తెలంగాణా రక్త చరిత్ర.. కొండా మురళి, సురేఖ బయోపిక్, నక్సలైట్ ఆర్కేతో అనుబంధం : ఆర్జీవీ సంచలనం
కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ అయిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టబోతున్నాడు. ఇక ఈ విషయాన్ని వర్మ స్వయంగా ప్రకటించాడు రియల్ స్టోరీ లను తెరకెక్కించి వివాదాలను సృష్టించే రాంగోపాల్ వర్మ ఈసారి కొండా దంపతుల పై సినిమా తీసి తెలంగాణ రాజకీయాలలో కొత్త కాంట్రవర్సీ సృష్టించబోతున్నాడని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. తెలంగాణ రక్త చరిత్ర చూపిస్తానంటూ రాంగోపాల్ వర్మ ఈ మేరకు సంచలన ప్రకటన కూడా చేశారు.
Ram
gopal
varma:
వరంగల్
సీక్రెట్
టూర్,
ఎల్బీ
కళాశాల
విజిట్
వెనుక
..
కొండా
మురళి
బయోపిక్
!!

కొండా మురళి బయోపిక్ ..తెలంగాణా రక్త చరిత్ర
సమాజంలో జరిగిన రియల్ లైఫ్ స్టోరీ లను, రీల్ లైఫ్ స్టోరీలుగా తెరకెక్కించే రాంగోపాల్ వర్మ ఇప్పటికే అనేక సంచలన సినిమాలను తీసిన విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ జీవితాల కథను తెలియజేసేలా పరిటాల రవి జీవిత కథాంశంతో రక్త చరిత్ర సినిమా తీసిన వర్మ సంచలనం సృష్టించాడు. రాయలసీమ రక్త చరిత్రను రెండు పార్టులుగా తెరకెక్కించిన వర్మ, ఇప్పుడు తెలంగాణ రక్త చరిత్ర ను తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. కొండ మురళి బయోపిక్ పేరుతో వర్మ ప్లాన్ చేస్తున్న సినిమాలో కొండ మురళి, సురేఖ ఆర్.కె అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఉంటాయని రాంగోపాల్ వర్మ ప్రకటించారు. ఈ మేరకు 'కొండా' సినిమాకు సంబంధించి వర్మ ఓ వాయిస్ ను విడుదల చేశారు.

నక్సలైట్ ఆర్కే తో కొండా మురళి ప్రత్యేక సంబంధం
కొండ మురళి బయోపిక్ తీస్తున్నానని చెప్పిన వర్మ విజయవాడలో చదువుకోవడం వల్ల తనకు అక్కడి రౌడీయిజం గురించి తెలుసని, రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బాంబు బ్లాస్ట్ వల్ల రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలిసిందని చెప్పారు. కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి తనకేమీ తెలియదన్న వర్మ ఈమధ్య అనుకోకుండా తను కలిసిన మాజీ నక్సలైట్ లు, అప్పటి పోలీసుల తో మాట్లాడటం వల్ల మొదటి సారి ఆ విషయంపై ఓ అవగాహన తనకు వచ్చిందని వర్మ పేర్కొన్నారు. ఇక అన్నిటికంటే తాను విన్న విషయాలను తనను అత్యంత ప్రభావితం చేసిన విషయం ఎన్ కౌంటర్ లో చంపబడిన ఆర్.కె అలియాస్ రామకృష్ణ కి, కొండా మురళికి వున్న ప్రత్యేక సంబంధం అంటూ రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

నాటి తిరుగుబాటు కథ చెప్పిన రాం గోపాల్ వర్మ
ఇక ఆ బ్యాక్ గ్రౌండ్, అప్పటి పరిస్థితులను సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడానికి కావలసిన సమాచారం ఇవ్వమని కొండ మురళిని కోరానని, ఈ సినిమా తీయడం వెనక ఉన్న తన ఉద్దేశం విని కొండ మురళి అంగీకరించారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాటం చేస్తున్న రోజులవి అంటూ ఆనాటి పరిస్థితులను చెప్పారు. అలా తిరగబడిన వారిపై ఉక్కుపాదం మోపి తొక్కి వేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా, తిరుగుబాటు జరుగుతూనే ఉండేదని, కొండ మురళి, ఆర్కే నాయకత్వంలో అలా తిరుగుబాటు జరిగిందని రాంగోపాల్ వర్మ తెలిపారు.

