
షాకింగ్: 'రాజీనామాపై తలసాని చీటింగ్, కెసిఆర్‌ను తప్పుదోవ పట్టించారు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ నాలుగున్నర కోట్ల మంది ప్రజలను చీట్ చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణ రెడ్డి ఆదివారం నాడు మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన తలసానిపై ముఖ్యమంత్రి కెసిఆర్ చర్యలు తీసుకోవాలన్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సనత్ నగర్ నుండి పోటీ చేసి తలసాని గెలిచారు. అనంతరం టిఆర్ఎస్లో చేరారు. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. దీంతో, తలసాని రాజీనామా చేశారని, సభాపతి వద్ద పెండింగులో చెప్పారు.
అయితే, తలసాని రాజీనామా పైన గండ్ర వెంకట రమణా రెడ్డి ఆర్టీఐ కింద వివరాలు సేకరించారు. అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాశారు. తలసాని రాజీనామా అందలేదని అసెంబ్లీ అధికారుల నుండి సమాధానం వచ్చింది.

దీంతో గండ్ర మండిపడ్డారు. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలను తలసాని చీట్ చేశారన్నారు. తలసాని పైన సుమోటోగా డిజిపి చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్, సభాపతి తదితరులను తలసాని తప్పుదోవ పట్టించారన్నారు. తలసాని పైన సిఎం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై తాము రేపు గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. తలసాని రాజీనామా చేయకుండానే రాజీనామా చేసినట్లు చెప్పారన్నారు.