
ప్రభుత్వ వైద్యులకు షాక్: ప్రైవేట్ ప్రాక్టీస్ పై తెలంగాణా ప్రభుత్వ నిషేధం; వారికి మాత్రమే!!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, మళ్లీ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, తన ప్రైవేట్ ప్రాక్టీస్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టడం, ప్రభుత్వాసుపత్రిలో పనిపైన దృష్టి పెట్టకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు బయట ప్రాక్టీస్ చేయడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధిస్తూ తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రభుత్వ వైద్యులను ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించింది. ఈ మేరకు మంగళవారంనాడు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ జీవో విడుదల చేశారు. అయితే ఈ నిషేధం త్వరలో రిక్రూట్ అయ్యే వైద్యులకు మాత్రమే వర్తిస్తుందని , ఇప్పటికే ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారికి కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయంపై వైద్యుల అసంతృప్తి
తెలంగాణ రాష్ట్రంలో ఇకనుండి ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్ చేయబడిన డాక్టర్లకు ప్రైవేట్ ప్రాక్టీస్‌పై పూర్తిగా నిషేధం ఉంటుంది అని ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ జారీ చేసిన ఒక ఉత్తర్వులో తెలిపారు. అయితే ఈ ఉత్తర్వుల పట్ల వైద్యులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిగంటలు పూర్తయిన తర్వాత, వ్యక్తిగత ఆసక్తి మేరకు వారు ప్రజలకు వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని వారు కోరుతున్నారు.

ప్రభుత్వ నిర్ణయం వెనుక అనేక కారణాలు
అయితే ప్రభుత్వ ఆస్పత్రులలో పని చేసే వైద్యులు బయట ప్రాక్టీస్ చేస్తూ ప్రభుత్వ ఆస్పత్త్రులకు వెళ్ళటం లేదని, సరిగా ప్రభుత్వాసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించటం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఇదే సమయంలో ప్రైవేట్ గా వారు చేస్తున్న ప్రాక్టీస్ వల్ల ప్రభుత్వ ఆస్పత్రులలో తమ వద్దకు వచ్చే పేషెంట్లను కూడా తప్పుదారి పట్టించి, బయట తమ క్లినిక్ లకు వచ్చేలా చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇలాంటి చర్యలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయం తెలంగాణా వైద్యుల రిక్రూట్ మెంట్ పై ప్రభావం చూపే ఛాన్స్
ఆరోగ్య శాఖలో 1326 ఎంబిబిఎస్ వైద్యులతో ప్రారంభించి దాదాపు 10,028 పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న చాలామంది, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో, ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం విధించడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయడానికి ఆసక్తి చూపుతారా ? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేధం డాక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను దెబ్బతీస్తుందేమో అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.