వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిధి దాటుతోంది, ఏపీ పక్షపాతమే: హరీశ్, సహించేది లేదని ఉమాభారతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తన పరిధికి మించి వ్యవహరిస్తున్నదని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర భారీ సాగునీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. బోర్డు అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందని, తెలంగాణ నీటి హక్కులకు విఘా తం కలిగించేలా ముసాయిదా నోటిఫికేషన్‌ను తయారుచేసిందని పేర్కొన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ఆదేశాలకు అనుగుణంగా రూపొందినట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని కేంద్ర మంత్రికి హరీశ్‌రావు వివరించారు. ముసాయిదా నోటిఫికేషన్‌ను నిలుపుదల చేయాల్సిందిగా కోరారు.

సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఉమాభారతితో సమావేశమైన హరీశ్‌రావు తాజా పరిణామాల గురించి వివరించారు. ట్రిబ్యునల్ అధికారాన్ని సైతం తన పరిధిలోకి తెచ్చుకునేలా బోర్డు వ్యవహరిస్తున్నదని, ఇది చట్టానికే విరుద్ధమని వివరించారు. దీనిపై తగిన రీతిలో వ్యవహరిస్తామని కేంద్ర మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు.

చట్టం ప్రకారమే కేంద్రం నడుచుకుంటుందని, చట్ట ఉల్లంఘనలు జరిగితే సహించే ప్రసక్తే లేదని, ఉన్నతాధికారులతో ఈ అంశాన్ని చర్చించి తగిన విధమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌తోపాటు రెండు రాష్ట్రాల నీటి హక్కులు, బోర్డు నియంత్రణ పరిధి తదితరాలపై మంగళవారం ఉదయం కేంద్ర జలవనరుల ప్రత్యేక కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాగునీటిపారుదల ముఖ్య కార్యదర్శి తదితరులు సమావేశం కానున్నారు.

సోమవారం భేటీలో హరీశ్‌రావుతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, సాగునీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, 'కాడా' డైరెక్టర్ మల్సూర్, సీనియర్ న్యాయవాది రవీందర్‌రావుతోపాటు ఎంపీలు కొత్త ప్రభాకర్‌డ్డి, బీబీ పాటిల్, బాల్క సుమన్, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి ఉమాభారతితో భేటీ అనంతరం మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు అత్యుత్సాహం చూపుతూ ట్రిబ్యునల్ అధికారాలను కూడా తన పరిధిలోకి తీసుకునే ప్రయత్నం చేసిందని అన్నారు. చట్ట పరిధిని అతిక్షికమించి పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును వివరించామని తెలిపారు.

సెక్షన్ 85 బీ, 87 (1) ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నీటిని రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే అధికారం మాత్రమే ఉందని అన్నారు. ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నీటిపై నియంవూతణ మాత్రమే బోర్డు పరిధిలో ఉంటుంది తప్ప ట్రిబ్యునల్ చేయాల్సిన నీటి పంపకాలను కూడా బోర్డు నిర్ణయించే విధంగా వ్యవహరిస్తున్నదని అన్నారు.

బచావత్ అవార్డు ప్రకారం చూసుకుంటే ఇంకా ప్రాజెక్టులవారీ కేటాయింపులు లేవని, రాష్ట్రాలకు గంపగుత్తగా మాత్రమే కేటాయించిందని, బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇంకా ప్రాజెక్టువారీ నీటి కేటాయింపులు లేవని వివరించినట్లు తెలిపారు. పార్లమెంటు ద్వారా రూపొందిన పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బోర్డు ఏర్పాటైందని, దాని ప్రకారమే బోర్డు నడుచుకోవాల్సి ఉంటుందని, దీనికి విరుద్ధంగా నడుచుకోవడం వీలు పడదని అన్నారు.

ఆ చట్టంలో ఏవైనా మార్పులు అవసరమైతే దాన్ని పార్లమెంటు మాత్రమే చేయగలుగుతుందని, కానీ ప్రస్తుతం కృష్ణా బోర్డు దాని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని హరీశ్‌రావు తెలిపారు. ముసాయిదా నోటిఫికేషన్ చెల్లనేరదని, కేంద్ర ప్రభుత్వం దీని అమలును నిలుపుదల చేయాలని, ఒకవేళ చేయకపోయినట్లయితే చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా భావించి తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించక తప్పదని మంత్రికి స్పష్టం చేశామని తెలిపారు.

