వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. ఆమెను ఉంచుకుంటా : లావణ్య సూసైడ్ కేసులో సంచలన విషయాలు
ఇటీవల శంషాబాద్‌లో లావణ్య అనే గృహిణి ఆత్మహత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తమ కూతురి చావుకు అల్లుడే కారణమని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు... తాజా పలు విషయాలను బయటపెట్టారు. పోలీస్ అధికారి అయిన లావణ్య అక్క భర్త దీనిపై మాట్లాడుతూ... పెళ్లయిన 5 నెలల నుంచే లావణ్య-వెంకటేశ్ మధ్య గొడవలు మొదలయ్యాయని చెప్పారు. అయితే అవన్నీ కామనే అనుకున్నామని... కానీ గత 3 నెలలుగా వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. వెంకటేశ్ సమస్యేంటో తెలుసుకుని సెటిల్ చేసే ప్రయత్నం చేశామని... కానీ అతను లావణ్యనే అసలు సమస్యగా భావించాడన్నారు.

వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని.. లావణ్యను ఉంచుకుంటానని...
'3 నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే డబ్బులు కావాలాన్నాడు. ఎంత కావాలని అడిగితే రూ.3 కోట్లు అని చెప్పాడు. ఊరిలో పొలాలు అమ్మి ఎంతొస్తే అంతా తీసుకొచ్చి నీకే ఇస్తానని మామ అతనితో చెప్పాడు. అయితే డబ్బులిచ్చినా సరిగా చూసుకుంటానో లేదోనని అన్నాడు. అసలేంటి నీ సమస్య అని అడిగితే... లావణ్యకు పిల్లలు కావడం లేదన్నాడు. సరే,మా బేబీని ఇస్తాం తీసుకోమంటే వద్దన్నాడు. పోనీ వేరే ఎవరినైనా దత్తత తీసుకోమన్నా వద్దన్నాడు. పోనీ ఐవీఎఫ్ పద్దతిలో కృత్రిమ గర్భధారణకు ప్రయత్నిద్దామంటే వద్దన్నాడు. వేరే అమ్మాయిని చేసుకుంటాను... లావణ్యను ఉంచుకుంటానని చెప్పాడు. అతని తండ్రి చాలా అగ్రెసివ్. ఎప్పుడూ లావణ్యను బయటకు గెంటేయమని చెబుతుండేవాడు.' అని లావణ్య అక్క భర్త వాపోయారు.

తల్లి ఆవేదన...
లావణ్య తల్లి మాట్లాడుతూ.. 'పాప చనిపోయి 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ కంటికి నిద్ర లేదు. విల్లా కావాలంటే... సరే మేము కూడా ఆర్థికంగా సాయం చేస్తామన్నాం. ఏ అవసరమొచ్చినా సాయం చేస్తూనే ఉన్నాం. నేను గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్,నా భర్త కూడా గవర్నమెంట్ రిటైర్డ్ టీచర్. పాపకు ఏది కావాలన్నా ఇచ్చేవాళ్లం. అంత అపురూపంగా పెంచుకున్న బిడ్డను నరరూప రాక్షసుడు పొట్టనపెట్టుకున్నాడు. వాడి తల్లిదండ్రులు కూడా నా బిడ్డ చావుకు కారణం..' అని వాపోయారు.

లావణ్య అత్త మామలు కూడా అంతే...
'నీకు పిల్లలు పుట్టకపోతే... నా కొడుకు సంపాదించే కోట్లన్నీ ఎవరికి పెట్టాలి. మా ఇళ్లల్లో ఒకటి కాదు రెండు,మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు.. ఇలా నానా మాటలతో నా బిడ్డను వేధించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు న్యాయం జరగకపోతే మాత్రం మేము బతకలేం. అంత బాధలో ఉన్నాం.' అని చెప్పారు.

ఆరోజు తీవ్రంగా కొట్టాడు...
'కరోనా పీరియడ్‌లో పని మనిషి రాకపోయినా.. 3 నెలల నుంచి తానే అన్ని పనులు చేస్తోంది. ఎంత చేసినా.. వాడు మాత్రం ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశాడు. ఆఖరికి విడాకులు తీసుకోమ్మా.. మేము నిన్ను పువ్వుల్లా చూసుకుంటామని చెబితే సరేనమ్మా అన్నది. చనిపోయే రోజు సాయంత్రం కూడా చాలాసేపు వీడియో కాల్ మాట్లాడింది. కానీ ఆరోజు సాయంత్రం ఇంటికొచ్చాక వాడు మా బిడ్డను తీవ్రంగా కొట్టాడు. ఆఖరికి సూసైడ్ నోట్ రాస్తూ కూడా తనకు ఓపిక లేదని అందులో రాసింది. చేతి వేళ్లను వెనక్కి విరిచి కొట్టినట్టు చెప్పింది.' అని ఆమె తల్లి చెప్పుకొచ్చారు.

తండ్రి ఆవేదన...
'వాడు లావణ్యను రోజూ తిడుతుండేవాడు. నువ్వు చనిపోతే వేరేదాన్ని చేసుకుంటానని తిట్టేవాడట. అయినా సరే మారుతాడన్న నమ్మకంతో నా బిడ్డ అక్కడే ఉండిపోయింది. వాడి మీద అనేక కేసులున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో కూడా వాడిపై కూడా ఉంది. ఎప్పుడూ బెంగళూరు,చెన్నై ఇతర నగరాలకు వెళ్తూ అక్రమ సంబంధాలు కొనసాగించాడు. నా బిడ్డతో నాపై ప్రామిస్ కూడా చేయించుకున్నాను... ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని. ఏ రోజుకైనా అక్కడినుంచి బయటకొస్తానని చెప్పింది.' అని లావణ్య తండ్రి చెప్పుకొచ్చారు.

మేకవన్నె పులి...
'జూన్ 25వ తేదీ రాత్రి ఇంటికొచ్చాక లావణ్యను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత మరో గదిలోకి వెళ్లి లావణ్య ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసింది. సూసైడ్ నోట్ కూడా రాసింది. అయితే వాడు దాడి చేయడం వల్లే నా కూతురు స్పృహ కోల్పోయి అక్కడే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆమె డెడ్ బాడీకి ఉరివేసి ఆత్మహత్యలా చిత్రీకరించాడు. పిల్లలు పుట్టట్లేదని ఓ నెపం వాడే సృష్టించాడు. వాడో పెద్ద మేకవన్నె పులి.' అని లావణ్య తండ్రి వాపోయారు.