హెచ్డీ దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ లంచ్ మీట్: దేశ రాజకీయాలపై కీలక చర్చ
హైదరాబాద్/బెంగళూరు: జాతీయ రాజకీయాలే ఎజెండాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలు కొనసాగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు చేరుకున్నారు కేసీఆర్. ఆయనకు జేడీఎస్ అగ్రనేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లారు.

దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ లంచ్ భేటీ: రాజకీయ చర్చలు
దేవెగౌడ నివాసంలోనే సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్తో సహా పలువురు నేతలు మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం దేవెగౌడ, కుమారస్వామితో కలిసి భేటీ అయ్యారు. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ కూడా భేటీలో పాల్గొన్నారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.

దేశ రాజకీయాలపై దేవెగౌడ, కుమారస్వామితో కేసీఆర్ చర్చలు
దేశంలో రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్... అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చలు కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ప్రాంతీయ పార్టీల పాత్ర, తదితర అంశాలపై కూడా సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఈ సాయంత్రానికి హైదరాబాద్కు కేసీఆర్
కాగా, కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది అంతకుముందే బెంగళూరు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తిరిగి సాయంత్రం 4 గం.కు బెంగళూరు నుంచి బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.కాగా, ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో మోడీ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండటం ఇది మూడోసారి కావడం గమనార్హం.