అప్పుల్లో టిడిపి, టిఆర్ఎస్, ఆస్తుల్లో సమాజ్‌వాదీ టాప్:ఏడీఆర్ రిపోర్ట్
హైదరాబాద్: ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిడిపి, తెలంగాణ రాష్ట్రంలో అదికారంలో ఉన్న టిఆర్ఎస్‌లు అప్పుల్లో ఉన్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. దేశంలో అత్యధికంగా ఆస్తులు కలిగిన పార్టీగా సమాజ్‌వాదీ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో డిఎంకె, మూడో స్థానంలో అన్నాడిఎంకె ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలో ఏ రాజకీయ పార్టీ ఆస్తులు, అప్పుల విషయంలో ప్రతి ఏటా ఏడిఆర్ నివేదికను ఇస్తోంది. ఇందులో భాగంగానే శుక్రవారం నాడు అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ జాబితాను విడుదల చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్ చాలా కాలం నుండి ఉంది.

టిడిపి, టిఆర్ఎస్‌కు అప్పులు
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి అధికారంలో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీలు మాత్రం అప్పుల్లో ఉన్నాయి. ఏడిఆర్ నివేదిక అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ జాబితా ప్రకారంగా 2015-16 ఏడాదిలో టిఆర్ఎస్ రూ. 15.97 కోట్లు, టిడిపికి రూ. 8.81 కోట్లు అప్పుటున్నాయని ఈ నివేదిక వెల్లడించింది,. శివసేన మాత్రం తన అప్పులను తగ్గించుకొందని ఈ నివేదిక వెల్లడించింది.

ఆస్తుల్లో సమాజ్‌వాదీ పార్టీ టాప్
2011తో పోలిస్తే సమాజ్ వాదీ పార్టీ ఆస్తులు ఇప్పుడు 198 శాతం పెరగగా, డీఎంకే ఆస్తులు 155 శాతం పెరిగాయని ఏడీఆర్ నివేదిక ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ రూ.634.96 కోట్ల నగదు ఆస్తులతో అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడుకు చెందిన ప్రతిపక్ష డీఎంకే పార్టీ రూ.257.18 కోట్ల సంపదతో రెండో స్థానంలో, అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ రూ.224.84 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.

పెరిగిన పార్టీల ఆస్తులు
2011-12 ఆర్థిక సంవత్సరంలో ఎస్పీ ప్రకటించిన ఆస్తుల విలువ రూ.212.86కోట్లు మాత్రమే. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ పార్టీ ఆస్తులు 298శాతం పెరిగి రూ. 634.96కోట్లుగా ఉన్నాయి. ఇక 2011-12 ఆర్థిక సంవత్సరంలో అన్నాడీఎంకే ఆస్తులు రూ.88.21కోట్లు మాత్రమేనని నివేదిక తెలిపింది. పార్టీల స్థిరాస్తులు, లోన్లు, అడ్వాన్సులు, డిపాజిట్లు, టీడీఎస్, పెట్టుబడులు, ఇతర ఆస్తులు కలిపి ఈ నివేదిక రూపొందించారు.

ఏడీఆర్ జాబితాలో వైసీపీ, ఆప్
2011లో వైసీపీ ఏర్పాటైంది. 2012 లో ఆప్ ఏర్పాటైంది. ఈ రెండు పార్టీలు కూడ ఏడీఆర్ జాబితాలో చోటు దక్కింది.2012-13 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీల సగటు ఆస్తులు రూ.1.165కోట్లు కాగా.. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.3.765కోట్లకు పెరిగినట్లు నివేదిక చెబుతోంది.