
సజ్జనార్ అక్కడ ... పెళ్లి చేసుకునే కొత్త జంటలకు తెలంగాణా ఆర్టీసీ కానుకలు..ఊరికే కాదండోయ్ !!
ఒకప్పుడు పోలీసు శాఖలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న సజ్జనార్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. విలక్షణమైన శైలిలో విధి నిర్వహణలో దూసుకుపోయే సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆర్టీసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఆర్టీసీకి విస్తృత ప్రచారం కల్పించడానికి, మరుగున పడిపోయిన ఆర్టీసీ సేవలను మెరుగుపరచడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి సజ్జనార్ తనమార్కు నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తీవ్రమైన నష్టాలతో మూలుగుతున్న ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించే యత్నం చేస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా గతంలో ఎవరికీ లేని గుర్తింపు, ప్రస్తుతం సజ్జనార్ అతి తక్కువ కాలంలో దక్కించుకున్నారు.

పెళ్లిళ్లకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకునే వారికి బహుమతులు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయం
ఇప్పటికే ఆర్టీసీ బస్టాండ్ లో ఎంఆర్పి ధరలకే వస్తువులు నమ్మాలని, బస్టాండ్ లో ప్రయాణికుల భద్రత కోసం సీసీకెమెరాలు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ కార్గో సేవలు మరింత మెరుగు పరచాలని, వివాహాలైనా, విహారయాత్రలు అయినా, రైతులు ధాన్యం రవాణా అయినా సరే ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని చెబుతున్న సజ్జనార్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి చేసుకునే జంటలకు గుడ్ న్యూస్ చెప్పారు. వివాహాది శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న పెళ్లి చేసుకునే కొత్త జంటలకు కానుకలు ఇవ్వాలని సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు.

యాదగిరి గుట్ట నుండి బస్సులు బుక్ చేసుకున్న కొత్త పెళ్లి జంటను ఆశీర్వదించిన సజ్జనార్
ఈ క్రమంలో ఆయన గురువారం యాదగిరి గుట్ట డిపో నుండి పెళ్లికి ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకున్న వధూవరులకు బహుమానాలను పంపించారు. యాదగిరిగుట్ట డిపో నుండి కొంపల్లి కి పెళ్లికి బస్సులను బుక్ చేసుకున్న వరుడు ఆకుల భరత్ కుమార్ ,వధువు సౌమ్య లకు డ్రైవర్లు ముత్యాల ఆంజనేయులు, పబ్బాటి గణేష్ జ్ఞాపికలను బహూకరించి ఆర్టీసీ తరఫున వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ ఎండి సజ్జనార్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదే సమయంలో డ్రైవర్లను అభినందించి వారితో కలిసి ఫోటోలు దిగి ప్రోత్సహించారు.

బస్సులు బుక్ చేసుకున్న కొత్త జంటలకు కానుకలు
రాజేంద్రనగర్ బస్ డిపో నుంచి గురువారం 15 బస్సులను వివాహ శుభకార్యాలకు అద్దెకు ఇచ్చామని, బస్సులను బుక్ చేసుకున్న వారికి బహుమతులను పంపిస్తున్నామని డిపో మేనేజర్ చంద్రకాంత్ వెల్లడించారు. పెళ్లి కోసం ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న మల్లాపూర్ గ్రామానికి చెందిన వరుడు సాయికుమార్, వధువు సుమాంజలికి ఆర్టీసీ డిపో తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ డ్రైవర్ యాదవ్ చేతులమీదుగా బహుమానం పంపించామని ఆయన పేర్కొన్నారు. ప్రజలు తక్కువ ధరలకు ఆర్టీసీ బస్సులు బుక్ చేసుకోవచ్చని, మెరుగైన సేవలు అందిస్తామని ప్రజలలోకి ఆర్టీసీ సేవలను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ మార్క్ .. బస్సులో ప్రయాణం, పలు కీలక నిర్ణయాలు
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి, బస్సులో ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకుని తదనుగుణంగా సమస్యల పరిష్కారానికి నడుంబిగించారు. ఆర్టీసీ బస్సులో సజ్జనార్ ప్రయాణం చేయడమే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. అంతకు ముందు వినాయక చవితి సందర్భంగా కూడా సజ్జనార్ వినాయక నిమజ్జనానికి కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్న సజ్జనార్ సిటీ బస్సులో ప్రయాణాలు చేయడం, బస్టాండ్ లు తనిఖీ చేయడం, ఆర్టీసీ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకోవడం వంటి చర్యలతో ఆర్టీసీని గాడిని పెట్టే పనిలో పడ్డారు.

ప్రజల నుండి సలహాలు, సూచనలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్న సజ్జనార్
ఆర్టీసీ సేవలను మెరుగుపరిచే క్రమంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను పరిష్కరిస్తున్నారు. ప్రయాణికులకు ఆర్టీసీ అందించే మెరుగైన సేవలను ఆయన సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి నల్గొండ కు ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన ఆయన ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకుని, తదనుగుణంగా చర్యలు చేపట్టారు. దసరా సందర్భంగానూ అదనపు చార్జీలు తగ్గించి ప్రైవేట్ పై ప్రజలు ఆధారపడకుండా ఆర్టీసీ ఆదాయాన్ని పెంచే ప్లాన్ చేశారు. ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు డిజిటల్ చెల్లింపులపై దృష్టి పెట్టారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ఆర్టీసీని కించపరిచారని అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు, ప్రతి ఒక్కరికీ ఇది వార్నింగే
అంతేకాదు ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీని అపహాస్యం చేస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. అందులో భాగంగా తెలంగాణా ఆర్టీసీ బస్సును దోశతో పోల్చి చూపించటంపై ర్యాపిడో సంస్థకు, ఆ యాడ్ చేసిన అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు పంపారు సజ్జనార్. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ఎవరు కించపరిచినా సహించేది లేదని తేల్చి చెప్పారు. స్పందించకుంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ చర్యతో ఇక ముందు ఆర్టీసీని ఎవరు తక్కువ చేసి మాట్లాడాలి అన్నా కాస్త అలోచించాల్సిందే అన్న భావన వ్యక్తం అవుతుంది.

ఆర్టీసీ బస్సుల్లో గుట్కాలు, పాన్లు తిని ఉమ్మి వేస్తే భారీ జరిమానా, కఠిన చర్యలు
ఇక ఆర్టీసీ బస్సుల పై ఇష్టారాజ్యంగా పోస్టర్లు వేయడం, ఆర్టీసీ బస్సులలో గుట్కాలు, పాన్ లో తినడం ఉమ్మి వేయడం నిషేధిస్తున్నట్లు సజ్జనార్ ప్రకటన చేశారు. ఎవరైనా ఆర్టీసీ బస్సులలో నిబంధనలను ఉల్లంఘిస్తే ఆర్టీసీ ఆస్తులను నాశనం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుట్కాలు, పాన్ లు తిని ఉమ్మి వేసేవారికి భారీ జరిమానాలు విధిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఇక ఈ నిబంధనలు, ప్రయాణికులకు మాత్రమే కాదు ఆర్టీసీ సిబ్బందికి కూడా వర్తిస్తాయని, డ్రైవర్లు ,కండక్టర్లు ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని సజ్జనార్ తేల్చిచెప్పారు. ఇక ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తీసుకున్న సంచలన నిర్ణయాల పై పలువురు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నాటి నుండి ప్రజలలో సజ్జనార్ తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి పెరగడమే కాకుండా, ఆర్టీసీ బాగుపడుతుందన్న విశ్వాసం కూడా ప్రజలలో ప్రధానంగా కనిపిస్తుంది.