రేవంత్ రెడ్డికి టీకాంగ్రెస్ సీనియర్ల షాక్: యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విపక్ష పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక ఎపిసోడ్ దుమారంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య కొత్త పంచాయతీకి తెరతీసింది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కలహాలు యశ్వంత్ సిన్హా రాక నేపథ్యంలో మరోమారు బయటపడ్డాయి.
హెచ్ఐసీసీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత; ముట్టడికి యత్నించిన యూత్ కాంగ్రెస్; అరెస్ట్ చేసిన పోలీసులు

యశ్వంత్ సిన్హా రాక తో కాంగ్రెస్ లో బయటపడిన అంతర్గత విబేధాలు
తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న యశ్వంత్ సిన్హా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే కలవాలని, అలా కాకుండా టిఆర్ఎస్ పార్టీ నేతలను, సీఎం కేసీఆర్ ను కలిస్తే, తాము యశ్వంత్ సిన్హా ను కలిసేది లేదని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వెళ్ళడానికి వీల్లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అయితే టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేస్తూ పలువురు సీనియర్ నేతలు యశ్వంత్ సిన్హా ను కలవడానికి రెడీ అయ్యారు.

యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన మాజీ ఎంపీ హన్మంతరావు
ఇక ఇదే సమయంలో శనివారం మధ్యాహ్నం నగరానికి వచ్చిన ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో సమావేశాన్ని దాటవేయాలని టీపీసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పార్టీలోని సీనియర్ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీపీసీసీ ఆదేశాలను ధిక్కరిస్తూ, బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు యశ్వంత్ సిన్హాను స్వాగతిస్తున్న సమయంలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు ఆయనను కలిశారు.

యశ్వంత్ సిన్హాను కలవకూడదని నిర్ణయించిన కాంగ్రెస్
దేశంలోని కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరకాటంలో పడేస్తూ, శనివారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధ్యక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో జరిగే సమావేశాన్ని దాటవేయాలని టీపీసీసీ నిర్ణయించింది. టీఆర్ఎస్ నేతలను కలిసే ఏ నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కలవరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఒకవేళ అలా కలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అని, కాంగ్రెస్ అభ్యర్థి కాదని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ మద్దతు మాత్రమే ఇస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు.

వీహెచ్ అలా... జగ్గారెడ్డి ఇలా.. రేవంత్ రెడ్డికి షాక్
అయితే ఈ స్టాండ్ పార్టీలో ఉన్న కొద్దిమంది సీనియర్ నేతలలో లేనట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ వీ హనుమంతరావు మరికొందరు పార్టీ కార్యకర్తలతో కలిసి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి యశ్వంత్ సిన్హాను కలిశారు. రేవంత్ రెడ్డి కి ఊహించని షాక్ ఇచ్చారు. మరోపక్క జగ్గారెడ్డి కూడా జాతీయస్థాయిలో సిన్హాకు మద్దతు ఇస్తూ హైదరాబాద్ కు వచ్చిన క్రమంలో మద్దతుగా నిలవకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా యశ్వంత్ సిన్హా ను కలవడం కోసం జగ్గారెడ్డి అపాయింట్మెంట్ కోరారు. ఇక ఈ పరిణామాలు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి షాక్ అని చెప్పాలి.