• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సీఐడీకే ఝలక్! విచారణకు వచ్చి పరారైన ‘బోధన్ స్కాం’ డిసీ, డైలమాలో అధికారులు

By Ramesh Babu
|

హైదరాబాద్: 'బోధన్' స్కాం కేసులో కీలక నిందితుడైన వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సీఐడీ అధికారుల కళ్లు గప్పి పరారయ్యాడు. పరారైంది ఎక్కడ్నించో కాదు, సాక్షాత్తు సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి.. అదీ అతడిని విచారిస్తుండగానే.

గత నెల 29న జరిగిన ఈ ఘటనపై సీఐడీ ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన కేసు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ముఖ్యమైన కేసులో, అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సీఐడీ అధికారుల సమక్షంలోంచి, అదీ ఆ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి కీలక నిందితుడు పరారవడం సంచలనం రేపుతోంది.

అసలేం జరిగిందంటే...

స్కాం కేసులో కీలక నిందితుడైన వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావును సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అతడి నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో ఇక లాభం లేదనుకుని అరెస్టు కు సిద్ధమయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి కోసం వేచి చూస్తున్నారు.

Shock! Bodhan Scam Accused jump from CID Central Office during an enquiry

అరెస్టు తప్పదని అర్థమవగానే...

ఇక అరెస్టు తప్పదని డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావుకు కూడా అర్థమైపోయింది. అంతలో- విచారణకు పిలిచిన అధికారి బయటకు వెళ్లారు. అదే అవకాశంగా డిప్యూటీ కమిషనర్‌ సీట్లోంచి లేచాడు. తలుపులు తెరిచి అటూ ఇటూ చూశాడు. పెద్దగా సిబ్బంది ఎవరూ కనిపించలేదు. ఇంకేముంది.. ఎవరికీ అనుమానం రాకుండా మెల్లగా నడుచుకుంటూ అక్కడ్నించి జంప్‌ అయ్యాడు.

కట్టుదిట్టమైన భద్రత ఉన్నా...

హైదరాబాద్ లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు డీజీపీ, ఇద్దరు ఐజీలు, నలుగురు అదనపు ఎస్పీలు, పదుల సంఖ్యలో డీఎస్పీలు, 30 మందికిపైగా ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. ఇంతమంది అధికారులతో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నో సంచలనాత్మకమైన కేసులను విచారించే సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచే చల్లగా జారుకోవడం ఎలా జరిగిందో అధికారులకే అర్థం కావడం లేదు. అతడి కోసం పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పరారైన రోజు నుంచే డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు జాడ తెలియడం లేదు. అతడి ఇంటికి తాళం వేలాడుతూ సీఐడీ అధికారులను వెక్కిరిస్తోంది. అతడి భార్యాపిల్లల పత్తా కూడా లేదు.

ఆది నుంచీ వివాదాస్పదమే...

బోధన్‌ స్కాం విచారణ ప్రారంభమైన నాటినుంచి దర్యాప్తు అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మొదట దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పక్కనబెట్టారు. ఆ తర్వాత దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ... నిందితులతో కుమ్మక్కయ్యారని తేలడంతో సీఐడీ అదనపు డీజీపీ ఆయన్ను సస్పెండ్‌ చేశారు. ఇప్పుడు ఏకంగా అదనపు ఎస్పీ అధికారిని విచారణ అధికారిగా నియమించినా.. ఏకంగా సీఐడీ కేంద్ర కార్యాలయం నుంచి నిందితుడు పరారవడం ఉన్నతాధికారులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

అగ్గిమీద గుగ్గిలమైన ఉన్నతాధికారులు

శ్రీనివాసరావు పరారైన సమాచారం అందగానే పోలీసు ఉన్నతాధికారులతోపాటు ప్రభుత్వ వర్గాలు కూడా దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక ఈ కేసులో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఏసీటీవో పూర్ణచందర్‌ రెడ్డి విషయంలోనూ సీఐడీ ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేయకపోతే తీవ్రమైన చర్యలుంటాయని దర్యాప్తు అధికారులను హెచ్చరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఒకరికి బదులు మరొకరి అరెస్ట్...

బోధన్‌ స్కాంలో మొదట అరెస్ట్‌ చేయాల్సింది పరారైన డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావునే. అయితే సీఐడీ కార్యాలయం నుంచి ఆయన పరారవడంతో దర్యాప్తు అధికారులకు, ఉన్నతాధికారులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో ఆయన తర్వాత అరెస్టు చేయాల్సిన మరో అధికారి శ్రీనివాస్‌రావును అదేరోజు అర్ధరాత్రి అరెస్ట్‌ చేశారు. తప్పించుకొని పారిపోయిన అధికారి పేరు, అరెస్ట్‌ చేసిన అధికారి పేరు ఒకటే కావడం గమనార్హం. ఎలాగూ శ్రీనివాస్‌రావు అరెస్ట్‌ కావాల్సిందే కాబట్టి మొదటి అధికారి కన్నా ముందు ఈయనను అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది.

గాలింపు ముమ్మరం...

సీఐడీ కార్యాలయం నుంచి పోలీసుల కళ్లుగప్పి పారిపోయిన డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు కోసం రెండు ప్రత్యేక బృందాలు నాలుగు రోజులుగా వేట సాగిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. ఎలాగైనా డిప్యూటీ కమిషనర్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

English summary
The CID officials who involved in Bodhan Scam Investigation are in a deep shock now. Becuase the prime accused of this scam, deputy commissioner of commercial tax Srinivas Rao jumped from the CID head office during the enquiry. After in a shock for a while the officials had a great thought. To reduce the self damage the officials arrested another accused whose name also Srinivas Rao in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X