వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యాహ్న భోజనంపై సుప్రీం ఇలా: తెలంగాణలో అధ్వాన్నం, మెనూ ప్రశ్నే లేదు

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపు, బాలలకు పౌష్టికాహారం అందజేయాలన్న సత్సంకల్పంతో ప్రారంభించిందే మధ్యాహ్న భోజన పథకం.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపు, బాలలకు పౌష్టికాహారం అందజేయాలన్న సత్సంకల్పంతో ప్రారంభించిందే మధ్యాహ్న భోజన పథకం. తొలుత తెలుగుదేశం పార్టీ హవాను ఎదుర్కొనేందుకు 1982లోనే తెలుగు నాట అమలుజేసిన ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలవుతోంది.

అయితే నాణ్యతను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2013లో బీహార్‌లోని ఓ గ్రామంలో మధ్యాహ్న భోజనం తిని 23 మంది చిన్నారులు మృతిచెందడంపై అంతరాష్ట్రీయ మానవ్ అధికార్ నిగ్రాని అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. మధ్యాహ్న భోజనం నాణ్యత ఎలా పెంపొందిస్తారో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

భోజనం పరిశుభ్రంగా ఉందో లేదో ఎలా తెలుసుకుంటున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూ జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో రెండు చొప్పున పర్యవేక్షక కమిటీలు వేస్తామని పేర్కొన్నాయి. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పరిశుభ్రత పెంపు విషయంలో మరిన్ని సూచనలు ఇవ్వాలని వాటికి మెరుగులు దిద్ది అమలయ్యేలా చూస్తామని పేర్కొన్నది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

విచారణకు స్వీకరించిన సుప్రీం...

విచారణకు స్వీకరించిన సుప్రీం...

ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన పూర్తి వివరాలను తాము సూచించిన ఫార్మాట్‌లో విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఈ ఏడాది మార్చిలోనే కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మూడేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు తెన్నులు ఒకసారి పరిశీలిద్దాం..

Recommended Video

YSRCP MLA Alla Ramakrishana Reddy Eats Rs.5 Meal in Hydearabad - Oneindia Telugu
వారానికి ఒక్క గుడ్దే.. లోపించిన పర్యవేక్షణ

వారానికి ఒక్క గుడ్దే.. లోపించిన పర్యవేక్షణ

గిరిజన పుత్రులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు అద్వాన్నంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వారానికి మూడుసార్లు గుడ్లు పెట్టాలన్న నిబంధన అమలు సంగతే మరిచారు. ఉడికీ ఉడకనీ అన్నం తినలేక విద్యార్థులు తమ ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్న క్యారేజీ భోజనంతోనే సరిపెట్టుకుంటున్నారు. మెత్తగా తయారైన అన్నానికి తోడు నీళ్లచారుతో విద్యార్థులు కడుపు నింపుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుజేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ఆదిలాబాద్ జిల్లాలో ఆచరణలో ఫేలవంగా మారుతున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. వారానికి ఒక గుడ్డు ఇవ్వడానికే పరిమితమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో లక్ష్యం నీరుగారుతోంది. జిల్లాలోని చాలా ఏజెన్సీలు మెనూ పాటించడం లేదు. నీళ్లచారు, మెత్తటి అన్నంతో సరిపెడుతుండటంతో సగం మంది విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. మరికొంత మంది నాణ్యతలేని భోజనం చేస్తూ అవస్థలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలల ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.

కోడిగుడ్లకు బదులు అరటి పండ్ల పంపిణీతో సరి

కోడిగుడ్లకు బదులు అరటి పండ్ల పంపిణీతో సరి

ఆదిలాబాద్‌ జిల్లాలో 1172 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 954 ఉండగా, 44,064 మంది విద్యార్థులు చదువుతున్నారు. 112 ప్రాథమికోన్నత పాఠశాలుండగా ఇందులో 18,073 మంది, 106 ఉన్నత పాఠశాలల్లో 10,304 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 72,441 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.4.13 పైసలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థికి రూ.6.18పైసల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది.

అలాగే ఒక్కో విద్యార్థికి వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలి. ఒక్కో గుడ్డుకు రూ.4 చొప్పున నిధులు విడుదల చేస్తోంది.కానీ కొన్నిచోట్ల కోడిగుడ్లకు బదులు అరటిపండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. సన్నరకం బియ్యం అయినప్పటికీ అన్నం మెత్తగా కావడంతో సగం మంది విద్యార్థులు తినలేకపోతున్నారు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కుమ్మక్కై భోజనం చేయని విద్యార్థుల డబ్బులు కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మండల విద్యాధికారులు కనీసం పాఠశాలలను నెలకోసారి తనిఖీ చేయాల్సి ఉన్నా ఎక్కడా అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. చాలామంది ఎంఈవోలు కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. వీరితో పాటు ఉప విద్యాధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అయితే ఆదిలాబాద్ డీఈఓ కే లింగయ్య మాట్లాడుతూ పకడ్బందీగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. మెనూ ప్రకారం పాఠశాలల్లో భోజనం పెట్టాల్సిందేనన్నారు.

ధర తక్కువ ఉన్న కూరగాయలతోనే సరి.. చాలకుంటే నీళ్లచారు

ధర తక్కువ ఉన్న కూరగాయలతోనే సరి.. చాలకుంటే నీళ్లచారు

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. పేరుకే సాంబారు తప్ప అందులో చారు నీళ్లు తప్ప మరేమీ ఉండవు. కూరగాయల ముక్కలు అసలు వేయడం లేదు. ఇదేంటని అడిగితే వంట వండే వాళ్లు మమ్మల్ని తిడుతున్నారు' అని సర్కారీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంచేస్తున్న విద్యార్థులు బోరు మంటున్నారు. దానికి తోడు తాజాగా పెరిగిన కూరగాయల ధరలతో మెనూను పాటించడం కష్టంగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.


టమాట ధర అధికం కావడంతో ఏజెన్సీ నిర్వాహకులు దాని జోలికి వెళ్లట్లేదు. తక్కువ ధరలున్న కూరగాయలు తెచ్చి వంట చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో వడ్డించిన సాంబారులో కూరగాయ ముక్కలు చాలా తక్కువగా కనిపించాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పరిశీలిస్తే, కేవలం పప్పు, చారు మాత్రమే వడ్డించారు. దేంట్లోనూ కూరగాయల ముక్కలు లేవు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం గుమ్మడవెల్లి ప్రాథమిక పాఠశాలలో గుడ్డుతోపాటు నీళ్లచారును పిల్లలకు పెట్టారు. ఇందులో కూరగాయలు వాడలేదు. ఇక మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం ఉప్పరగూడెంలో సాంబారు, గుడ్డుతో భోజనం పెట్టాల్సి ఉండగా కిచిడి, పచ్చి పులుసుతో సరిపెట్టారని విమర్శలు ఉన్నాయి.

English summary
New Delhi: The Supreme Court on Monday asked the Centre and states how were they monitoring the implementation and hygiene of the mid-day meal schemes in government schools across the country. A bench of Chief Justice J S Khehar and Justice D Y Chandrachud sought the response of the Centre and the state governments while noting that two committees at the national and state level were suggested to be set up to monitor various aspects like maintaining hygiene in the mid-day meal schemes in schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X