దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ: ఆరు నెలల జైలుశిక్ష, జరిమానా విధించిన స్పెషల్ కోర్టు
హైదరాబాద్: ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు దానం నాగేందర్‌కు జైలు శిక్షతోపాటు జరిమానా విధించింది. ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
2012లో బంజారాహిల్స్‌లో కారుకు అడ్డు వచ్చిన ఓ పోలీసుపై దాడి చేసి బెదిరించారన్న అభియోగంపై దానం నాగేందర్ తోపాటు చట్నీ రాజు అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నాంపల్లి కోర్టు నుంచి ఇటీవల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ అయ్యింది.

విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు దానం నాగేందర్‌పై ఐపీసీ 323 సెక్షన్ కింద అభియోగాలు రుజువైనట్లు తేల్చింది. ఈ క్రమంలో దానం నాగేందర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించిన కోర్టు.. జరిమానా చెల్లించకపోతే మరో నెల రోజులపాటు జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
అప్పీల్ చేసుకునేందుకు వీలుగా దానం నాగేందర్‌పై శిక్షను నెలరోజులపాటు నిలిపివేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన దానం నాగేందర్ 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత టీఆర్ఎస్ టికెట్‌పై ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.