నగర కూడళ్లలో స్మార్ట్ సిగ్నల్స్.!ప్రజా రవాణా భద్రతకు ప్రాధాన్యం.!జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.!
హైదరాబాద్ : ప్రజా రవాణా భద్రత చర్యల్లో బాగంగా నగరంలో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడం, ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా నివారణ చర్యల కోసం వివిధ ట్రాఫిక్ జంక్షన్ల వద్ద సిగ్నల్ ఏర్పాటుకు జిహెచ్ఎంసి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ మహా నగరం విశ్వ నగరం దిశగా దినదినాభివృద్ది చెందుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీతో పాటు ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతున్న దృష్ట్యా వాహనాల రద్దీని క్రమబద్దీకరించి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని నగరపాలక సంస్ధ అధికారులు పేర్కొన్నారు. నగర వ్యాప్తంగా యూనిఫైడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా, పెలికాన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయనున్నారు. ఈ సిగ్నల్ నిర్వహణ బాధ్యతను ప్రవేటు ఏజెన్సీకి అప్పగించడం జరిగిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

అంతే కాకుండా డిజైన్, సప్లై, టెస్ట్, ఆపరేషన్, ఇన్స్టాల్ సర్వే , నిర్వహణ ప్రవేటు ఏజెన్సీనే చేస్తుందని, పోలీస్ శాఖ అధికారులు పోల్ మార్కింగ్ లొకేషన్ గుర్తింపు చేసి, జిహెచ్ఎంసికి సిపార్స్ చేస్తారని అధికారులు తెలిపారు. వారి ప్రతిపాదన మేరకు జిహెచ్ఎంసి సిగ్నల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారని, ఈ నేపథ్యంలో నగరంలో 221 సిగ్నల్స్ ఉండగా ఏ.టి.యస్.సి సిస్టమ్ ద్వారా అదనంగా 155 సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడంతో పాటు, మరో 98 సిగ్నల్స్ ను పెలికాన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. నగరంలో ఏర్పాటు చేయనున్న సిగ్నల్స్ ను యుద్ద ప్రాతిపదికన చేపట్టి మొత్తం డిసెంబర్ మాసం చివరి వరకు పూర్తి చేయనున్నారు. పాత కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్ మూడేళ్ల పాటు పూర్తి నిర్వహణ బాధ్యత ప్రవేటు ఏజెన్సీదేనని అధికారులు తెలిపారు. ఏర్పాటు చేసిన సిగ్నల్స్ లను కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేస్తారని, రోజు వారి ట్రాఫిక్ వివరాలను కూడా రికార్డు చేస్తారని నగర పాలక అధికారులు స్పష్టం చేస్తున్నారు.