Mask must: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా: డీహెచ్ శ్రీనివాస్ వార్నింగ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదు. కరోనా నిబంధనలు పూర్తిగా మర్చిపోయారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో అంతటా ఇదే పరిస్థితి ఉంది. కొందరు మాస్కులు పెట్టుకుని కనిపిస్తున్నప్పటికీ.. చాలా మంది మాత్రం మాస్కులు లేకుండా తిరుగుతున్నారు.

తెలంగాణలో మాస్కులు తప్పనిసరి: రూ. 1000 జరిమానా
ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


మెట్రోలోనూ మాస్కులు తప్పనిసరి
రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని డీహెచ్ వెల్లడించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాజమాన్యాలు కూడా పాఠశాలల్లో కరోనా నిబంధలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు, హైదరాబాద్ మెట్రో రైలు, స్టేషన్లలో కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.
తెలంగాణలో 4వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 27,130 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుల చేసింది.తెలంగాణలో ఇప్పటి వరకు 8,00,476 కరోనా కేసులు నమోదు కాగా, 7,91,944 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4111 మంది మరణించారు.
హైదరాబాద్లో కొత్తగా 257 మంది కరోనా బారిన పడగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 37, సంగారెడ్డిలో 73, రంగారెడ్డి జిల్లాలో 58, ఖమ్మం జిల్లాలో 10 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4421 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.