రూల్స్ బుక్‌లోని అంశాలను కూడా మంత్రికి, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ సెక్ర కోఆర్డినేషన్ కార్యదర్శి ఎస్‌కే శ్రీవాస్తవకు వివరించామని తెలిపారు. ప్రస్తుతం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు మాత్రమే అమలులో ఉందని, దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు రావాలని, అందులో 299 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి, మిగిలిన 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ప్రాంతానికి వినియోగమయ్యేలా అప్పట్లో పరస్పర అంగీకారం కుదిరిందని, ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప తుది నిర్ణయం కాదని హరీశ్‌రావు గుర్తుచేశారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల విషయమై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ వాదనలు వింటూ ఉన్నదని, ఇంకా తుది ఉత్తర్వులు వెలువడలేదని, ఆ ప్రక్రియ పూర్తికాకుండానే కృష్ణా బోర్డు ముసాయిదా నోటిఫికేషన్‌ను రూపొందించడం, అమలు చేయడానికి గడువు విధించడం చట్టానికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇది పరిధిని దాటి వ్యవహరించడమేనని అన్నారు. అవార్డు అనంతరం కేటాయింపుల ప్రకారం నీటి విడుదలను నియంవూతించడమే బోర్డు బాధ్యత తప్ప తానే ట్రిబ్యునల్ తరహాలో నిర్ణయం తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. నీటి కేటాయింపులు చేసే అధికారం ట్రిబ్యునల్‌కు తప్ప కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదని గుర్తు చేశారు.

ఆ నోటిఫికేషన్ ఏపీ పక్షపాతమే:

ముసాయిదా నోటిఫికేషన్‌ను చూస్తే ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ పక్షపాతంగాఉందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుపై పూర్తి అధికారం, నియంవూతణ బోర్డుకు ఉన్నట్లుగా ముసాయిదా నోటిఫికేషన్ పేర్కొన్నదని, కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణ పరిధిలోనిదని, ఆంధ్రప్రదేశ్‌కు ఏ రకంగానూ సంబంధం లేదని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన పులిచింతల, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా తదితర ప్రాజెక్టులపై మాత్రమే నామమాత్ర నియంవూతణ ఉందని గుర్తుచేశారు. తెలంగాణకు చెందిన మిగులు జలాలపై ఆధారపడిన ఏఎమ్మార్పీ, కల్వకుర్తి ప్రాజెక్టుల విషయంలో వరద జలాలను వాడుకోవాలని పొందుపర్చినా ఆంధ్రప్రదేశ్పరిధిలోని కృష్ణాబేసిన్‌కు వెలుపల పెన్నా బేసిన్‌లో ఉన్న వెలుగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి తదితర ప్రాజెక్టుల విషయంలో వరద జలాలు అనే పదాన్ని పెట్టనే లేదని అన్నారు.

ఇవి పూర్తిగా వరద జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులేనని వివరించారు. ఇది కూడా పక్షపాతంతో కూడుకున్నదేనని అన్నారు. కేటాయింపులకు మించి ఎక్కువగా వినియోగిస్తున్న కేసీ కెనాల్ (31 టీఎంసీల కేటాయింపు) సగటున 35 సంవత్సరాల్లో ప్రతి ఏటా 55 టీఎంసీల చొప్పున వాడుకుంటున్నదని, కృష్ణా డెల్టా కేటాయింపు 152 టీఎంసీలైనా సగటున 230 టీఎంసీల చొప్పున వాడుకుంటున్నదని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు.

ఈ రెండింటిపైన మాత్రం నియంవూతణ పెట్టలేదని, ఒకవేళ నియంవూతణ పెట్టినట్లయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న ఉద్దేశంతో బోర్డు ఈ విధంగా వ్యవహరించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం రాసినదాన్ని బోర్డు సంతకం చేసి ఆమోదించినట్లుగా కనిపిస్తున్నదని, తెలంగాణ హక్కులను కాలరాసేదిగా ఉన్నదని అన్నారు. బోర్డు తనకు లేని అధికారాన్ని వినియోగించుకునేలా ఉందని అన్నారు.

