రూటు మార్చిన గులాబీ బాస్: ఆ రెండు ఓటుబ్యాంకులపై ఫోకస్: సురభి వాణీదేవికి బీఫాం
హైదరాబాద్: తెలంగాణలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొంది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండబోతోంది. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ జన సమితితో పాటు కొందరు స్వతంత్ర అభ్యర్థుల నుంచీ గట్టిపోటీని తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనబోతోంది. తొలుత- దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆ తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా ప్రతికూల ఫలితాలను చవి చూసిన అనుభవం ఉన్నందున ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

చెమటోడ్చక తప్పనట్టే..
వరంగల్-ఖమ్మం-నల్గొండ, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే టీఆర్ఎస్ శ్రమించక తప్పని పరిస్థిితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీలో నిలిచారు. తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు కుమార్తె సురభి వాణిదేవిని పోటీలో దింపింది టీఆర్ఎస్. దీనికి సంబంధించిన టీఆర్ఎస్ చీఫ్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొద్దిసేపటి కిందటే ఆమెకు బీఫామ్‌ను అందజేశారు.
ఫోటోలు: జీహెచ్ఎంసీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన గద్వాల విజయలక్ష్మీ

కోదండరామ్.. నాగేశ్వర్ సహా
ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో టీఆర్ఎస్కు గట్టి పోటీ ఎదురు కానుందనే అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రొఫెసర్ నాగేశ్వర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తోన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇదివరకు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వామపక్షాల మద్దతుతో విజయం సాధించారు. మరోసారి ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నుంచి తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ పోటీ చేయనున్నారు.

మహిళకు ఛాన్స్ ఇవ్వడం వల్ల..
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మహిళకు అవకాశం ఇవ్వడం వల్ల లాభిస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. దానికితోడు- పీవీ నరసింహా రావు కుమార్తె కావడం వల్ల కాంగ్రెస్ ఓటుబ్యాంకుతో పాటు తటస్థులు కూడా సురభి వాణిదేవి వైపు మొగ్గు చూపుతారని భావిస్తోంది. ఇదివరకు ఎదురైన చేదు ఫలితాలు ఈ సారి పునరావృతం కానివ్వకూడదనే పట్టుదల టీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో కనిపిస్తోంది. అందుకే- వివాదరహితులుగా పేరున్న సురభి వాణిదేవికి టీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందన అభిప్రాయాలు ఉన్నాయి.