నయా రాజకీయం: నరేంద్రమోడీ బాటలో కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ మధ్య రోజురోజుకు రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎవరికి వారు వ్యూహాలు, ప్రతివ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పదునైన పదజాలంతో ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఉంటే నరేంద్రమోడీ బాటలో కేసీఆర్ సాగడమేంటనే అనుమానం మీకు రావచ్చు. కానీ ఒకసారి చదవండి..!!

తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ప్రచారం
2014లో దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. గుజరాత్ వెలిగిపోతోంది.. మోడీ ప్రధానమంత్రి అయితే ఇండియా కూడా వెలిగిపోతుంది.. అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుందంటూ గుజరాత్ మోడల్‌ను ప్రచారం చేశారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు దేశంలో మరెక్కడా జరగడంలేదని, అభివృద్ధికి చిరునామాగా తెలంగాణ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారు.

జాతీయ రాజకీయాలపై తీవ్రస్థాయిలో చర్చలు
అప్పట్లో నరేంద్రమోడీకి ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోరే వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 10 రోజుల నుంచి పూర్తిగా ఫామ్‌హౌస్‌లోనే ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాలపై పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులతో తీవ్రస్థాయి చర్చలు సాగిస్తున్నారు. కేసీఆర్‌తోపాటు ఈ చర్చల్లో ప్రకాష్‌రాజ్ కూడా పాల్గొన్నారు. రేపో, ఎల్లుండో ప్రశాంత్‌కిషోర్ వీరితో కలవనున్నారు.

దేశవ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిపై ప్రకటనలు
జాతీయ రాజకీయాలవైపు వెళ్లాలని కేసీఆర్ ఎప్పుడైతో యోచన చేశారో అప్పటినుంచే వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ మోడల్ అభివృద్ధి పథకాల ప్రచారం ప్రారంభమైంది. జాతీయ మీడియాలో కూడా ప్రకటనలు ఇస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి దేశమంతా జరగాలంటూ టీఆర్ ఎస్ డిమాండ్ చేస్తోంది. జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో ప్రచారం చేయించేందుకు టీఆర్ ఎస్ సర్కార్ తెలంగాణ అభివృద్ధి, పథకాలపై వీడియోలు తయారుచేయిస్తోంది. వీటికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా నరేంద్రమోడీ ఏ ప్రణాళికలు రచించుకొని హస్తినాపురం పీఠాన్ని అధిరోహించారో అదే తరహా ప్రచారంతో కేసీఆర్ కూడా ముందుకు వెళుతుండటం విశేషం.