వాడివేడిగా కాంగ్రెస్ సమావేశం: నాశనం చేస్తున్నారంటూ నేతలపై డీకే అరుణ నిప్పులు
హైదరాబాద్: గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అంతేగాక, కొత్త జిల్లాలకు డీసీసీ ఏర్పాటు చేయాలని నాయకులు కోరినట్టు తెలుస్తోంది. విభజన హామీల అమలుకు పోరాటం చేయాలని సమావేశంలో తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో కుంతియా, ఉత్తమ్, షబ్బీర్, భట్టి, డీకే అరుణ, పొంగులేటి హాజరయ్యాయి. అయితే పలువురు నేతల ఢిల్లీ పర్యటనపై వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి నిలదీశారు. రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్తే ఎవరూ వ్యతిరేకించరని, మీడియాలో చర్చ జరిగేలా నేతలు మాట్లాడ్డం సరికాదని, అలా మాట్లాడం వల్ల పార్టీకి నష్టం పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు.

నేతలపై డీకే అరుణ ఆగ్రహం
అయితే పొంగులేటి మాట్లాడుతుండగా.. డీకే అరుణ, మల్లు భట్టి అడ్డుకున్నారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డిలను ఎవరికీ చెప్పకుండా పార్టీలోకి తీసుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి పార్టీ వీడుతుంటే.. ఎందుకు పట్టించుకోలేదని డీకే అరుణ మండిపడ్డారు. నాగం జనార్ధన్ రెడ్డి చేరికపై దామోదర్‌రెడ్డితో ఎందుకు చర్చించలేదని ఆమె ప్రశ్నించారు.
టీఆర్ఎస్ నుంచి పలువురు కాంగ్రెస్‌లో చేరతామంటే పీసీసీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట్ నుంచి శివకుమార్‌రెడ్డి, జడ్చర్ల నుంచి ఎర్రశేఖర్ కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారని డీకే చెప్పారు. కొందరిని ఎవరితో చర్చించకుండా పార్టీలో చేర్చుకుంటున్నారని, మరికొందరిని పార్టీలోకి రాకుండా ఎందుకు ఆపుతున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కొనసాగుతారు
టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా స్పష్టం చేశారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్‌ని టీపీసీసీ చీఫ్‌గా కొనసాతారని వెల్లడించారు. పార్టీ నేతలు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఉత్తమ్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదని కుంతియా చెప్పారు.
తెలంగాణకు ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు
తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటకకు చెందిన ఎస్ఎస్ బోస్‌రాజు, సలీం అహ్మద్, కేరళకు చెందిన శ్రీనివాసన్ కృష్ణన్‌లను పార్టీ నియమించింది.