తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత: ఫైలుపై కేసీఆర్ సంతకం
హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సంతకం చేశారు.
విధి నిర్వహణలో భాగంగా పలు సందర్భాల్లో అనవసర వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని గతంలో ఆర్టీసీ ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగులకు వేధింపులు లేకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారుల కమిటీ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ దస్త్రంపై కేసీఆర్ గురువారం సంతకం చేశారు. కేసీఆర్ నిర్ణయంపై ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పీవీ జ్ఞాపకార్థం పోస్టల్ స్టాంప్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదన మేరకు భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం తపాలా బిల్ల విడుదల చేయాలని నిర్ణయించడం పట్ల టీఆర్ఎస్ లోక్‌సభపక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గురువారం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర న్యాయ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు లేఖ రాసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ బిడ్డ, బహుబాషా కోవిదుడు, గొప్ప ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా ఖ్యాతిగడించిన పీవీ నరసింహారావు శత శతాబ్ది సంవత్సర సందర్భంగా కేంద్రం ఆయన పేరుతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయాలని నిర్ణయించిందని నామ వెల్లడించారు. పీవీ సేవలను గుర్తించి ఆయనకు భారతరత్న ఇవ్వాలని నామ కేంద్రాన్ని కోరారు. అలాగే ఆయన ఫొటోను పార్లమెంటు హాలులో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో కేంద్రాన్ని కోరినట్లు నామా గుర్తు చేశారు.