వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బతుకమ్మ చీరెల డొల్ల: సిరిసిల్ల ఆడబిడ్డకు సూరత్ చీరలు, పేరు బద్నాం...

అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన చరిత్ర సిరిసిల్లది. ఇప్పుడు సిరిసిల్లలో నేసిన బతుకమ్మ చీరల నాణ్యతపైనే చర్చ జరుగుతున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన చరిత్ర సిరిసిల్లది. ఇప్పుడు సిరిసిల్లలో నేసిన బతుకమ్మ చీరల నాణ్యతపైనే చర్చ జరుగుతున్నది. బతుకమ్మ పండుగ సందర్భంగా కోటి మంది మహిళలకు ఉచితంగా చీరలు పంచాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే. దీని అమల్లో అవకతకలపైనే మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకోవడానికే బతుకమ్మ చీరలను వారితో నేయించినట్లు ప్రభుత్వం చేసిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి సూరత్‌వైపు మళ్ళింది. ముందస్తు ప్రణాళిక లోపించటంతోపాటూ సమయాభావం వల్ల కోటికి పైగా చీరలను సిరిసిల్లలో తయారు చేయించలేమని తెలిసిన చేనేత, జౌళి శాఖ ఆగమేఘాల మీద సూరత్‌వైపు పరుగులు పెట్టింది.

Recommended Video

Bathukamma sarees Issue : బతుకమ్మ చీరలు : సిరిసిల్ల vs సూరత్‌

ఇదే అదనుగా భావించిన సిరిసిల్లకు చెందిన కొందరు పవర్‌లూమ్‌ యజమానులు హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యాపారులు, సూరత్‌ పవర్‌లూమ్‌ యజమానులతో కమీషన్‌లు మాట్లాడుకుని భారీ కుంభకోణానికి తెర లేపినట్టు తెలుస్తున్నది.

గమ్మత్తేమిటంటే చేనేత చీరలకు నెలవైన సిరిసిల్ల పట్టణంలో 90 శాతం సూరత్‌లో కొనుగోలు చేసిన చీరలను పంపిణీ చేయడమే. బతుకమ్మ చీరల నాణ్యతలో రాజీ పడలేదని, నిబంధనల ప్రకారమే వీటిని కొనుగోలు చేశామని చేనేత జౌళిశాఖ చేస్తున్న ప్రచారాన్ని కూడా మహిళలు నమ్మటం లేదంటే తమ కంటి ఎదురుగా ఉన్న నాసిరకం సూరత్‌ చీరలే కారణమని స్పష్టం అవుతున్నది. మిగతా పవర్ లూమ్ యాజమాన్యాలకు ఆర్డర్లు వెళ్లకుండా 'రిలయన్స్' నూలు మాత్రమే వాడాలని ఏకపక్ష నిబంధన విధించడమూ సరిపడా ఉత్పత్తి చేయలేకపోవడానికి కారణమని తెలుస్తున్నది.

సిరిసిల్ల నేత కార్మికులు నేసిన చీరలపై ఇలా ప్రచారం

సిరిసిల్ల నేత కార్మికులు నేసిన చీరలపై ఇలా ప్రచారం

సూరత్‌ చీరల కొనుగోలు విషయాన్ని ఇప్పటి వరకూ చేనేత శాఖ అధికారికంగా ప్రకటించలేదు. టెండర్లు విషయం గానీ, కొటేషన్ల వివరాల విషయంలో గానీ కూడా ఆ శాఖ గోప్యత పాటిస్తున్నది. బతుకమ్మ పండుగకు రాష్ట్రవ్యాప్తంగా 1,04,57,610 చీరలను మహిళలకు ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికోసం రూ. 224 కోట్లు ఖర్చవుతాయని చేనేత జౌళిశాఖ అంచనా వేసింది. ఈ చీరలన్నీ సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌ ద్వారా నేయిస్తామని నమ్మబలికింది. కనీసం ఆరు నెలల ముందే చెప్తే అవసరమైనన్ని చీరలు సిరిసిల్లలో తయారు చేసేవారు. కేవలం మూడు నెలల ముందు చెప్పటం వల్లే తాము కోటి చీరలు తయారు చేయలేమని ప్రభుత్వానికి చెప్పినట్టు సిరిసిల్లకు చెందిన పవర్‌లూమ్‌ యజమానులు చెప్పారు.

