రేపు తెలంగాణా కేబినేట్ అత్యవసర భేటీ; ధాన్యం కొనుగోలుపై కీలకనిర్ణయం తీసుకోనున్న కేసీఆర్
తెలంగాణ మంత్రివర్గం మంగళవారం నాడు అత్యవసరంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. ధాన్యం కొనుగోలు పై కేంద్రం వైఖరిని ఈ భేటీలో చర్చించి, తదుపరి భవిష్యత్తు ప్రణాళిక పై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మంగళవారంనాడు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం
సోమవారం నాడు ఢిల్లీలో ధాన్యం కొనుగోలు చేయాలని, దేశమంతా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల డెడ్లైన్ విధించారు సీఎం కేసీఆర్. ఈలోపు ధాన్యం కొనుగోలు పై నిర్ణయాన్ని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో తాజాగా మంగళవారంనాడు క్యాబినెట్ భేటీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్... క్యాబినెట్ భేటీలో ధాన్యం సేకరణపై చర్చ
ఈ భేటీలో ధాన్యం కొనుగోలు పై ఎటువంటి విధానాన్ని అనుసరించాలన్న నిర్ణయం తీసుకునే అవకాశముంది. 24 గంటలు డెడ్లైన్ విధించిన కెసిఆర్ ఈ సమయంలో కేంద్ర నిర్ణయం తీసుకున్నా, తీసుకోకపోయినా ఆయా విషయాలపై భేటీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు. మంగళవారం ధాన్యం కొనుగోలు విషయంలో కెసీఆర్ కీలక ప్రకటన చేయ్యనున్నారని సమాచారం.

ఢిల్లీ దద్దరిల్లేలా మహా ధర్నా చేసిన టీఆర్ఎస్
యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాని నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఢిల్లీ దద్దరిల్లేలా మహా ధర్నా నిర్వహించింది. ఇక ఈ నేపథ్యంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని, రైతు ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఎవరితోనైనా గొడవ పడండి కానీ రైతులతో పెట్టుకోకూడదని కెసిఆర్ కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు. కేంద్రాన్ని ఎదిరించే సత్తా రైతులకు ఉందని పేర్కొన్న కెసిఆర్, రైతులను కన్నీళ్లు పెట్టిస్తే ఆ పాపం ఊరికే పోదు అంటూ విమర్శించారు.

బీజేపీ సర్కార్ పై పోరు ఉదృతం చెయ్యటం కోసం కెసీఆర్ ప్లాన్
తెలంగాణ రైతాంగం చేసిన పాపం ఏమిటో చెప్పాలని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఎవరు శాశ్వతంగా ఉండరు అని పేర్కొన్న కేసీఆర్, తెలంగాణలో ఓట్లు కావాలి సీట్లు కావాలి కానీ తెలంగాణ రైతులు సాగుచేసిన ధాన్యం వద్దా అంటూ బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇక నేడు కేసీఆర్ ఢిల్లీలో మహాధర్నా ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. దాదాపు పది రోజుల తర్వాత కెసిఆర్ తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహించి కేంద్రంలోని బిజెపి సర్కార్ పై పోరును మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.