కదులుతున్న రుతుపవనాలు: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్
హైదరాబాద్: బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లా కోటిపల్లిలో 11.2, బంట్వారంలో 11, దుద్యాలలో 10.2, ధవలాపూర్లో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో గత ఫిబ్రవరి తరవాత 24 గంటల వ్యవధిలో 11 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడం ఇదే తొలిసారి. శనివారం కౌటాల(కుమురం భీం జిల్లా)లో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు, తెలంగాణలో ఆది, సోమవారాలతోపాటు మంగళవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాక తెలిపింది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్ మేఘాల వల్ల కొన్ని గంటల వ్యవధిలోనే భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. పొలాల్లో పనులకు వెళ్లే రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పిడుగులు పడే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.