 చిన్న పవర్ లూమ్ యజమాన్యాల ఆందోళన ఇలా..

చిన్న పవర్ లూమ్ యజమాన్యాల ఆందోళన ఇలా..

బతుకమ్మ చీరలు నేయడం కోసం రిలయన్స్‌ నూలును మాత్రమే వినియోగించాలని చేనేత శాఖ పెట్టిన నిబంధన వెనుక కొందరు పెద్ద పవర్‌లూమ్‌ యజమానుల హస్తం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నూలు కేవలం నలుగురైదుగురికే అందుబాటులో ఉంది. మిగిలిన 20 వేల చిన్న పవర్‌లూమ్‌లకు ఇది దొరకక పోవటంతో కొద్దిమందికే ఎక్కువ చీరలు తయారు చేసే ఆర్డర్‌ లభించింది. సిరిసిల్లలో తయారు చేసిన 50 లక్షల బతుకమ్మ చీరల్లో సగానికి పైగా వీరే తయారు చేసినట్టు అధికారిక లెక్కల ద్వారా తెలిసింది. రిలయెన్స్‌ నూలు నిబంధనపై చిన్న పవర్‌లూమ్‌ యాజమాన్యాలు ఆందోళన చేయటంతో 'బెలోసా' అనే నూలుతో చీరల తయారీకి చేనేత శాఖ ఆలస్యంగా అనుమతించింది. అప్పటికే ఒక నెల గడిచిపోయిందని పవర్‌లూమ్‌ యాజమాన్యాలు పేర్కొన్నాయి.

 అన్నింటా చక్రం తిప్పింది వారే

అన్నింటా చక్రం తిప్పింది వారే

పెద్ద వవర్‌లూమ్‌ యజమానుల్లో ముగ్గురు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ వారు కావటంతో చీరల తయారీ, ధర నిర్ణయంతోపాటూ సూరత్‌ కాంట్రాక్టు విషయంలోనూ వారే చక్రం తిప్పినట్టు తెలిసింది. తగిన సమయం లేక సిరిసిల్లలో కేవలం 50 లక్షల చీరలు మాత్రమే తయారవుతాయని తెలిసిన అధికారులు మిగిలిన చీరలను సూరత్‌ నుంచి తెప్పించాలని నిర్ణయించారు. ఈ ఆర్డర్‌తో పాటూ సిరిసిల్లలో తయారైన సాదాచీరలపై డిజైన్లు, అద్దకాలు చేసే పనిని కూడా సూరత్‌లోనే చేయించారు. కొత్త చీరల కొనుగోలుతోపాటూ డిజైన్లు వేసే కాంట్రాక్టులో అధికారులతో సూరత్‌ వ్యాపారులు కుమ్మక్కై అధిక ధరలను కోట్‌ చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారం వెనుక టీఆర్‌ఎస్‌ పవర్‌లూమ్‌ల యజమానుల హస్తం కూడా ఉన్నదని చిన్న పవర్‌లూమ్‌ యజమానులు ఆరోపిస్తున్నారు.

సిరిసిల్ల చీరతో సమానంగా సూరత్ చీరకు చెల్లింపు

సిరిసిల్ల చీరతో సమానంగా సూరత్ చీరకు చెల్లింపు

సూరత్‌ నుంచి తెచ్చిన చీరలు నాసిరకం నూలుతో తయారు చేయటమే కాక తయారీలో లోపాలు ఉన్నాయని సిరిసిల్ల పవర్‌లూమ్‌ కార్మికులు తెలిపారు. ఈ చీరల ధర కేవలం రూ. 70కి మించి ఉండదని వారు అంటున్నారు. సిరిసిల్లలో తయారైన ఒక్కొక్క సాదా చీరకు రూ. 117 పడగా వీటిపై డిజైన్ల ప్రింటింగ్‌కు మరో రూ. 40 నుంచి రూ.50 ఖర్చయిందని తెలిపారు. పెద్ద వయస్సు వారి కోసం తయారు చేసిన రంగు చీరకు రూ.148 ఖర్చయిందని వారు చెప్పారు. సిరిసిల్లలో తయారైన రెండు రకాల చీరలకు బహిరంగ మార్కెట్‌లో రూ. 500 కూడా పలుకుతుందన్నారు. నాణ్యతలో ఎంతో మెరుగైన సిరిసిల్ల చీరలకు ఎంత చెల్లించారో నాణ్యత తక్కువగా ఉన్న సూరత్‌ చీరలకు కూడా ప్రభుత్వం ఇదే మొత్తంలో చెల్లించడం తమను అవమానించటమేనని కార్మికులు వాపోయారు.

