మంచం, దుప్పటి తెచ్చుకుని మరీ కుటుంబం వింత నిరసన; ఖమ్మం జిల్లాలో ఘటన
తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ కార్యాలయాలలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పడిగాపులు పడాల్సి వస్తుంది. తహసీల్దార్ కార్యాలయంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని పురుగుల మందు డబ్బాలతో కొందరు ఆందోళన తెలియజేస్తూ ఉంటే, మరికొందరు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళ తహసీల్దార్ ఆఫీస్ గేటుకు తాళిబొట్టు కట్టి నిరసన వ్యక్తం చేసింది. రుద్రంగి మండలం తహసీల్దార్ కార్యాలయం గేటు వద్ద తన తాళిబొట్టును లంచంగా తీసుకొని తన భూమిని మళ్లీ తన పేరుతో పట్టా చేయాలని ఆందోళన చేసింది.
తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో తమ భూమిని ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించారు అని తహసీల్దార్ కార్యాలయం ముందు వినూత్నఆందోళనకు దిగారు ఓ కుటుంబం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో తమ భూమిని ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించారని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఒక కుటుంబం ఏకంగా మంచం, దుప్పట్లు తెచ్చుకొని తహసీల్దార్ కార్యాలయం ముందే మకాం పెట్టారు. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళకు ఎకరం 3 గుంటల భూమి ఉంది. వారసత్వంగా అది అరుణకు సంక్రమించింది.

ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఇతరుల పేరుతో రికార్డుల్లోకి ఎక్కించేశారని దాంతో ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలు తమకు అందకుండా పోతున్నాయని అరుణ కుటుంబం గత కొంత కాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతుంది. రైతుబంధు లాంటి పథకాలు తమకు దక్కకుండా పోతున్నాయని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. చాలా కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బాధితురాలు అరుణ ఆరోపిస్తోంది. ఎకరం పొలం పైన ఆధారపడి తన కుటుంబం జీవిస్తుందని తమ భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇప్పించాలని బాధిత కుటుంబం కోరుతోంది.
ఈ క్రమంలో కొడుకుతో కలిసి ఆందోళన బాట పట్టిన అరుణ తహసిల్దార్ కార్యాలయం ముందే మకాం పెట్టింది. మంచం, దుప్పటి తీసుకువెళ్లి ఆందోళన చేసింది. మంచంపై పడుకుని అరుణ కొడుకు నిరసన తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు భూసమస్య పరిష్కారం కోసం అరుణ ఆందోళన చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక తహసీల్దార్ కార్యాలయం అధికారులు వారి భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.