తెగని సమ్మె.... 19న తెలంగాణ బంద్, అధికారులతో సీఎం సమావేశం
ఆర్టీసీ సమ్మెపై ఇరువర్గాలు పట్టువీడే పరిస్థితి కనిపించడం లేదు. సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తున్నా.. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక వర్గాలు మాత్రం మెట్టు దిగడం లేదు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టగా, కార్మిక వర్గాలు తమ ఆందోళనలను ఉదృతం చేసేందుకు సన్నద్దం అవుతున్నాయి. ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ మరోసారి సమ్మె ప్రభావం, ప్రత్యామ్నాయ పరిస్థితులపై చర్చించేందుకు అధికారులతో సమావేశం అయ్యారు.
మరోవైపు ఆర్టీసీ కార్మీకులు ఆదివారం నుండి సమ్మెను ఉదృతం చేసేందుకు కార్యచరణను ప్రకటించి 19న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె 8వ రోజు ... కుటుంబ సభ్యులతో కలిసి మౌన నిరసన దీక్షలు

ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమావేశం
ఆర్టీసీ సమ్మె ప్రారంభమై ఎనిమిది రోజులు గడుస్తోంది. అయినా.. కార్మికులు చేస్తున్న సమ్మెపై ఎలాంటీ నిర్ణయం వెలువడే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. అనూహ్యంగా సమ్మెకు వెళ్లారంటూ కార్మిక నాయకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే వారిని విధుల్లోంచి తొలగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగానే ప్రత్యామ్నాయాలు చేపడుతున్నామని ప్రకటించింది. అయితే.. ప్రయాణికుల కష్టాలు మాత్రం తీరడం లేదు. దీంతో ప్రభుత్వ చర్యలు ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాయి. దీంతో డ్రైవర్లు, మరియు సిబ్బందిని తాత్కాలిక పద్దతిన తీసుకునే చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశం అయ్యారు.

విలీనం లేదని తెగేసి చెప్పిన మంత్రి
ఆర్టీసీ కార్మీకుల ప్రధాన డిమాండ్ ప్రభుత్వంలో విలీనం.. దీంతో ప్రభుత్వంలో విలీనం జరిగే వరకు పోరాటం జరుగుతుందని కార్మికులు ప్రకటించారు. అయితే ఇదే అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి మంత్రి పువ్వాడ అజయ్ స్ఫష్టం చేశారు. కార్మీకులు కోరుతున్నట్టుగా ఆర్టీసీ విలీనం తమ విధానంలో లేదని ఖరాఖండిగా చెప్పారు. ఇందుకు సంబంధించి ఎలాంటీ హామీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పారు. ఏపీలో ప్రభుత్వ హామీ మేరకు ఆర్టీసీ విలీనం జరుగుతోందని చెప్పినా మంత్రి, ప్రతి రాష్ట్రానికి పాలసీపరమైన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. సమ్మెపై ప్రభుత్వ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో మంత్రి అజయ్ కూడ పాల్గోన్నారు.

మెట్టుదిగని కార్మీక సంఘాలు, 19న రాష్ట్ర బంద్
కాగా కార్మీక సంఘాల జేఏసీ కూడ మెట్టుదిగే పరిస్థితి కనిపించడం లేదు. తమ పోరాటానికి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల మద్దుతు కోరిన జేఏసీ, ఇతర ఉద్యోగ సంఘాల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరింది. దీంతో పలు సంఘాల నేతలు ఆర్టీసీ పోరాటానికి మద్దతు పలికేందుకు సమాయాత్తమయ్యారు. 15 తేదీ నుండి 19 వరకు ఐక్యకార్యచరణ ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వంతో చర్చించి సామరస్యపూర్వకంగా తమ డిమాండ్లను సాధించుకునే అవకాశాలు మాత్రం కార్మీక సంఘాల్లో కనిపించడం లేదు. దీంతో ఎన్ని రోజులైనా సమ్మెను కొనసాగించేందుకు కార్మీక జేఏసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు ప్రభుత్వం, ఇటు ఆర్టీసీ కార్మీకుల నిర్ణయాల వల్ల ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.