
గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్నారు-టీఆర్ఎస్ నేతలపై బండి సంచలన ఆరోపణలు-అన్నీ బయటపెడుతామంటూ...
టీఆర్ఎస్ ప్రభుత్వంలోని నేతలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నేతలు గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ నేతలకు రక్త పరీక్షలు చేయిస్తామన్నారు. తనను బట్టతల,గుండు అని విమర్శిస్తున్నవాళ్ల సంగతి చెబుతానని హెచ్చరించారు. భాష విషయంలో కేసీఆరే తనకు గురువు అని... అందుకే గురుదక్షిణగా కేసీఆర్ భాషను కేసీఆర్‌కే అప్పజెప్పుతున్నానని పేర్కొన్నారు. ఓవైపు వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంటే... కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రంలో ఉన్నా... ఢిల్లీలో ఉన్నా ప్రజలకు చేసేదేమీ లేదన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం(సెప్టెంబర్ 8) సంగారెడ్డిలో సంజయ్ పాదయాత్ర చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ఆయన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి చేరుకుంది.ఈ సందర్భంగా శివంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు.
purvimundada: వామ్మో ఏమిటి ఈ అందం ... టాప్ లెస్ ఫొటోలతో రెచ్చిపోతున్న హాట్ బ్యూటీ (ఫొటోస్)

కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లు...
'ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వారి బాధలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.కనీస మద్దతు ధర లేక,రుణమాఫీ జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రంగారెడ్డి,సంగారెడ్డి సహా కొన్ని ప్రాంతాల్లో పండ్లు కూరగాయలు పండించే రైతులు... కనీసం గిట్టుబాటు ధర లేక,వాటిని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీలు లేక ఇబ్బందిపడుతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయించినట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఆయనేం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. కేసీఆర్ ఇక్కడున్నా చేసిందేమీ లేదు... అక్కడుండి చేసిందేమీ లేదు. వరదలతో ఇళ్లు కూలి,మనుషులు చనిపోయి,పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. కేసీఆర్ ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీ నేతలు రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ఎక్కడ డిమాండ్ చేస్తారోనన్న భయంతోనే కేసీఆర్ ఢిల్లీలోనే ఉండిపోయారు.' అని బండి సంజయ్ విమర్శించారు.

ఒక్క రైతును ఆదుకోలేదు..
గడిచిన ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఒక్క రైతుకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు.కనీసం రైతులకు భరోసా ఇచ్చిన దాఖలా లేదన్నారు. మండల స్థాయి అధికారులను పంపించడం.. కమిటీ వేశామనడం... నష్టం అంచనా వేస్తున్నామని ఆర్నెళ్లు పాటు టైమ్ పాస్ చేయడం... ఎప్పుడూ ఇదే జరుగుతోందన్నారు. ఈలోగా రైతులు మరో పంట వేసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఏ రైతు లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదన్నారు. బ్యాంకుల్లో రుణమాఫీ కాక... ఆ డబ్బులు చెల్లించలేని దుర్భర పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఫసల్ భీమా యోజనాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లించట్లేదన్నారు. కేంద్రం భూసార పరీక్షల కోసం రూ.120 కోట్లు ఇచ్చినా... ఎక్కడా భూసార పరీక్షలు చేయించలేదన్నారు.ఇప్పటికైనా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

హిందువుల పండుగలకే అనుమతులా
అన్ని వర్గాలు,మతాలు ప్రశాంతంగా పండుగలు జరుపుకునేలా ప్రభుత్వం వ్యవహరించాలన్నారు.వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారు.. హిందువుల పండుగలకే అనుమతులు తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బహిరంగ సభలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే ఎందుకని నిలదీశారు. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో హిందువులు దీన స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. వినాయక విగ్రహం ఎక్కడ పెడతారు... ఎంత ఎత్తు షెడ్ వేస్తారు... పర్మినెంట్ షెడ్డా? లేక తాత్కాలిక షెడ్డా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారని... దాని కోసం యాప్ కూడా తయారు చేశారని మండిపడ్డారు. హిందువుల పండగలతో చెలగాటం ఆడితే సహించేది లేదని డీజీపీని బండి సంజయ్ హెచ్చరించారు.టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందని... ప్రజలంతా యాత్రకు సహకరిస్తున్నారని వెల్లడించారు.

దమ్ముంటే అడ్డుకోండి...
గణేశ్ విగ్రహాల నిమజ్జనంతో నీటి కాలుష్యం జరుగుతోందన్న విమర్శలను బండి సంజయ్ కొట్టిపారేశారు. కొన్ని బీర్ కంపెనీలు నీటి కాలుష్యం చేస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు. ఎందుకంటే వారి నుంచి ప్రభుత్వానికి కమిషన్లు అందుతున్నాయన్నారు.'లక్ష మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే కోవిడ్ రాదా..? పర్మిషన్ తీసుకుని పండుగలు చేసుకుంటే కోవిడ్ రాదా..? పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు సీఎం, డీజీపీ సహకరించాలని కోరుతున్నా. హుస్సేన్ సాగర్ (వినాయక్ సాగర్) లో నిమజ్జనం జరిపి తీరుతాం. దమ్ముంటే అడ్డుకోండి. హైకోర్టులో పిటిషన్ వేయించిన ఘనత కేసీఆర్‌ది. ప్రతీసారి హిందువుల పండుగలు అంటేనే ఆంక్షలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో బీర్ ఫ్యాక్టరీలు వదిలే నీళ్లతో మంజీరా నది జలాలు కలుషితం అవుతున్నాయి. ఇది మీకు గుర్తుకు రావడం లేదా' అని సంజయ్ ప్రశ్నించారు.

కేసీఆరే నాకు గురువు...
'నాది గుండే.. నాకు ఉన్నది గుండు మాత్రమే.. నా అందాన్ని విమర్శించే వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో నాకు తెలియదా? నిన్ను, నీ యాక్టింగ్‌ను చూసి యాక్టర్సే సిగ్గు పడుతున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే టీఆర్ఎస్ వాళ్లకి రక్త పరీక్షలు నిర్వహిస్తాం.' అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏడాది,రెండేళ్ల తర్వాత కూడా రక్తం డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటాయని... బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారో తేలుస్తామన్నారు.తాను వాడుతున్న భాష విషయంలో కేసీఆరే తనకు గురువు అని అన్నారు. ఏం పీకుతరా.. అంటూ కేసీఆర్ మాట్లాడితే ఆయన కొడుకు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు.కేసీఆర్ ఒకటి అంటే తాను రెండు అంటానని.. అదే తానిచ్చే గురుదక్షిణ అన్నారు.

ఢిల్లీలో పొర్లు దండాలు...
కేసీఆర్ ఢిల్లీ వెళ్లి పొర్లుదండాలు పెడుతున్నారని.. ఆరు రోజులుగా అక్కడే తిరుగుతున్నాడని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బీజేపీలోకి వెళ్తున్నారని ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతోనే ఢిల్లీలో పొర్లుదండాలు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ మినహా అన్ని పార్టీలతో కలిసి పోటీ చేసిందని గుర్తు చేశారు. కేసీఆర్ కెప్టెన్ అయితే, ఒవైసీ వైస్ కెప్టెన్ అని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్స్ ట్రా ప్లేయర్లు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.