1995 లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కరుస్తూనే ఉన్నాయన్న వర్మ
విపరీత పరిస్థితుల నుంచి విపరీతమైన వ్యక్తులు ఉద్భవిస్తారు అని కారల్ మార్క్స్ 180 ఏళ్ల క్రితమే చెప్పాడని పేర్కొన్న రాంగోపాల్ వర్మ అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టిన వారే కొండా మురళి సురేఖ అంటూ తన సినిమాకు సంబంధించిన సమాచారాన్ని రివీల్ చేశారు.ఇప్పుడు తను తీస్తున్నది సినిమా కాదు..నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అంటూ 1995 లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కరుస్తూనే ఉన్నాయని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో విప్లవం అనేది ఎప్పటికీ ఆగదని దాని రూపు మార్చుకుంటుంది అని రాంగోపాల్ వర్మ వివరించారు.

వరంగల్ లో వర్మ సినిమాపై దుమారం .. ఏం కాంట్రవర్సీ చేస్తారో ?
కొండా సినిమా షూటింగ్ పూర్తిగా వరంగల్ ఆ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగనుందని అతి త్వరలో ఈ విప్లవం మొదలు కానుందని రాంగోపాల్ వర్మ తన వాయిస్ ద్వారా కొండ మురళి బయోపిక్ పై ఓ క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా రాంగోపాల్ వర్మ సినిమా తీయడు అనేది జగమెరిగిన సత్యం. ఈ క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కొండ మార్కు రాజకీయంతో సంచలనం సృష్టించిన కొండా దంపతుల కథ తెరకెక్కనున్న నేపథ్యంలో, అందులోనూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొండ బయోపిక్ ను తెరకెక్కించనున్న నేపథ్యంలో రాజకీయంగా ఎలాంటి కాంట్రవర్సీ లకు అది వేదిక అవుతుందో అన్న చర్చ వరంగల్ లో జోరుగా సాగుతోంది.

వరంగల్ రాజకీయాలలో రెబల్ లీడర్స్ కొండా దంపతులు
వరంగల్ రాజకీయాల్లో కొండా మురళి సురేఖ దంపతులకు ఒక ప్రత్యేకత ఉంది. వరంగల్ జిల్లా నుండి కాదు తెలంగాణ రాష్ట్రంలో రెబల్ లీడర్స్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న వీరు ఏ పార్టీలో ఉన్నా ఫైర్ బ్రాండ్ రాజకీయాల చేస్తారు. మొదట ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉన్న కొండ మురళి, ఆ తర్వాత ఆయనకు పోటీగా కొండా మురళిని కాంగ్రెస్ పార్టీ తరఫున వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. ఇక వైయస్ హయాంలో కొండా సురేఖ ఎమ్మెల్యే గానే కాదు, మంత్రిగానూ చక్రం తిప్పారు. వైయస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు స్టాండ్ తీసుకున్నా తెలంగాణలో వైసిపి బలంగా లేకపోవడం, జగన్ తో ఉన్న విభేదాల కారణంగా పార్టీని వీడి బయటకు వచ్చేశారు. ఏది చెప్పదలచుకున్న కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు.

కేసీఆర్ ను బండబూతులు తిట్టిన, ధిక్కార స్వరం పినిపించిన కొండా దంపతులు
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను, హరీష్ రావును పబ్లిక్ గా బండ బూతులు తిట్టినా, మళ్లీ టిఆర్ఎస్ పార్టీలో చేరి రాజకీయాలు సాగించారు. టిఆర్ఎస్ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చే సమయంలోనూ తెలంగాణ నీ అయ్య జాగీరా కేసీఆర్ అంటూ ధిక్కార స్వరాన్ని వినిపించి మరీ వచ్చారు. రాజకీయాలలో అనేక రకాలుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, ఎన్ని దెబ్బలు తగిలినా వీరి రాజకీయ ప్రస్థానానికి, అంతకు ముందు వీరి జీవితానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఫోకస్ రెబల్ లీడర్స్ కొండా దంపతులపై పడిందని టాక్ వినిపిస్తోంది.

వరంగల్ లో వర్మ సీక్రెట్ టూర్ ... త్వరలోనే తెలంగాణా రక్త చరిత్ర
ఇక కొండా సినిమాని చిత్రీకరించే క్రమంలో రాంగోపాల్ వర్మ ఇటీవల వరంగల్ నగరంలో సీక్రెట్ టూర్ నిర్వహించారు. కొండా మురళి, సురేఖ చదువుకున్న ఎల్ బి కాలేజ్ కి వెళ్లి అక్కడ అధ్యాపకులతో మాట్లాడారు. కొండా మురళి, సురేఖ లకు సంబంధించి అనేక విషయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. వారు చదువుకున్న ఎల్బి కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే కొండా మురళి బయోపిక్ పై టాక్ బయటకు వచ్చింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ కొండా సినిమా తీసుకున్నట్లుగా ప్రకటించి తెలంగాణా రాజకీయాలలో, ముఖ్యంగా వరంగల్ జిల్లా రాజకీయాలలో బోలెడంత కాంట్రవర్సి సృష్టించారు.