వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సార్వత్రికానికి రిహార్సల్?: సింగరేణి ఎన్నికలపైనే అందరి నజర్..

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం క్రమంగా వేడెక్కుతున్నది. అధికార టీబీజీకేఎస్ తరఫున టీఆర్ఎస్, ఏఐటీయూసీకి దన్నుగా ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రచారం .

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మరో ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పార్టీలకు ప్రత్యేకించి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు కూడా ఈ ఎన్నికల్లో విజయం ద్వారా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆధిక్యం సాధించేందుకు.. ప్రస్తుతం అధికార పక్షంపై నైతిక విజయం సాధించే లక్ష్యంతో హోరాహోరీ పోరాటం సాగిస్తున్నాయి.

దేశమంతా ఒకదారైతే తనదొక దారి అన్నట్లు వ్యవహరించే సీపీఎం అనుబంధ కార్మిక సంఘం 'సీఐటీయూ' మినహా సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీకి కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ కార్మిక సంఘం టీఎన్టీయూసీ ఉమ్మడిగా మద్దతు పలికాయి. దీంతో ఒంటరిగా పోటీలో ఉన్న అధికార తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్).. ఏఐటీయూసీతో పోటాపోటీగా చేపట్టిన ప్రచార హోరు పతాక స్థాయికి చేరింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి గనుల్లో తొలిసారి ఎన్నికలు జరుగుతుండడం, వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు భారీస్థాయిలో 52,534 మంది కార్మికులు ఓటు వేయనున్నందున ఈ ఫలితాలను రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. వచ్చే నెల ఐదో తేదీన పోలింగ్‌ జరగనున్నది. అక్టోబర్ మూడో తేదీ సాయంత్రానికల్లా ప్రచార గడువు ముగుస్తుంది. ఇటు అధికార టీఆర్ఎస్, అటు ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు, బీజేపీ దాని అనుంబంధ కార్మిక సంఘం బీఎంఎస్, హెచ్ఎంఎస్ నేతలు ఇప్పటికే సింగరేణి కాలనీల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

 2012లో బలపడిన తెలంగాణ భావన

2012లో బలపడిన తెలంగాణ భావన

2009లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం వ్యూహాత్మకంగా వెనుకడుగు వేసినా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్.. తెలంగాణ ప్రాంతంలో క్రమంగా బలమైన శక్తిగా ఎదిగింది. ఆ పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చతురత కారణంగా వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ వివిధ ఉప ఎన్నికల్లో అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలను మట్టి కరిపించింది. ఈ క్రమంలో 2012లో జరిగిన ఎన్నికల్లో టీబీజేకేఎస్ తరుఫున ప్రస్తుత రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, తెలంగాణ జాగ్రుత్తి అధినేతగా ఉన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత విస్త్రుత ప్రచారం చేశారు. కార్మిక సోదరుల్లో తెలంగాణ ఏర్పాటు భావన బలీయంగా ఉండటంతో టీబీజీకేఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగిపోయింది.

కానీ తర్వాత రెండేళ్లకు తెలంగాణ కల సాకారమై సొంత రాష్ట్రంలో ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్.. వారసత్వ ఉద్యోగాల కల్పనపైనా, కార్మికులకు ఇచ్చిన హామీల అమలుపైనా చిత్తశుద్ధి ప్రదర్శించిన దాఖలాలు లేవు. పైపెచ్చు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పిస్తామని ఆశల ఊసులు చూపి.. గందరగోళంగా జారీచేసిన మార్గదర్శకాలను హైకోర్టు అడ్డుకుంటే ఆ నెపం విపక్షాలపై మోపేందుకు సర్కార్ వెనుకాడటం లేదు. కానీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావడంతో తమను గెలిపిస్తే ‘డిపెండెంట్' ఉద్యోగాలు కల్పిస్తామని మరోసారి హామీలు గుప్పిస్తున్న గుర్తింపు కార్మిక సంఘం.. ఈ దఫా ఒంటరిపోరుకు దిగుతుండటం.. వైరి పక్షాన బరిలో ఉన్న ఏఐటీయూసీ, దానికి మద్దతునిచ్చిన ఐఎన్టీయూసీ చెరో సారి గుర్తింపు కార్మిక సంఘాలుగా సింగరేణి కార్మికుల్లో పట్టున్న సంఘాలే.

ఈ నేపథ్యంలో సింగరేణిలో ఎన్నికల ప్రచార ప్రారంభం నుంచి వివిధ సంఘాల నేతలను హైదరాబాద్‌కు రప్పించి.. తెలంగాణ భవన్‌లో చర్చోపచర్చలు చేసి ప్రలోభ పెట్టి తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇటీవల ఒక తెలుగు దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత తమ సంఘంలోనూ గొడవలు ఉన్నాయని అంగీకరించారు. సీఎం కేసీఆర్ హయాంలోనే ప్రగతి సాధ్యమని, తమ సంఘం ఆధ్వర్యంలో సింగరేణికి భవిష్యత్ ఉన్నదని, డిపెండెంట్ ఉద్యోగాలు సాధించగలమని నమ్మబలికారు.

