారు. ఇక మర్డర్ సినిమా ఎవరిని అగౌరవపరిచబోదు అంటూ పేర్కొన్న వర్మ మర్డర్ చిత్రం మూడు నైతిక సంఘటనల నేపథ్యంలో రూపొందిందని వివరించారు.

మూడు అంశాల ఆధారంగానే సినిమా .. వర్మ క్లారిటీ
ఇందులో మొదటిది తండ్రి తన బిడ్డను నియంత్రణలో ఉంచడం, ఇక రెండవది ఒక కూతురు తనకు ఏది మంచిదో తెలియకపోయినా అనుకున్నది చేయడం, ఇక మూడవది ఒకరి జీవితం కోసం మరొకరి జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమర్ధించవచ్చా అనే అంశాల ఆధారంగానే మర్డర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం తనది కాదన్నారు .

మర్డర్ .. వర్మ వర్సెస్ అమృత
ఈ సినిమాని నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నాం కానీ నిజమైన కథ అని ఎక్కడా చెప్పడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుతం మర్డర్ సినిమా నేపథ్యంలో వర్మ వర్సెస్ అమృత కొనసాగుతోంది. ఇక ఆర్జీవీ స్పందన పై అమృత ఏమంటుంది? ఈ సినిమా పూర్తయ్యే వరకు ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తికరంగా మారింది.