క్షేమంగా ఇంటికి చేరిన టెక్కీ నీలిమ (పిక్చర్స్)
హైదరాబాద్: ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనుకుని నేపాల్ వెళ్లి అక్కడ వచ్చిన భూకంపంలో చిక్కుకుందని భావించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నీలిమ శుక్రవారం రాత్రి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాదులోని మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన శౌరయ్య న్యాయవాది కూతురు ఆమె. తల్లి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె నీలిమ ధైర్య సాహసాలతో ఎవరెస్ట్ శిఖరాన్ని ఆధిరోహించాలనుకుంది. కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న నీలిమ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన 22మంది బృందంతో ఎవరెస్టు శిఖరాన్ని ఆధిరోహించేందుకు భారత ప్రభుత్వం నుంచి ఎంపిక అయింది.
అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క నీలిమే ఎంపిక అయింది. ఈ క్రమంలో ఎవరెస్టు శిఖరాన్ని ఆధిరోహించాలని ఈనెల 18న ఇంటి నుంచి ఢిల్లీకి వెళ్లింది. అక్కడి నుంచి ఈనెల 19న నేపాల్‌కు వెళ్లింది. కాగా అక్కడ 22 మంది సభ్యులతో కలిసి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు బయలుదేరారు.

క్షేమంగా ఇంటికి..
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లి నేపాల్ భూకంపంతో తల్లడిల్లిన హైదరాబాద్ టెక్కీ నీలిమ క్షేమంగా ఇంటికి చేరుకుంది.

సమాచారం లేకపోవడంతో..
ఆదివారం నేపాల్‌లో భూకంపం రావడంతో అప్పటి నుంచి నీలిమ ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారంతో ఊపిరి పీల్చుకున్నారు..
కాగా రెండు రోజుల అనంతరం నీలిమ క్షేమంగా ఉందన్న సమాచారం ఫోన్లో రావడంతో కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు.

నెమరేసుకున్న నీలిమ..
కాగా శుక్రవారం రాత్రి ఆమె ఢిల్లీకి వచ్చి అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. నీలిమ భూకంపం అనుభవాలను మీడియా వద్ద నెమరేసుకున్నారు.