తమ వివరణలన్నింటినీ కేంద్ర మంత్రి ఓపిగ్గా విన్నారని, చట్టానికి విరుద్ధంగా ఉండే అంశాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ఆమె స్పష్టం చేశారని హరీశ్‌రావు తెలిపారు. జలవనరుల ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్‌సింగ్ సహా ఉన్నతాధికారులు తెలంగాణ అధికారులతో మంగళవారం భేటీ అయ్యి దీనిపై లోతుగా చర్చిస్తారని ఆమె హామీ ఇచ్చారని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఏ విధంగా చేయాలన్నదానిపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ జరుపుతున్న విచారణను వేగవంతం చేసి ఉత్తర్వులు వెలువడేలా చొరవ తీసుకోవాలని కూడా ఆమెను కోరామని, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని హరీశ్‌రావు తెలిపారు.

పీఎంకేఏఎస్‌వై నిధులు ఇవ్వండి:

ప్రధానమంత్రి కృషి సించాయి యోజన పథకంలోకి తెలంగాణకు చెందిన 11 సాగునీటి ఏఐబీపీ ప్రాజెక్టులు చేరాయని, వీటిని సత్వరం పూర్తి చేయడానికి నిధుల్ని విడుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పీఎంకేఎస్‌పై పథకాన్ని ప్రవేశపెట్టిందే ప్రాజెక్టులు సత్వరం పూర్తికావడం కోసం కాబట్టి ఏప్రిల్ నెలలోనే నిధులు విడుదల చేయాల్సి ఉన్నదని గుర్తుచేశామన్నారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రం దగ్గర ఉన్న నిధుల ద్వారా ఖర్చు చేస్తే త్వరలోనే రీయింబర్స్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని హరీశ్‌రావు వివరించారు.

గుప్తాపై నిర్ణయాధికారం కేంద్రానిదే:

కృష్ణా బోర్డు చైర్మన్‌గా ఉన్న ఆర్‌కే గుప్తా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కోర్టును ఆశ్రయించడంగానీ, చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడంపైగానీ ఆలోచిస్తారా అని పాత్రికేయులు ప్రశ్నించగా.. అది తమ పరిధిలోనిది కాదని మంత్రి హరీశ్‌రావు బదులిచ్చారు.

తమకు వ్యక్తి ముఖ్యం కాదని, రాష్ట్ర నీటి ప్రయోజనాలు ముఖ్యమని నొక్కి చెప్పారు. బోర్డు రూపొందించి కేంద్రానికి పంపిన ముసాయిదా నోటిఫికేషన్ ద్వారా తెలంగాణకు కలిగే నష్టాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతికి వివరించామని, ఆయనపై చర్య తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పరిధిలోనిదని అన్నారు.

మిషన్ కాకతీయకు ఆహ్వానం

మిషన్ కాకతీయ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాల్సిందిగా కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని ఆహ్వానించామని, త్వరలోనే తప్పకుండా వస్తామని ఆమె హామీ ఇచ్చారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పార్లమెంటు సమావేశాలు జూలై 15 నుంచి ప్రారంభం కానున్నందున ఈలోపే వస్తానని ఆమె సూచనప్రాయంగా తెలిపారని చెప్పారు.

తొలిదశ, రెండోదశ పనుల ద్వారా వచ్చిన ఫలితాలను స్వయంగా పరిశీలించాలని ఆమెను కోరామని, క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు వలన రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని రైతులతోనే సంభాషించి తెలుసుకోవాలన్నామని హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయను స్వయంగా ప్రశంసించినందున తప్పకుండా వస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. గతంలోనే ఆమెను ఆహ్వానించినపుడు రావడానికి సమ్మతిని తెలియజేశారని, కానీ పని ఒత్తిడుల రీత్యా రావడానికి సాధ్యం కాలేదని, ఈసారి తప్పకుండా వస్తామని ఆమె హామీ ఇచ్చారని హరీశ్‌రావు పేర్కొన్నారు.

