
సికింద్రాబాద్ విధ్వంసం: కాల్పుల్లో మరణించిన రాకేష్ సోదరుడికి ప్రభుత్వోద్యోగం; సీఎస్ ఉత్తర్వులు
అగ్నిపథ్ ఆందోళనలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సమయంలో రైల్వే పోలీసుల కాల్పులలో మృతిచెందిన దామెర రాకేష్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుడు రాకేష్ కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సికింద్రాబాద్ లో అగ్నిపథ్ ఆందోళనలు..
కాల్పుల్లో వరంగల్ యువకుడు రాకేష్ మృతి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. అగ్నిపథ్ ఆందోళనలలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈనెల 17వ తేదీన ఒక్కసారిగా ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. వారిని నిలువరించడానికి ప్రయత్నించిన క్రమంలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పులలో వరంగల్ జిల్లాకు చెందిన దామెర రాకేష్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
తెలంగాణా యువకుడి మృతితో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రం తీరుపై మండిపడింది. నిరుద్యోగ యువకుడి మృతికి కేంద్రమే కారణమని మండిపడింది.

రాకేష్ కుటుంబానికి 25లక్షల పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
సికింద్రాబాద్ విధ్వంసంలో రైల్వే పోలీసుల కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతిచెందడంతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణా మంత్రులు సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారాన్ని ఇవ్వడంతోపాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇక ఈ మేరకు మృతుడు దామెర రాకేష్ సోదరుడు దామెర రామ్ రాజుకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

మృతుడు రాకేష్ సోదరుడికి విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని సీఎస్ ఉత్తర్వులు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ విధ్వంసం సమయంలో మృతి చెందిన రాకేష్ సోదరుడు రామ్ రాజ్ కు అతని విద్యార్హతలకు అనుగుణంగా వరంగల్ జిల్లాలో తగిన ఉద్యోగం కల్పించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సిఎస్ సోమేశ్ కుమార్. ఉత్తర్వులకు అనుగుణంగా దీనిపై త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని ఆయన సూచించారు. దీంతో మృతుడు రాకేష్ కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.