తమ పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై నేత కార్మికులు ఇలా

తమ పట్ల సర్కార్ నిర్లక్ష్యంపై నేత కార్మికులు ఇలా

తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ జరుపుకుంటుంటే లక్షల మంది అడబిడ్డలకు బతుకమ్మ చీరలందించిన సిరిసిల్ల నేతన్నలు మాత్రం పండుగ నాడూ అర్థాకలితోనే కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆకలి చావులు, ఆత్మహత్యలకు చిరునామాగా మారిన సిరిసిల్ల నేతన్నలను ఆదుకునేందుకే రూ. 220 కోట్ల విలువైన బతుకమ్మ చీరలను నేసే పనిని అప్పగించామని చెప్తున్న సర్కార్‌ చేతిలో నేతన్నలు మరోసారి దగా పడ్డారు. బతుకమ్మ చీరల నేత పని పూర్తయి 15 రోజులు గడచినా పవర్‌లూమ్‌లకు చెల్లించాల్సిన బిల్లులు పూర్తిగా చెల్లించక పోవటంతో వారు కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను చెల్లించకపోవడంతో పండుగ చేసుకునే పరిస్థితి లేదని కార్మికులు వాపోతున్నారు. సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు దసరా సందర్భంగా ముందే జీతాలు, బోనస్‌ అందిస్తున్న ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తున్నదని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికీ నాలుగోవంతు బిల్లులు మాత్రమే చెల్లింపు

ఇప్పటికీ నాలుగోవంతు బిల్లులు మాత్రమే చెల్లింపు

సిరిసిల్లలోని మరమగ్గాల ద్వారా దాదాపు 50 లక్షల చీరలు నేసినట్టు కార్మికులు తెలిపారు. ఒక్కో చీరకు సగటున రూ.130 చొప్పున రూ. 65 కోట్లు చేనేత జౌళి శాఖ చెల్లించాల్సి ఉంది. 45 రోజుల క్రితం తొలి దశ చీరల తయారీ పూర్తి చేసి వాటిని చేనేత శాఖకు అందచేశారు. నాలుగో వంతు బిల్లులను ప్రభుత్వం ఆ శాఖ ద్వారా చెల్లించిందని పవర్‌లూమ్‌ యజమానులు తెలిపారు. తాము ముందుగా ఒప్పందం చేసుకున్న మేరకు 15 రోజుల క్రితమే మిగిలిన చీరలను కూడా అందచేశామని, అయినా ఇప్పటి వరకూ చేనేతశాఖ నుంచి పూర్తి స్థాయి బిల్లులు అందలేదని, కానీ గత శనివారం కొంత మేరకు వేతనాలు చెల్లించామని పవర్‌లూమ్‌ యజమానులు అంటున్నారు. గతంలో హైదరాబాద్‌ నగర మార్వాడీలకు బట్టలు అమ్మితే ఎప్పటికప్పుడు బిల్లులు వచ్చేవని, ప్రతి శనివారం కార్మికులకు వేతనాలు చెల్లించేవారమని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తేనే పూర్తిగా వేతన బకాయిలు తీర్చగలుగుతామని చెప్పారు.

బతుమ్మ చీరలతో అదనంగా రూ.4,000 వేతనం

బతుమ్మ చీరలతో అదనంగా రూ.4,000 వేతనం

సిరిసిల్లలోని 40,000 పవర్‌లూమ్స్‌కు వీటిలో 20,000 పవర్‌లూమ్స్‌కు బతుకమ్మచీరల తయారీ పనిని అప్పగించారు. వీటిలో దాదాపు 5,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. సాధారణ సందర్భాల్లో ఆర్డర్లు ఉన్నప్పుడు ప్రతి కార్మికుడూ నెలకు రూ. 8,000 వేతంగా పొందేవారు. బతుకమ్మ చీరల కోసం ఎక్కువ సమయం పనిచేస్తే అదనంగా మరో రూ.4000 నుంచి రూ.4,500 వేలు మాత్రమే వేతనంగా లభించనున్నదని కార్మికులు తెలిపారు. రెండు నెలలు కష్టపడినా తమకు చెల్లించాల్సిన వేతనం యజమానులు పూర్తిగా చెల్లించక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. బతుకమ్మ చీరల పని పూర్తయి 15 రోజులు గడచిందని, ప్రస్తుతం ఆర్డర్లు లేక పోవటంతో పవర్‌లూమ్‌లు పనిచేయటం లేదని చెప్పారు. ఫలితంగా మళ్ళీ ఆర్డర్లు వచ్చే వరకూ తమకు పస్తులు తప్పదని ఆందోళన చెందుతున్నారు.

