దేశంలో సంచలనం జరగబోతోంది: ఢిల్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు, కేజ్రీవాల్ సర్కారుకు కితాబు
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వరుస భేటీలతో బిజీ బిజీగా కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా శనివారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ విద్యా విధానంపై కేసీఆర్ ప్రశంసలు
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలోని మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేసీఆర్ పరిశీలించారు. కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్‌కు సర్వోదయ పాఠశాలను చూపించారు. అనంతరం అక్కడి సిబ్బంది పాఠశాల ప్రత్యేకతలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య, సదుపాయాలను కేసీఆర్‌కు వివరించారు. పాఠశాలలో అందుతున్న అధునాతన వసతుల గురించి కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు సంబంధించిన వీడియోలను వీక్షించిన కేసీఆర్... విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని కొనియాడారు. కేజ్రీవాల్ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని అన్నారు. కేజ్రీవాల్ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు.
ఢిల్లీ స్ఫూర్తితోనే అంటూ కేసీఆర్: తమకు గౌరవమంటూ కేజ్రీవాల్
తెలంగాణ ఉపాధ్యాయులు, సంఘాల ప్రతినిధులను ఢిల్లీ పాఠశాలలకు పంపిస్తామ.. ఢిల్లీ బోధనా విధానాలను అధ్యయనం చేయాలని చెప్తామని కేసీఆర్ తెలిపారు. ఢిల్లీ బోధనా విధానాలు దేశం మొత్తానికి ఆదర్శనీయమన్నారు. దేశంలో మరెక్కడా ఇటువంటి విద్యా విధానం లేదని ప్రశంసించారు. విద్యార్థులను జాబ్ సీకర్లుగా కాకుండా... జాబ్ ప్రొవైడర్లుగా మార్చుతున్న విధానం చాలా బావుందన్నారు కేసీఆర్. తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పాఠశాలలను చూడటానికి వచ్చారు. మాకు చాలా గౌరవంగా ఉంది. స్కూల్ మొత్తం చూపించాం. వారు ఎన్నో ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాశాఖపై చాలా ఆసక్తి ఉందని చెప్పారు. మొహల్లా క్లినిక్‌లను సందర్శించిన సీఎం కేసీఆర్.. ఢిల్లీ స్ఫూర్తితోనే తాము తెలంగాణలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

దేశంలో సంచలనం జరగబోతోందన్న కేసీఆర్
కాగా, ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయాలే మాట్లాకుంటారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అంతేగాక, దేశంలో ఒక సంచలనం జరగాల్సి ఉందని, తొందర్లోనే జరిగి తీరుతుందన్నారు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో అందరూ చూస్తారు అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం ఏకపక్షంగా ఉండరాదన్నారు కేసీఆర్. ప్రజాస్వామ్య దేశంలో చర్చలు, సంప్రదింపులు ఉండాలి. విద్యా విధానం దేశానికి అవసరమే... కానీ, ఒకరు రూపొందించి అందర్నీ అమలు చేయాలనడం సరికాదు. కేంద్రం ఏ కొత్త విధానమైనా అయినా తీసుకురావొచ్చు. ఆ విధానం తీసుకువచ్చే ముందు కేంద్రం, అన్ని రాష్ట్రాలతో చర్చించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని కేసీఆర్ వ్యాఖ్యానించారు.