గోదావరి, కృష్ణాల అదనపు నీటిని కేటాయించండి

గోదావరి, కృష్ణా జలాలపై బచావత్ ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు కారణంగా 45 టీఎంసీలు, పట్టిసీమ ప్రాజెక్టు కారణంగా 35 టీఎంసీల నీరు తెలంగాణకు రావాల్సి ఉందని, దీన్ని కూడా కేటాయించేలా చూడాలని కేంద్రమంత్రిని కోరామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

బచావత్ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పులోని రెండో అధ్యాయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రస్తావనలో ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు లభించిన తర్వాత ఎగువన ఉన్న (నాగార్జునసాగర్‌కు ఎగువన) తెలంగాణకు 45 టీఎంసీలు, కర్ణాటకకు 14, మహారాష్ట్రకు 21 టీఎంసీల చొప్పున నీటిని ఇవ్వాల్సి ఉందని, ఆ ప్రకారం 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని కోరామని హరీశ్‌రావు తెలిపారు.

ఈ నిర్ణయం అప్పటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పరస్పర అంగీకారం అయిన తర్వాత ట్రిబ్యునల్ తన తీర్పులో పేర్కొన్నదని గుర్తు చేశారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తాత్కాలికంగా కుదిరిన పరస్పర అంగీకారం ద్వారా వచ్చే 299 టీఎంసీలకు అదనంగా 45 టీఎంసీలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

అదే విధంగా గోదావరి బేసిన్‌లోని నీటిని కృష్ణా బేసిన్‌లోకి తరలించడానికి ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడా తెలంగాణకు 45 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, ఇది కూడా గోదావరి జలాలపై బచావత్ ట్రిబ్యునల్ అప్పట్లో ఇచ్చిన తీర్పులో పేర్కొన్నదని గుర్తు చేశారు.

గోదావరి బేసిన్‌లోని నీటిని ఏదేని ప్రాజెక్టు ద్వారా ఇతర బేసిన్‌లోకి తరలించే ఏర్పాట్లు చేసినట్లయితే 80 టీఎంసీల నీటిలో తెలంగాణకు 35 టీఎంసీలు, మిగిలినదాంట్లో కర్ణాటక, మహారాష్ట్రలకు కేటాయించాల్సి ఉందని గుర్తు చేశారు. పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో గత డిసెంబరులో ఇచ్చిన పశ్న నం. 2545, 21.12.2015) లిఖితపూర్వక సమాధానం ప్రకారం పట్టిసీమ ప్రాజెక్టు కొత్తదే తప్ప పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ స్పష్టం చేసిందని, కృష్ణా నిర్వహణ బోర్డుకు ఆంధ్రప్రదేశ్ఇచ్చిన వివరణలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసిందని, ఆ ప్రకారంగా 45 టీఎంసీల నీరు తెలంగాణకు రావాల్సి ఉందని తెలిపారు.

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు ఆర్థికసాయంతో 330 శాస్త్రీయ గోడౌన్లను నిర్మిస్తున్నదని, కానీ కేంద్రం నుంచి ఎలాంటి సబ్సిడీ లేదని, గతంలో ఉన్న పథకం ప్రకారం సబ్సిడీని అందజేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌కు రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

తెలంగాణ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలనేది దీర్ఘకాలిక డిమాండ్ అని, దీనిపై కేంద్రం నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదని, వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని కేంద్ర మంత్రి ఉమాభారతిని కోరామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

కేంద్రమంత్రితో మంత్రి హరీశ్

దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని, ప్రస్తుతం దేశం మొత్తం మీద 99 ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నందున వాటిని నిర్మించడంపైనా, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జాతీయ ప్రాజెక్టులను పూర్తి చేయడంపైనా దృష్టి పెడుతున్నందున త్వరలో రూపొందించే జాబితాలో తెలంగాణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

మంత్రి హరీశ్

మంత్రి హరీశ్

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తన పరిధికి మించి వ్యవహరిస్తున్నదని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతికి రాష్ట్ర భారీ సాగునీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ఫిర్యాదు చేశారు. బోర్డు అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి హరీశ్

మంత్రి హరీశ్

ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా బోర్డు వ్యవహరిస్తోందని, తెలంగాణ నీటి హక్కులకు విఘా తం కలిగించేలా ముసాయిదా నోటిఫికేషన్‌ను తయారుచేసిందని పేర్కొన్నారు.

English summary
With Telangana Irrigation Minister T Harish Rao complaining, Union Water Resources Minister Uma Bharathi directed Chief Secretary Rajiv Sharma to hold talks with Krishna Board and also with union Irrigation secretary to sort out the issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X