పట్టపగలే దారుణం: గొడ్డళ్లు, రాడ్లతో యువకులపై దాడి, ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం నగరంలో పట్టపగలు దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు పట్టపగలే ఓ వ్యక్తిని ఘోరంగా చంపారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన మరొకరు ప్రాణపాయ స్థితుల్లో ఆపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోని గూనపాలాం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై గుర్తుతెలియన వ్యక్తులు గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్లతో దాడి చేశారు.
స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గూనపాలేనికి చెందిన దీర్గాశి కరుణ్ కుమార్ ఆయన దగ్గరి బంధువయిన దీర్గాశి హరీష్ కుమార్ ఇంటి బయట మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే అక్కడికి వచ్చిన దుండగులు గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, హరీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. హరీష్ మెడపై తీవ్ర గాయాలు కావటంతో పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

తీవ్రంగా గాయపడిన హరీష్‌ను చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించారు. కాగా, మృతి చెందిన కరుణ్ కుమార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.. గాయపడిన హరీష్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాడి అనతంరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా, ఈ ఘాతుకానికి పాల్పడిన వారిలో పట్టణంలోని దమ్మలవీదికి చెందిన వారు కూడా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పట్టపగలు ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. కరుణ్ మృతితో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రేమ విఫలమై విద్యార్థిని ఆత్మహత్య
తిరుపతిలో శనివారం విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఒక విద్యార్ధిని, ప్రేమ విఫలమయ్యిందని మరో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నారు. రెండు ఘటనలలోనూ ప్రేమే ప్రధాన కారణంగా మారింది. పద్మావతి కళాశాలలోని హాస్టల్ గదిలో విష్ణు ప్రియ(17) అనే విద్యార్ధిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతురాలు కె.వి పల్లి మండలం గర్ని మిట్ట వాసి కాగా ఆమె తల్లి తండ్రులు కువైట్‌లో ఉంటున్నారు.
కాగా, మరోక ఘటనలో ప్రేమ విఫలం అయ్యిందని ఇంటర్ విద్యార్ధి నాగేంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలోని బీసీ హాస్టల్ ఉంటున్న నాగేంద్ర కుమార్ హాస్టల్ ఐదవ అంతస్తునుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిది చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బీమగానిపల్లిగా తెలిసింది.