2019 తీర్పుకు సంకేతం కానున్నాయా?

2019 తీర్పుకు సంకేతం కానున్నాయా?

సింగరేణి సంస్థ చట్ట ప్రకారం ఓ కంపెనీ మాత్రమే. దీని పరిధిలో 36 భూగర్భ, మరో 16 ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లోని 11 అసెంబ్లీ, నాలుగు లోకసభా నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ పనిచేసే కార్మికుల సభ్యులుగా ఉండే కార్మిక సంఘాల్లో ఒకదానికి అధికారికంగా గుర్తింపు ఇచ్చేందుకు కార్మిక చట్టం ప్రకారం నాలుగేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. 2012లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ ‘తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం'(టీబీజీకేఎస్) గెలిచింది. సింగరేణి సంస్థ అభివృద్ధికి, కార్మికులు, ఇతరవర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మళ్లీ తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు.

ఈ ఫలితాల ద్వారా అధికారపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చెప్పాలంటే టీబీజీకేఎస్‌ను ఓడించాలని టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బలంగా లేని పలు ప్రాంతాల్లో ఆయా సంఘాల్లో బలంగా ఉన్న నేతలతోపాటు వ్యక్తులుగా ప్రభావితం చేయగలవారినీ తమ వైపు మళ్లించుకునేందుకు అవసరమైన దారులన్నీ గుర్తింపు కార్మిక తెరిచి ఉంచింది. మూడున్నరేళ్లుగా ‘డిపెండెంట్' ఉద్యోగాల భర్తీకి అందరితో చర్చించి సమయోచిత నిర్ణయం తీసుకోవడానికి బదులు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో నిబంధనల పరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రలోభాలే పరమావధిగా టీబీజీకేఎస్ విజయం సాధిస్తుందా? లేదా? వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు.

 ఇలా టీఆర్ఎస్ నేతల భవితవ్యానికి కీలకం

ఇలా టీఆర్ఎస్ నేతల భవితవ్యానికి కీలకం

ఈ ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలిప్పిస్తాం, సొంత ఇల్లు నిర్మిస్తాం, వేతనంలో ఇచ్చే అలవెన్సులపై ఆదాయపు పన్నురద్దు, కార్పొరేటు వైద్యం అందిస్తాం.. అంటూ కార్మిక సంఘాలు హామీలిస్తున్నాయి. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా కోర్టు కేసు వల్ల ఆగిపోయాయని, అధికారంలో ఉన్నందున తామే వాటిని తిరిగి ఇప్పించగలమని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక సింగరేణిలో ఐదు వేల కొత్త ఉద్యోగాలను భర్తీ చేసినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీల అనుబంధ సంఘాలను గెలిపిస్తే కార్మికులకు ఉపయోగం ఉండదని విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికలు టీఆర్ఎస్‌కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, నలుగురు మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. టీబీజీకేఎస్ గెలుపు రాజకీయంగా వీరికి కీలకం. గనులున్న ప్రాంతాల్లో ఒక్కో డివిజన్‌ను ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించారు. ఇక ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు పెద్దఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలతో ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేని హెచ్‌ఎంఎస్‌ సంఘం నేత వేణుగోపాలాచారి కూడా టీబీజీకేఎస్ విజయానికి ప్రచారం చేస్తున్నారు.

గెలిచే అవకాశముంటే ప్రలోభాలెందుకున్న కోదండరాం

గెలిచే అవకాశముంటే ప్రలోభాలెందుకున్న కోదండరాం

అధికార టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతల విమర్శలను తిప్పికొడుతూ ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. 2012లో ఎన్నికల్లో అనేక హామీలిచ్చి గెలిచిన టీబీజీకేఎస్ చేసిందేమీ లేదని, ఇప్పుడు మళ్లీ గెలిపించొద్దని టీడీనీ, కాంగ్రెస్‌, సీపీఐ, బీజేపీ చెబుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు సింగరేణి కార్మికుల సమస్యలే కాకుండా రాష్ట్రంలో ప్రజల సమస్యలను కూడా ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ అన్నింటా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నారు. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా సీఎం కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉన్నందున ఆ సంఘాన్ని ఓడిస్తే రాజకీయంగా రాష్ట్రంలో బలం పెరుగుతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అసలు డిపెండెంట్ ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. సంస్థ అత్యవసరాల కారణంగా జరిగే నియామకాలే ప్రధానం అనే ప్రచారం ఎంత వరకు సబబని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తే, గెలిచే అవకాశం ఉంటే సింగరేణి కార్మికులను ఎందుకు ప్రలోభాలకు గురి చేస్తున్నారో చెప్పాలని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఎం కోదండరాం రెడ్డి ప్రభుత్వాన్ని, అధికార టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

English summary
Campaign for the Singareni-recognised trade union elections reminiscence campaign of the general elections. Leaders of trade unions affiliated to political outfits campaigned in all the 11 areas of the SCCL. Of the 53,146 workers, who are supposed to exercise their franchise, 1,000 are retiring September end. Therefore, only 52,534 will exercise their right. In all, 92 polling booths have been set up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X