వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూర్తి ‘నిఘా’లో ‘శాతవాహన’: నిరవధిక సెలవులు.. మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ పోలీసు నిఘా నీడలోకి వెళ్లిపోయింది. రెండు రోజుల క్రితం జరిగిన ఘటనను మసిపూసి మారేడుగాయ చేయడంతో పరిస్థితి విషమించింది. ఫలితంగా సోమవారం రాత్రి నుంచే పోలీసు బలగాలు వర్సిటీ పరిసరాల్లో నిఘా పెంచాయి. సోమవారం రాత్రి హాస్టళ్లను ఖాళీ చేయించారు. మంగళవారం వర్సిటీ పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను కొనసాగించారు. వర్సిటీలో భవనాలు, బాలుర, బాలికల వసతిగృహాలు, కళాశాలలను పోలీసులు తనిఖీ చేశారు.

డ్రోన్‌ కెమెరాలతో అడుగడుగునా గాలించారు. వర్సిటీకి వచ్చిన వారిని పోలీసులు, యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొని వివరాలు అడిగి లోపలికి అనుమతించారు. రిజిస్ట్రార్‌ కార్యాలయం, పరిపాలన విభాగం మంగళవారం సెలవు దినమైనా ఒకరిద్దరు సిబ్బంది విధులు నిర్వహించారు.

ఉదయం నుంచే ఉస్మానియా, కాకతీయతో పాటు వివిధ వర్సిటీల నుంచి విద్యార్థి సంఘాల నాయకులు వస్తున్నారని ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగానే మంగళవారం విద్యార్థినులు కంటతడి పెడుతూ హాస్టళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. చేతిలో బస్ చార్జీలు లేనివారు తమ స్నేహితుల ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం.వర్సిటీ నిర్మానుష్యంగా మారింది. అసలు సోమవారం ఏం జరిగిందో ఒకసారి పరిశీలిద్దాం..

 భారతమాత చిత్రం దహనం పేరిట బీజేపీ ఆరోపణ

భారతమాత చిత్రం దహనం పేరిట బీజేపీ ఆరోపణ

విశ్వవిద్యాలయం ఐకాస ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు జ్యోతిబాఫూలే విగ్రహ కూడలిలో మనుధర్మశాస్త్ర ప్రతులను దహనం చేశారు. అయితే అక్కడే ఉన్న పలువురు బీజేపీ నాయకులు భరతమాత చిత్రాన్ని దహనం చేస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో ఇరు పక్షాలు పరస్పరం ఆరోపణలకు దిగడం పరిస్థితి అదుపు తప్పింది. కూడలిలోనే విద్యార్థులు, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. దాడి చేస్తున్నారంటూ విద్యార్థులు, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ వాగ్వాదానికి దిగారు. కొద్ది నిమిషాల పాటు ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో జనం ఆందోళనకు గురయ్యారు. భయంతో తలోదిక్కున పరుగులు తీశారు. కరీంనగర్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి, అదనపు పోలీసు కమిషనర్‌ సంజీవ్‌కుమార్‌, కరీంనగర్‌ రూరల్ ఏసీపీ ఉషారాణి, పలు సర్కిళ్ల సీఐలు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులు, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద పోలీస్ పికెటింగ్

వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద పోలీస్ పికెటింగ్

తమ నేతలను అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌కుమార్‌ తదితరులు విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని నాయకులను అదుపులోకి తీసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. వారిని విడుదల చేయాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని సీపీ తెలుపగా దీంతో యూనివర్శిటీ ప్రాంతం నుంచి పాదయాత్రగా కరీంనగర్ నగరంలోకి వచ్చారు. ఘర్షణ తలెత్తడంతో విశ్వవిద్యాలయంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఇతరులెవరినీ అనుమతించలేదు. బాలికల వసతిలో ఉన్న విద్యార్థినులు సెలవులతో ఇంటికి వెళ్లిపోయారు. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రధాన ద్వారం ముందే పలువురు ఎస్సైలు, డిస్ట్రిక్‌ గార్డ్‌ సిబ్బంది పోలీసు పికేటింగ్‌ను ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులు, బీజేపీ నాయకులను సోమవారం రాత్రి కొత్తపల్లి ఠాణాకు తీసుకువచ్చారు. ఎస్సై రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు.

సెమిస్టర్ పరీక్షలు వాయిదా.. వర్సిటీలో నిరవధిక సెలవులు

సెమిస్టర్ పరీక్షలు వాయిదా.. వర్సిటీలో నిరవధిక సెలవులు

కరీంనగర్ జిల్లాకు చెందిన 15మంది బీజేపీ నేతలు, విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘాలకు చెందిన 12 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. రాత్రి వరకు అదనపు ఏసీపీ సంజీవ్‌కుమార్‌, కరీంనగర్‌ రూరల్ ఏసీపీ ఉషారాణి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌లో ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విశ్వవిద్యాలయ కళాశాలలు, మెస్‌లు, హాస్టళ్లు, ఫార్మసీ కళాశాల, మెస్‌ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం.కోమల్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎంబీఏ మూడో సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేసినట్లు, తిరిగి వాటిని నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు సత్వరమే వసతిగృహాలను ఖాళీ చేసి విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పాలని కోరారు. మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎం.కోమల్‌రెడ్డి వర్సిటీకి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

 శాంతియుత వాతావరణం నెలకొల్పాలని విద్యార్థులకు సూచన

శాంతియుత వాతావరణం నెలకొల్పాలని విద్యార్థులకు సూచన

అన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కమిషనరేట్‌లో కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి మూడు గంటలు సమావేశమయ్యారు. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉన్నా కక్ష పూరితంగా కాక సానుకూల వాతావరణంలో తమ భావాలను వెల్లడించాలని కోరారు. వాట్సాఫ్, ఫేస్‌బుక్‌లలో అనవసరమైన పోస్టింగ్‌లు చేస్తూ శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠినచర్యలు తప్పవని సూచించారు.సోమవారం ఘటనను నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. కానీ బంద్ పిలుపు ఉపసంహరించుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విద్యార్థి సంఘాల నేతలకు సూచించారు. అందుకు విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకే చేస్తున్నామని, శాంతియుతంగా జరుపుతామని వామపక్ష, బహుజన విద్యార్థిసంఘాల నేతలు తెలిపారు.

 జనవరి 2 తేదీన యూనివర్సిటీ పున: ప్రారంభం?

జనవరి 2 తేదీన యూనివర్సిటీ పున: ప్రారంభం?

విద్యాసంస్థల యాజమాన్యాలను బెదిరించి చందాల వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వర్సిటీ ఘటనలో పాల్గొన్న విద్యార్థి సంఘాలపై నాన్‌ బెయిల్‌ కేసులు నమోదు చేసే అవకాశమున్నా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నోటీసులు మాత్రమే ఇచ్చామని, మున్ముందు వారి తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ కోమల్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. జనవరి రెండో తేదీ నుంచి యూనివర్సిటీ పున: ప్రారంభంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నారు. మరోవైపు శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలకు నగర పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పిలుపునివ్వడంతో పరిస్థితితులు చక్కబడతాయని అంచనా వేస్తున్నారు.

English summary
Satavahana University in Karimnagar city gone into police survillence from Two days. On Monday clashes leads tension university with students and BJP leaders. In this context university cancelled all semister exams and declared indifinite holidays for university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X