సూరత్ చీరల పంపిణీపై ఆగ్రహం

సూరత్ చీరల పంపిణీపై ఆగ్రహం

చీరల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సిరిసిల్లలో సూరత్‌ చీరలను పంచడం సంచలనం కలిగించింది. రాష్ట్రచేనేత, జౌళిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి 10 శాతం మాత్రమే అక్కడ తయారైన చీరలు సరఫరా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన 90 శాతం సూరత్‌ చీరలను పంపిణీ చేశారు. సూరత్‌ చీరల విషయంలో అక్కడి మహిళలు ఏమంటారోననే భయంతో చీరల పంపిణీ కూడా ఐదు రోజులు ఆలస్యంగా చేపట్టారని స్థానికులు చెప్తున్నారు.

శుక్రవారం నుంచి మాత్రమే సిరిసిల్ల పట్టణంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తమకు స్థానికంగా తయారైన చీరలే కావాలని సిరిసిల్లలోని కొన్ని వార్డుల వారు కోరటంతో వారికి మాత్రమే స్థానిక చీరలను రహస్యంగా పంచినట్టు తెలిసింది. సిరిసిల్ల పట్టణంలో 30 వేల చీరలు పంచాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకూ వీటి పంపకం పూర్తి కాలేదు. శనివారం పంచిన సూరత్‌ చీరల్లో చిరుగులు, అతుకులతో కూడినవి రావటంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందు ఆర్డర్ ఇవ్వడంలో సర్కార్‌దే జాప్యం

ముందు ఆర్డర్ ఇవ్వడంలో సర్కార్‌దే జాప్యం

ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ పేరుతో తమ పేరును చెడగొడుతున్నదని సిరిసిల్ల చేనేత కార్మికులు అంటున్నారు. తాము మంచి నాణ్యమైన చీరలు నేశామని వేరే ప్రాంతం నుంచి నాసిరకం చీరెలు తెప్పించి పంచుతూ సిరిసిల్ల పేరు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ చీరలతో కేవలం రెండు నెలల కాలం మాత్రమే కార్మికులకు పని దొరికిందని, అలా కాకుండా ఏడాది పొడవునా పని ఉండేలా క్యాలెండర్‌ రూపొందించి ఇక్కడి పవర్‌లూమ్‌లకు ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వాలని సీహెచ్ గంగాధర్ అనే వ్యక్తి అంటున్నారు. బతుకమ్మ చీరల కోసం ఆరు కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని, కేవలం రెండు నెలల ముందే ఆర్డర్ రావడంతో సకాలంలో తయారు చేయలేకపోయామని రమణ అనే నేత కార్మికుడు తెలిపారు. మిగతా చీరలను సూరత్ నుంచి తెప్పించుకున్నదని చెప్పారు. గతంలో నెలకు రూ.7వేల నుంచి రూ.8వేలు కూలి వచ్చేదని కోడం శ్రీధర్ అనే మరో నేత కార్మికుడు అన్నాడు. ప్రభుత్వం చీరెల ఆర్డర్‌ ఇచ్చిన తరువాత నెలకు రూ.12వేల నుంచి రూ.13వేల కూలీ సంపాదించామని, ఇంకా ముందుగా ఆర్డర్‌ ఇచ్చి ఉంటే మరో రెండు నెలలు చేతి నిండా పని దొరికి నెలకు రూ.4వేలు అదనంగా సంపాదించుకునేవాళ్లమన్నాడు.

English summary
Bathukamma Saries distribution hits government failure. Surprisingly Textiles Ministry has supplied Surat saries to Siricilla women while they also angry on distributors. Three Powerloom owners were play key role in saries production and take over contract from surat traders. Till today government didn't reveal the total process of saries distribution project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X