
పక్కా ప్లాన్ తోనే సికింద్రాబాద్ ఘటన-వాట్సాప్ గ్రూపులే ఆయుధం-విస్తుపోయిన రైల్వే
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ ఆర్మీ రిక్రూట్ మెంట్ పథకానికి వ్యతిరేకంగా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. ఇందులో పలు రైళ్లు కూడా తగులబడ్డాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇంత భారీ ఎత్తున విధ్వంసం, కాల్పులకు దారి తీసిన ఘటన వెనుక షాకింగ్ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసం
ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఇవాళ సికింద్రాబాద్ స్టేషన్లో భారీ ఎత్తున విధ్వంసం చోటు చేసుకుంది. ఈ విధ్వంసాన్ని ఏమాత్రం ఊహించని రైల్వే వర్గాలు షాక్ కు గురయ్యాయి. నిరసనకారుల్ని కంట్రోల్ చేసేందుకు అక్కడ ఉన్న పోలీసులు ఏమాత్రం సరిపోలేదు. దీంతో నాలుగైదు గంటలపాటు విధ్వంసం కొనసాగించింది. చివరికి నిరసనకారుల్ని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఇందులో ఓ నిరసనకారుడు చనిపోవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

విధ్వంసం వెనుక పక్కా ప్లాన్
ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన వెనుక షాకింగ్ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిరసనకు ఆందోళనకారులు పక్కా ప్లాన్ తోనే వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ స్టేషన్లో నిరసనకు ప్లాన్ చేసుకున్న ఆందోళనకారులు నిన్న రాత్రి నుంచే అక్కడికి చేరుకుని కాపు కాసినట్లు తెలుస్తోంది. ఉదయం రద్దీ ఉండని సమయం చూసుకుని స్టేషన్లోకి ప్రవేశించి విధ్వంసానికి దిగినట్లు అర్ధమవుతోంది. దీంతో రైల్వే పోలీసులు సైతం ఊహించని ఈ ఘటనకు ఎలా స్పందించాలో తెలియక కొన్ని గంటలపాటు మిన్నకుండిపోయారు.

జిల్లాల్లో వాట్సాప్ గ్రూపులతో
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో విధ్వంసం సృష్టించేందుకు నిరసనకారులు ముందుగానే తెలంగాణ జిల్లాల్లో పక్కా ప్లాన్ తో ముందుకు కదిలినట్లు తెలుస్తోంది. ముందుగా జిల్లాల్లో ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో ఆర్మీ రిక్రూట్ మెంట్ కు పోటీ పడుతున్న కొందరు అభ్యర్ధులు మిగతా వారిని రెచ్చగొట్టినట్లు సమాచారం. దీంతో వాట్సాప్ లోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిరసనలకు పిలుపునిచ్చారు. అనుకున్నట్లుగానే నిన్న రాత్రి రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుని ఇవాళ ఉదయం వరకూ వేచి చూశారు. స్టేషన్ బయట బస్సును ధ్వంసం చేసి పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత స్టేషన్ లోకి ప్రవేశించి రైళ్లను కాల్చారు. చివరికి పోలీసుల కాల్పులతో పరిస్ధితి అదుపులోకి వచ్చింది.

సికింద్రాబాద్ ఘటనపై రైల్వే విచారణ
అగ్నిపథ్ పథకంపై ఉన్న కోపంతో నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. ఇవాళ ఉదయం ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జీఎం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆయన అందించిన వివరాల ఆధారంగా రంరంలోకి దిగిన రైల్వే పోలీసులు ఈ ఘటనకు దారి తీసిన కారణాలతో ఆరా తీస్తున్నారు. వీటి ఆధారంగా త్వరలో రైల్వే చట్టం కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టులు చేస్తారని తెలుస్తోంది. రైల్వేల చరిత్రలోనే దారుణమైన ఘటనల్లో ఒకటిగా కనిపిస్తున్న సికింద్రాబాద్ స్టేషన్ ఘటనపై రైల్వేశాఖ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.