ఆర్థిక మాంద్యానికి విరుగుడు అదే.. బడ్జెట్ ప్రసంగంలో సీక్రెట్ చెప్పిన హరీష్ రావు
తెలంగాణ బడ్జెట్ 2020లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు స్పష్టమైంది. ఇరిగేషన్, వ్యవసాయం రంగాల అభివృద్ది లక్ష్యంగా మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం సాగింది. స్థిరాభివృద్ధికి మూల స్తంభం పెట్టుబడి వ్యయం. ఆర్థిక శాస్త్రంలో గోల్డెన్ రూల్ ప్రకారం పలు సంస్థల నుంచి తెస్తున్న రుణాలన్నింటినీ పెట్టుబడి వ్యయం కోసమే ప్రభుత్వం వినియోగిస్తున్నదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన కీలక అంశాలు ఇవే..

నిరర్థక ఆస్తులు అమ్మడం ద్వారా
దేశానికి స్ఫూర్తిగా నిలిచన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కోసం నిధులను పూర్తిస్థాయిలో కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఉనికిలో లేని దశలో ప్రభుత్వం హౌసింగ్ బోర్డు, రాజీవ్ స్వగృహ లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది. వర్తమాన కాలంలో రియల్ ఎస్టేట్ రంగం పెద్ద పరిశ్రమగా విస్తరించింది. ప్రభుత్వ రంగంలోని రాజీవ్ స్వగృహ తరహాలో నిరర్ధకంగా పడి ఉన్న ఆస్తులను పారదర్శకంగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాలు లాంటి సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచుకొంటామని అన్నారు.

2018-19 ప్రకారం ప్రొవిజినల్ అకౌంట్లు
2018-19 ఆర్థిక సంవత్సరం ప్రకారం ఖర్చు అయిన మొత్తం రూ.157150.80 కోట్లు
రెవెన్యూ మిగిలు రూ.43337.8 కోట్లు
ద్రవ్యలోటు రూ.26943.87 కోట్లు

2019-20 సవరించిన అంచనాలు
గత సంవత్సరానికి మొత్తం అంచనా వ్యం రూ.142152.58 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.110824.77 కోట్లు
మూలధన వ్యయం రూ.13165.72 కోట్లు
సవరించిన అంచనాల ప్రకారం.. రెవెన్యూ ఖాతాలో మిగిలు రూ.103.55 కోట్లు

2020-21 బడ్జెట్ అంచనాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యయ ప్రతిపాదన రూ.182914.42 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.138669.82 కోట్లు
మూలధన వ్యయం రూ.22061.18 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.4482.12 కోట్లు
ఆర్థిక లోటు రూ.33191.25 కోట్లు

ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే
బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి హరీష్ రావు ముగిస్తూ.. ఆర్థిక మాంద్యానికి విరుగుడు ప్రజల కొనుగోలు శక్తిని పెంచడమే. సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నది. ప్రజల కొనుగోలు శక్తిని అంతకంతకూ పెంచడం, పెట్టుబడి వ్యయానికి నిధులు వినియోగించం అనే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఆర్థికాభివృద్దిని సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నది అని హరీష్ రావు ప్రసంగాన్ని ముగించారు.