టీఆర్ఎస్ కార్యకర్తల్లా పోలీసులు.. ప్రజలకు రక్షణ లేదంటూ గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు మరో సారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. ప్రజల ధన , ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు.
గవర్నర్‌తో సీఎల్పీ నేతల భేటీ
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను కాంగ్రెస్ నేతలు కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. వనమా రాఘవ దాష్టికం, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో న్యాయవాదుల హత్య ఘటనలతో పాటు వివిధ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో పోలీసులు నుంచి రక్షణ ఉంటుందనే భావన ప్రజలు కోల్పోయారని తెలిపారు.

టీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో పోలీసులు
రాష్ట్రంలో పోలీసులు రాజ్యాంగం ప్రకారం ప్రకారం తమ విధులను నిర్వర్తించడంలేదని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ నేతలు చెప్పినట్లే పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. పోలీస్ శాఖపై సమీక్ష నిర్వహించి.. తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసైను కోరారు. పోలీసులు స్వేచ్ఛగా పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్ పాలనకు గుణపాఠం తప్పదు
తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పోలీస్ వ్యవస్థను నిర్వర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం సామాన్యులు పోలీసులను ఆశ్రయించినా.. న్యాయం జరగకపోగా అవమానాలకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కేసీఆర్ పాలనను ప్రజలు చీదరించుకుంటున్నారని దుయబట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భట్టి విమ్శలు గుప్పించారు.